పావలా కోడికి.. ముప్పావలా మసాలా… జగన్ సర్కారు వృథా వ్యయం
జగనన్న సర్కారు ప్రచార పటాటోపం ఎక్కువైందనిపిస్తోంది. మీడియా పబ్లిసిటీకి, భారీ ప్రారంభోత్సవాలకు కోట్లాది రూపాయలు వ్యయం చేస్తోంది. ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన రాష్ట్రం నెత్తిన మరింత భారాన్ని మోపుతోంది. అప్పులు పుట్టక సకాలంలో జీతాలు అందించక నానా తంటాలు పడుతూనే వృథా వ్యయాన్ని మాత్రం తగ్గించడం లేదు. పావలా కోడికి.. ముప్పావలా మసాలా.. వాడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు…
మాటలు కోటలు దాటతాయి. చేతలు గుమ్మాలు దాటవు.. తామెంతో చేసేస్తున్నామంటారు. తామే వారి ఉధ్దారకులమనే బిల్డప్ లు ఇస్తుంటారు. చివరకు మాత్రం చిల్లర చేతిలో పెట్టి గొప్పలు చెప్పుకుంటారు.. గోరంత సాయానికి వారు కొండంత ఖర్చుచేస్తారు.. పైగా ప్రారంభించిన పథకాలనే మళ్లీ ఫంక్షన్లు నిర్వహిస్తూ ప్రజాధనం నీళ్లపాలు చేస్తారు. బటన్ నొక్కుడు ప్రచారానికి కోట్లు ఖర్చుచేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు పబ్లిసిటీ పిచ్చి అని పదేపదే చెప్పుకొస్తారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనత ఇది.
ఏటికేడు క్యాలెండర్ లు, సంక్షేమ క్యాలెండర్లు ప్రకటిస్తారు. ఆ సాయం అంత… ఈసాయం ఇంత అంటూ మీడియాలో ఊదరగొడతారు. ఒకే కార్యక్రమాన్ని ఏటికేడు ప్రారంభించడమే కాకుండా కార్యక్రమం ప్రారంభించిన ప్రతిసారి మొదటి విడుత, రెండవ విడుత, మూడవ విడత, నాల్గవ విడుత అంటూ విస్త్రుత ప్రచారం చేస్తారు. ఇచ్చేది గోరంతయినా ఆంగ్ల, తెలుగు పత్రికల్లో ఫుల్ పేజి యాడ్లు తో నింపేస్తారు. సాయంకంటే ప్రచారానికి యాడ్లు, హోర్డింగ్ లు, మీటింగ్ లు కోసం కోట్లకు కోట్లు ఖర్చుచేస్తున్నరనే ఆరోపణలు ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లా మురమళ్ళ లో ముఖ్యమంత్రి జగన్ మత్స్యకార బరోసా కార్యక్రమాన్ని నాల్గవసారి ప్రారంభించారు. వేట నిషేద సమయంలో ఏప్రిల్ 15నుండి జూన్ 14 మధ్య కాలంలో 109 కోట్ల రూపాయలు ఆర్ధిక సాయం చేస్తున్నట్టు గొప్పగా ప్రకటించారు. ఒక రోజు సభకు పది కోట్లు ఖర్చయ్యిందని చెబుతున్నారు. భరోసా సోమ్ము ద్వారా ఇచ్చే అసలు కంటే కొసరుకు ఖర్చు ఎక్కువ అని ఇప్పటికే విపక్షాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి.
అత్త సోమ్ము అల్లుడి దానం అన్న చందాన ఏపి ప్రభుత్వం పత్రికలలో ఇచ్చిన నిలువెత్తు మత్స్యకార బరోసా ప్రకటన ఉంది. ముఖ్యంగా ఓఎన్జిసి పైప్ లైన్ లు పనులు కారణంగా నాలుగు నెలల పాటు మత్స్యకార కుటుంబాలు ఉపాధిని కోల్పోతున్నాయని పేర్కోన్న ప్రభుత్వం.. ఓఎన్జీసి ద్వారా వస్తున్న సాయాన్ని తామే ఇప్పించామన్నట్టు ప్రకటనలో చొప్పించడం ఉత్తుత్తి ప్రచారానికి నిదర్శనం.
ఓఎన్జీసీ ఇస్తున్న సాయం 108 కోట్లతో కలపి తాము మరో 109 కోట్లు ఇస్తున్నామని మొత్తంగా 217కోట్లు రూపాయలు విడుదల చేస్తున్నట్టు గొప్పగా పేపర్ ప్రకటనలలో జగన్ సర్కార్ పేర్కోనడం పట్ల అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి…