ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కటే చర్చ. అదే మంత్రివర్గ ప్రక్షాళన. మంత్రులందర్నీ తొలగించి కొత్త వారిని తీసుకోవాలని జగన్ నిర్ణయించారు. అయితే ఒకరిద్దరికి మాత్రం కొనసాగింపు ఉంటుంది. జగన్ ఇలా చేయాలని ప్రమాణస్వీకారం అప్పుడే నిర్ణయించుకున్నారు. కానీ ఇంప్లిమెంట్ ఎంత కష్టమో ఆలోచించలేదు. అలా చేయడం వల్ల వచ్చే సమస్యలను ఆయన అంచనా వేయలేదు. తొలి సారి ప్రభుత్వంలోకి వచ్చారు. అది కూడా ఏకపక్ష విజయంతో వచ్చారు. తిరుగులేని అధికారంతో ఉన్నారు. అందుకే ఆ కాన్ఫిడెన్స్‌తో అలాంటిప్రకటన చేసి ఉంటారు. కానీ ఇప్పుడు మూడేళ్లు ముగిసిపోయాయి. అదే కాన్పిడెన్స్‌తో మంత్రివర్గాన్ని మార్చగలరా? రాజకీయంగా వచ్చే సమస్యలను ఎదుర్కోగలరా ?
మంత్రి పదవులు పోతే అందరికీ అసంతృప్తే !
మంత్రి పదవి అనేది రాజకీయంగా ప్రతి ఎమ్మెల్యే లక్ష్యం. ఓ సారి పదవిలోకి వస్తే ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం మంత్రిగా ఉండాలనుకుంటారు. తనకు పదవి వద్దు అనే చెప్పే ఎమ్మెల్యే అబద్దం చెబుతున్నారనే అనుకోవాలి. అలాగే మంత్రివర్గం నుంచి తీసేస్తాం అంటే స్వాగతించే మంత్రి కూడా ఉండరు.పైకి అలా చెప్పారంటే తాను ఎంతో విధేయుడ్నని.. తనను తీసేయవద్దని సంకేతాలు పంపడమే. ప్రస్తుతం ఏపీలో ఇదే జరుగుతోంది. మంత్రులు జగన్‌పై వీరవిధేయత ప్రకటిస్తూ.. తీసేసినా సంతోషమేంటున్నారు. ఇలాఅనడం వెనుక వారి అసంతృప్తి స్పష్టంగానే కనిపిస్తోంది. ఇలాంటి ప్రకటనల్ని అనుకూలంగా తీసుకుని జగన్ ముందడుగు వేస్తారని కూడా అనుకోలేం.
మంత్రులుగా తీసేసి గెలుపు బాధ్యతలిస్తే తీసుకుంటారా ?
మంత్రుల్ని తొలగించి వారికి పార్టీ బాధ్యతలిస్తామని వైసీపీ హైకమాండ్ ప్రకటించింది. కొంత మందికి జిల్లా అధ్యక్ష బాధ్యతలిస్తారు. మాజీ లు కాబోయే బీసీ మాజీ మంత్రులకు చైతన్యయాత్రల పని పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని వస్తే మళ్లీ మీరే మంత్రులని హామీ ఇస్తున్నారు. కానీ మంత్రిపదవులు ఉండి పవర్ ఉంటేనే.. తాము ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నం చేయగలుగుతాము కానీ ఇతరులకు పదవులు ఇచ్చి తమను గెలిపించుకు రమ్మంటే ఎలా అనే వాదన వారిలో ఇప్పటికే ప్రారంభమైంది. మంత్రి పదవులు తీసేయడం అంటేనే పక్కన పెట్టడమనే రాజకీయం తెలియని వారు కాదు మంత్రులు. అందుకే ఇప్పటికే తమను మంత్రులుగా కొనసాగిస్తే ఎలాంటి గెలుపు బాధ్యతలు తీసుకుంటామో సంకేతాలను హైకమాండ్‌కు పంపుతున్నారు.
కొత్తవారు కుదురుకోకపోతే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లే !
మంత్రివర్గం అంటే అందర్నీ సమర్థుల్నితీసుకోలేరు. కుల, మత ప్రాంతాల్ని సమన్వయం చేసుకోవాలి. ఇలాంటి ఈక్వేషన్స్‌లో కొంత మంది అశక్తుల్ని కూడా మంత్రుల్ని చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ఎన్నికలు రెండేళ్లలో ఉన్నాయి. ఇప్పటి నుంచే ఎన్నికల సన్నాహాలు చేసుకోకపోతే్.. కష్టం. ఓ రకంగా జగన్ ఎంచుకోబోయేది ఎన్నికల టీం. వారు పదవుల్లో కుదురుకోకపోతే.. మొత్తం రివర్స్ అయిపోతోంది. ప్రస్తుత మంత్రుల్లో మూడేళ్లయినా శాఖలపై పట్టు సాధించలేని వారు కూడా ఉన్నారన్న అభిప్రాయం ఉంది. అందుకే.. జగన్ రాజకీయ సమీకరణాల కోసం..రాజకీయంగా పెద్ద స్టెప్ వేస్తున్నారని.. దీని వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని రాజకీయవర్గాల అంచనా.