నందమూరి హీరోపై మండిపడ్డ నాని
సిగ్గుందా బాలకృష్ణ అంటూ ఆగ్రహం
తండ్రి చావుకు కారణమైన వ్యక్తితో..
షోలు చేయడానికి సిగ్గులేదా అంటూ ఫైర్
మాజీ మంత్రి కొడాలి నాని నందమూరి హీరోపై నిప్పులు చెరిగారు. ఎప్పుడూ టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ లపై మాత్రమే విరుచుకుపడే కొడాలి నాని..ఈసారి నందమూరి ఫ్యామిలీని టచ్ చేశారు. ఎన్టీఆర్ విషయంలో ఏనాడు నందమూరి కుటుంబాన్ని కొడాలినాని పల్లెత్తు మాట కూడా అనలేదు. కానీ, చంద్రబాబును మాత్రం తీవ్రంగా తిట్టిపోసేవారు. ఎంతలా అంటే తన తిట్ల దండకంతో ప్రతిపక్ష నేతల చేత బూతుల మంత్రి అని పిలుపించుకునేంత స్థాయికి వెళ్లిపోయారు. అయితే, బాలకృష్ణ చంద్రబాబుతో అన్ స్టాపబుల్ షో చేయడంపై కొడాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందులో 1995 నాటి ప్రస్తావన తీసుకురావడం …. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని చెప్పినా వినలేదంటూ సీబీఎన్ చెప్పడంపై కొడాలి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. బాలకృష్ణను కూడా ఏకిపారేశారు.
తన తండ్రి చావుకు కారణమైన చంద్రబాబు ఫ్యామిలీతో షోలు చేయడానికి సిగ్గుండాలి అంటూ బాలకృష్ణపై కొడాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తి ఇంటికి పిల్లనివ్వడమే గాకుండా..షోల పేరుతో ఎన్టీఆర్ ను క్షోభ పెడుతారా అంటూ విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ చనిపోయి 25 ఏళ్లు దాటినా…. కొడుకు, అల్లుడు ఆయనను ఇంకా హింసించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ను మించి నటిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నందమూరి కుటుంబానికి వీరాభిమాని అయిన కొడాలి నాని…ఎప్పుడు బాలయ్యను ఈ స్థాయిలో విమర్శంచలేదు. సిగ్గు ఉందా అంటూ వ్యాఖ్యలు చేయలేదు.
గతిలేక అనేకసార్లు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు.. ఇప్పుడు ప్రజల కళ్లు కప్పే ప్రయత్నం చేస్తున్నాడని కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్కు పార్టీ నడపడం చేతకాకపోతే.. చంద్రబాబు బయటకు పోవాలే తప్ప.. ఆయన దగ్గర నుంచి పార్టీ లాక్కోవడం ఏంటిని ప్రశ్నించారు. మొత్తంగా, బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న అన్స్టాపబుల్ సీజన్ 2లో చంద్రబాబు ఇంటర్వ్యూ రాజకీయంగా దుమారం రేపుతోందనే చెప్పాలి. ప్రోమో విడుదలయితేనే ఇంత రచ్చ అవుతోంది. రేపు అసలు ఎపిసోడ్ ప్లే అయితే ఇంకా ఎలా ఉంటుందోననే చర్చ జరుగుతోంది. కొడాలి లాంటి వీరాభిమానులు…ఈ ఎపిసోడ్ పై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఈ స్ట్రీమింగ్ కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.