సీఐడీ కేసుల్లో అయ్యన్న ఫ్యామిలీ
ఫోర్జరీ పత్రాలు సృష్టించిన కేసులో..
అయ్యన్న, తనయుడు రాజేష్ అరెస్ట్
భగ్గుమన్న టీడీపీ..రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
ఇటీవల చింతకాయల విజయ్‌కు నోటీసులు
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అరెస్ట్ వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. సీఐడీ నోటీసులు, అరెస్ట్ లతో అయ్యన్న కుటుంబం వరుసగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల సీఎం సతీమణిపై ఐటీడీపీ పేరుతో దుష్ర్పచారం చేస్తున్నారన్నారంటూ…అయ్యన్న తనయుడు విజయ్ కు సీఐడీ నోటీసులు పంపింది. దాంతో, విజయ్ కోర్టును ఆశ్రయించారు. ఇక, తాజాగా అయ్యన్నపాత్రుడు, ఆయన మరో తనయుడు రాజేష్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. తెలవారు జామున నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటిని చుట్టుముట్టిన సీఐడీ…తండ్రీ, కొడుకులను అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటివెనకాల ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో …. సీఐడీ అధికారులు అయ్యన్నపాత్రుడు, రాజేశ్ లను అరెస్ట్ చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్ల మేర స్థలంలో…. అక్రమంగా ప్రహరీ నిర్మాణం చేపట్టారని ఇరిగేషన్ అధికారులు సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు అయ్యన్న కుటుంబ సభ్యుల సమర్పించినవి ఫోర్జరీ పత్రాలుగా నిర్ధారించారు. అయ్యన్న ఫ్యామిలీ అసిస్టెంట్ ఇంజనీర్ ను ఇంటికి పిలిపించి బెదిరించి సంతకం చేయించినట్లు అధికారులు తెలిపారు.
అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ ను సీఐడీ, దాదాపు 200 మంది పోలీసుల్ని తీసుకొచ్చి అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అరెస్టు సమయంలో సీఐడీ వ్యవహారశైలిని అయ్యన్న కుటుంబ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో సీఐడీ దీనిపైనా వివరణ ఇచ్చింది. నిందితుడు అరెస్టుకు సహకరించకపోతే బలవంతంగా తీసుకెళ్లొచ్చని నిబంధనలు చెబుతున్నాయని వివరణ ఇచ్చారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు, రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు. అయ్యన్నపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అన్ని ఆధారాలు ఉన్నందున చట్టబద్ధంగానే ఇద్దరినీ అరెస్టు చేసినట్లు సీఐడీ ప్రకటించింది. ఇదిలా ఉంటే, అయ్యన్న అరెస్ట్ పై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పోలీసులు, ప్రభుత్వ తీరుపై మండిపడుతూ నిరసనలకు దిగాయి. న్యాయస్థానంలో పోరాటానికి సిద్ధమయ్యారు.
ముఖ్యమంత్రి జగన్ ఒక రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అర్థరాత్రి దొంగల్లా ఇంటిమీద పడి అయ్యన్నను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అయ్యన్న కుటుంబాన్ని జగన్ మూడేళ్లుగా వేధిస్తున్నారని మండిపడ్డారు బాబు. ఉత్తరాంధ్ర దోపిడీకి పాల్పడుతున్న వైసీపీని ప్రశ్నిస్తున్నందుకే అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. ఇప్పటికే పదికి పైగా కేసులు పెట్టారని, విజయ్ కేసులో హైకోర్టు తప్పు బట్టినా పోలీసుల తీరులో మార్పు రావటం లేదని బాబు దుయ్యబట్టారు. బీసీల మీద జగన్ దాడులకు పాల్పడుతున్నారని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నందుకే, టీడీపీ నేతలపై జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. మొత్తంగా, వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రలో అధికార పార్టీ ఆందోళనలకు సిద్ధమైన వేళ…వైసీపీకి కౌంటర్ గా టీడీపీ అక్కడ పోరాటాలు ప్రారంభించడంతో రాజకీయం సెగలు కక్కుతోంది. అయ్యన్న అరెస్ట్ తో ఈ వ్యవహారం మరింత ముదురుతోంది.