– ఏపీకి ఒకే రాజధానా? 3 రాజధానులా?
– నవంబర్ 1న సుప్రీంకోర్టులో విచారణ
– రాజధాని రాజకీయానికి తెరపడే ఛాన్స్
ఏపీకి అసలు రాజధాని ఏదో? తేలిపోయే సమయం ఆసన్నమైందా? రాష్ట్రంలో అమరావతి వర్సెస్ మూడు రాజధానులుగా సాగుతున్న ముమ్మర పోరుకు శుభం కార్డు పడే సమయమొచ్చిందా?అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం.. తీర్పు సరిగా అమలు కావడం లేదంటూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్ లపైనా సుప్రీంకోర్టులో నవంబరు1న విచారణ జరగనుంది. దీంతో, ఆ రోజు ఏం జరగబోతుందనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రానికి ఒకే రాజధానా? మూడు రాజధానులా? అన్నది సుప్రీంకోర్టు తీర్పుతో తేలిపోయే అవకాశం కనిపిస్తోంది.
2014ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రకటించి ముందుకెళ్లింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు రాజధానులను తెరపైకి వచ్చింది. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ప్రకటిస్తూ బిల్లు కూడా సభలో పెట్టింది. అయితే, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బిల్లును ఉపసంహరించుకుంది. మరోసారి వైసీపీ సర్కార్ మూడు రాజధానుల పోరును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో…అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతులు మళ్లీ ఉద్యమ బాట పట్టారు.
అమరావతి టు అరసవిల్లికి పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం అనుమతివ్వకపోయినా హైకోర్టు అనుమతితో రైతులు ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. మధ్యలో వైసీపీ శ్రేణులు నిరసనలకు దిగడంతో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చివరికి హైకోర్టు గతంలో విధించిన నిబంధనల మేరకే పాదయాత్ర చేయాలని చెప్పడంతో పోలీసులు ఆంక్షల్ని కఠినతరం చేశారు. దీంతో, అసలుకే పాదయాత్రకు బ్రేక్ పడింది. మంగళవారం సిజెఐ జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ అజరు రస్తోగి, జస్టిస్ రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అమరావతి రాజధానిపై విచారించనుంది. ఈ విచారణ రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. రాజధాని కోసం జరుగుతున్న రాజకీయ పోరాటాలకు పులిస్టాప్ పడే అవకాశముంది.