సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

By KTV Telugu On 10 October, 2022
image

ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెడితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం బాధాకరమన్నారు బీజేపీ రాష్ట్ర‌ అధ్యక్షుడు బండి సంజయ్ . పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన బ‌హిరంగ‌ లేఖ రాశారు. తక్షణమే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇస్తూ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను సవరించాలని ఆ లేఖలో బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఇటీవల తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన సప్లిమెంటరీ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ మార్కుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మినహాయింపునిచ్చి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మినహాయింపునివ్వక పోవడాన్ని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. ఇంకా ఆయన ఏం రాశారంటే…ఈ నోటిఫికేషన్లో ఎస్సీ, ఎస్టీలకు 20%, బీసీలకు 25%, జనరల్ అభ్యర్థులకు 30% కటాఫ్ మార్కులుగా నిర్ణయించారు. దీంతో 40 మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీలు, 50 మార్కులు వచ్చిన బీసీలు, 60 మార్కులు వచ్చిన జనరల్ అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధిస్తారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ మార్కుల్లో ఎలాంటి మినహాయింపు ఇవ్వకపోవడం వల్ల ప్రిలిమ్స్ లో 60 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారే మెయిన్ పరీక్షకు అర్హులు అవుతారు. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డులో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపునివ్వకపోవడం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధం. ఈ నేపథ్యంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన సప్లిమెంటరీ నోటిఫికేషన్ ను సవరిస్తూ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాసేందుకు ప్రిలిమ్స్ కి 25% అంటే 50 మార్కులను కటాఫ్ గా నిర్ణయించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని బండి సంజయ్ సీఎంకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు.