*నష్టం కాంగ్రెస్‌కా? బీజేపీకా? ఆప్ లెక్కలేంటి?
*గుజరాత్ గెలిస్తేనే బీజేపీ భవిష్యత్తుకి భరోసా
గుజరాత్ రాజ్‌కోట్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత పైకి వాటర్‌బాటిల్ దూసుకొచ్చింది. జస్ట్‌మిస్. తలమీదినుంచి వెళ్లిపోయింది. తగిలినా కేజ్రీవాల్ పెద్దగా పట్టించుకునేవారుకారేమో. ఎందుకంటే గుజరాత్‌లో అధికారపార్టీ అసహనం ఏదోరూపంలో ఎదురవుతుందని ఆయన ముందే మానసికంగా సిద్ధమై ఉన్నారు. గుజరాత్‌లో చీపురుకట్ట సత్తా చాటాలని పట్టుదలతో ఉన్న కేజ్రీవాల్ ఇవన్నీ మంచి శకునములే అనుకుంటున్నారు.
ఇప్పటిదాకా బీజేపీ గెలిచిన రాష్ట్రాలు ఓ లెక్క. గుజరాత్ మరో లెక్క. ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో మరోసారి విజయం దక్కితేనే బీజేపీ జబ్బలు చరుచుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ డీలాపడిందని సంబరపడ్డ కమలం పార్టీకి కేజ్రీవాల్ రూపంలో కొత్త సవాలు ఎదురైంది. మరోసారి గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకొస్తే అదో కొత్త రికార్డు. కానీ పంజాబ్ విజయం తర్వాత ఆమ్‌ఆద్మీపార్టీ గుజరాత్‌పై గట్టిగా గురిపెట్టింది. గట్టిపోటీనివ్వడం కాదు..అధికారం తమదేనని కేజ్రీవాల్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు.
మార్జిన్ తక్కువేకానీ మెజారిటీ తమకేనంటున్నారు కేజ్రీవాల్. ఆమ్‌ఆద్మీ దెబ్బకు బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటయ్యాయంటున్నారు. గుజరాత్ ప్రచారంలో కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఏబీపీ న్యూస్- సీ ఓటర్ ఒపీనియన్ పోల్ గుజరాత్ ఫలితాలపై ఆసక్తిరేపుతోంది. మళ్లీ విజయం బీజేపీదేనని ఆ సర్వే తేల్చినా…ఆప్ తమ ఓట్లకు గండికొడుతుందని బీజేపీ, కాంగ్రెస్ కలవరపడుతున్నాయి. 2017లో 99 స్థానాలతో అధికారం దక్కించుకున్న బీజేపీ సీట్లు పెరుగుతాయన్న అంచనాతో ఉన్నా..అధికారపార్టీకి ఆమ్‌ఆద్మీ పంటికిందరాయిలా ఉంది. పంజాబ్ మ్యాజిక్ కుదరకపోవచ్చేమోగానీ మొత్తానికి గుజరాత్‌లో కేజ్రీవాల్ పార్టీ చెప్పుకోదగ్గ ఓట్లనైతే చీల్చబోతోంది. మరి అది ఎవరిని ముంచుతుందో? ఎవరిని గట్టెక్కిస్తుందో?