ఏపీలో బీజేపీ గేమ్ ప్లాన్ మారిందా..?

By KTV Telugu On 5 August, 2022
image

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయ్. నిన్నమొన్నటి వరకు ఉప్పునిప్పులా ఉన్న టీడీపీ, బీజేపీలు…క్రమంగా దగ్గరవుతున్నాయ్. బీజేపీ నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమాలకు…చంద్రబాబుకు ఆహ్వానం పంపుతోంది. ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు…చాలా కాలం తర్వాత ఒకే వేదికపైకి రాబోతున్నారు. మారుతున్న రాజకీయాలతో…వైసీపీ నేతలకు టెన్షన్‌ మొదలైంది.

ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయ్. టీడీపీ అధినేత చంద్రబాబుకు…కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న చర్చ జోరుగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడంతో…దారుణంగా దెబ్బతిన్నాయ్. బీజేపీ ఒక్క సీటు గెలవలేకపోయింది. అటు తెలుగుదేశం పార్టీ 23 అసెంబ్లీ సీట్లకు పరిమితమైంది. వైసీసీ సింగిల్‌గా పోటీ చేసి 151 నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత రెండు పార్టీ నేతలకు జ్ఞానోదయమైనట్లు తెలుస్తోంది. విడిపోయి నష్టపోయే కంటే…కలిసి నడిస్తే మంచి ఫలితాలు వస్తాయని రెండు పార్టీ నేతలు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే దూరం చేసుకున్న తెలుగుదేశం పార్టీ…మళ్లీ దగ్గరకు తీసుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ముఖ్యమైన కార్యక్రమాలకు టీడీపీకి ఆహ్వానం పంపుతోంది.

వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే…చంద్రబాబుపై బీజేపీకి కోపం క్రమంగా తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర సర్కార్ నుంచి పిలుపు వచ్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్..నేషనల్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. స్వయంగా కేంద్ర మంత్రి…మాజీ సీఎం చంద్రబాబుకు ఆహ్వానించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఆజాదీ కా అమృత్ ఉత్సవాలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన…రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ఈ సమావేశం జరగనుంది. చాలా కాలం తర్వాత ప్రధాని మోడీతో కలిసి సమావేశంలో పాల్గొనబోతున్నారు చంద్రబాబు.

జులై 4న భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొనే అల్లూరి జయంతి కార్యక్రమానికి చంద్రబాబుకు పిలుపు వచ్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో భాగస్వాములు కావాలని కోరారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నట్లు టీడీపీ-బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబుకు కేంద్ర సర్కార్ పిలుపు రావడంతో టీడీపీ కేడర్‌లో సంతోషం వ్యక్తమవుతోంది. టీడీపీ, బీజేపీ కలిస్తే…రెండు పార్టీలకు మంచి జరుగుతుందని…వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించవచ్చని నేతలు, కార్యకర్తలు అంచనా వేస్తున్నారు. వైసీపీని ఓడించాలంటే రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చంద్రబాబుకు ఢిల్లీ ఆహ్వానంపై వైసీపీ నేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ నేతలు…వరుసగా ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానిస్తుండటంతో…వైసీపీ వణుకు మొదలైంది. ఆ రెండు పార్టీ కలిసి పోటీ చేస్తే…వచ్చే ఎన్నికల్లో తమకు ఇబ్బందులు తప్పవని కొందరు నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో బీజేపీకి సన్నిహితంగా ఉన్న వైసీపీ నేతలు…చంద్రబాబుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారు. వైసీపీ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని…టీడీపీని పట్టించుకోవడం లేదంటూ బీజేపీ అగ్రనేతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది.