దాచుకునే వాళ్ల దగ్గర దోపిడీ – బ్యాంకు చార్జీలు రూ. 35వేల కోట్లా ?

By KTV Telugu On 15 August, 2023
image

KTV Telugu ;-

ఏడాదికి రెండు లక్షల కోట్ల రూపాయలు బడా బాబులకు రుణాలు ఇచ్చి వసూలు చేసుకోలేక రైటాఫ్ చేస్తున్నట్లుగా బ్యాంకులు ప్రకటిస్తూ ఉంటాయి. కానీ ఇదే బ్యాంకులు సామాన్యుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాయో.. వారి డబ్బులను ఎలా దోచుకుంటున్నాయో స్పష్టంగా మన కళ్ల ముందు ఉంచే సాక్ష్యం.. కనీస బ్యాలెన్స్ చార్జీలు. ఈ ఒక్క పేరుతోనే బ్యాంకులు 35 వేల కోట్ల రూపాయలు వసూలు చేశాయి. అంటే.. బ్యాంక్ ఖాతాదారులను ఎలా దోపిడీ చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మినిమం బ్యాలెన్స్ చార్జీలు మాత్రమే కాదు.. ఎస్సెమ్మెస్ చార్జీలు, ఏటీఎం చార్జీలు ఇలా అనేక రకాలుగా వసూలు చేస్తున్నారు.

బ్యాంకు ఖాతా ఉంది. కానీ కనీస నిల్వ కూడా ఉంచుకోలేనంత పేదరికంలో చాలా మంది ఉంటారు. వెయ్యి రూపాయలు కూడా సేవింగ్స్ చేసుకోలేక డ్రా చేసుకుంటూ ఉంటారు. అలాంటి పేదలపై… కనీస బ్యాలెన్స్ ఉంచలేదని చార్జీలు బాదేస్తూంటాయి బ్యాంకులు. బ్యాంక్‌లో ఖాతా ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం కనీస బ్యాలెన్స్‌ లేని ఖాతాదారుల నుంచి బ్యాంక్‌లు భారీ మొత్తంలో జరిమానా వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, 5 ప్రధాన ప్రైవేట్‌ బ్యాంక్‌లు 2018 నుంచి ఇప్పటి వరకు 35,000 కోట్లు వసూలు చేశాయి. ఈ మొత్తాన్ని బ్యాంక్‌ ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించనందుకు, పరిమితికి మించి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసినందుకు, ఎస్‌ఎంఎస్‌ ఛార్జీల పేరుతో బ్యాంక్‌లు కస్టమర్ల నుంచి వసూలు చేశాయి.

ప్రభుత్వం రంగంలోని 12 బ్యాంక్‌లతో పాటు ప్రైవేట్‌ రంగంలోని యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌లు కలిసి బ్యాంక్‌ ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ లేని ఖాతాదారుల నుంచి 21,000 కోట్లు వసూలు చేశాయి. ఏటీఎంలో ఉతిచ విత్‌డ్రాలకు మించితే బ్యాంక్‌లు ప్రతి విత్‌డ్రాపై ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. పరిమితికి మించి ఏటీఎంల నుంచి డబ్బులు వసూలు చేసిన కస్టమర్ల నుంచి అన్ని బ్యాంక్‌లు కలిపి 8,000 కోట్లు వసూలు చేశాయి. ఇక ఎస్‌ఎంఎస్‌లు పంపించినందుకు అన్ని బ్యాంక్‌లు కలిపి కస్టమర్ల దగ్గర 6,000 కోట్లు వసూలు చేశాయి. ఇలా మొత్తం అన్ని రకాల బాదుడుతో బ్యాంక్‌లు కస్టమర్ల నుంచి 35,000 కోట్లు వసూలు చేశాయి. బ్యాంక్‌లో ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఖాతాలో ఆయా బ్యాంక్‌లు నిర్ణయించిన కనీస బ్యాలెన్స్‌ ఉండాలి. ఇది ప్రతి నెల ఉంచాల్సి ఉంటుంది. లేకుంటే బ్యాంక్‌లు ఫైన్‌ వసూలు చేస్తున్నాయి.

బ్యాంక్‌ ఖాతాలో నెలవారి సగటు బ్యాలెన్స్‌ బ్యాంక్‌లను బట్టి మెట్రో నగరాల్లో 3,000 నుంచి 10,000 రూపాయల వరకు ఉంచాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఈ బ్యాలెన్స్‌ 2,000 నుంచి 5,000 రూపాయల వరకు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 5,00 నుంచి ,1,000 రూపాయల వరకు ఉంచాల్సి ఉంటుంది. ఈ బ్యాలెన్స్‌ నిర్వహించని ఖాతాదారుల నుంచి నెలకు 400-500 రూపాయల వరకు ఫైన్‌గా వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్‌ బ్యాంక్‌లు మరో అడుగు ముందుకు వేసి ప్రతి నెల పరిమితికి మించి లావాదేవీలు నిర్వహించే ఖాతాదారుల నుంచి ప్రతి లావాదేవీకి అదనంగా 100-125 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. ఫైన్లు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల కంటే ప్రైవేట్‌ బ్యాంక్‌ల్లో రెట్టింపు కంటే ఎక్కువగానే ఉంటున్నాయి. ఒక కనీస మొత్తం ఖాతాలో ఎంత ఉండాలన్న దానిపై కూడా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లతో పోల్చితే ప్రైవేట్‌ బ్యాంక్‌లు చాలా ఎక్కువ మొత్తాన్ని నిర్ణయించాయి. ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలు, పరిమితికి మించి ఏటీఎం విత్‌డ్రాల విషయంలోనూ ప్రభుత్వం, ప్రైవేట్‌ బ్యాంక్‌ల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకులు మొహమాట పడతాయేమో కానీ.. ప్రైవేటు బ్యాంకులది మాత్రం దోపిడీనే. ఓ ప్రైవేటు బ్యాంకు మినిమం బ్యాలెన్స్ ఏకంగా ఐదు వేల వరకూ పెట్టి ఆ మాత్రం ఉంచకపోతే నెలకు ఆరు వందలు వసూలు చేసేస్తోంది.

కనీసం బ్యాలెన్స్‌ లేని ఖాతాదారుల నుంచి కొంత మొత్తంలో జరిమానాగా వసూలు చేసుకునేందుకు బ్యాంక్‌లకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. బ్యాంక్‌లు వసూలు చేసే ఛార్జీలు సమేతుకంగా ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. కస్టమర్లకు పంపించే వివిధ రకాల ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలు కూడా సహేతుకంగా ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. కానీ ఇక్కడ సహేతుకం అనే పదానికే సహేతుకమైన అర్థాలు లేకుండా చేసి బ్యాంకులు పిండేసుకుంటున్నాయి.

ఇవే బ్యాంకులు.. గత ఐదేళలలో పది లక్షల కోట్ల రూపాయల్ని బడా బాబులకు అప్పనంగా కట్టబెట్టాయి. అప్పులు ఇచ్చి వసూలు చేసుకోలేక రైటాఫ్ చేశాయి.అదే సమయంలో గత 9 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు 14.56 లక్షల కోట్ల మొండి బకాయిలను బ్యాంకులు రద్దు చేశాయి. వీటిల్లోఏడున్నర లక్షల కోట్లు పెద్ద పరిశ్రమలు, సేవా సంస్థలకు సంబంధించిన రుణాలే . అంటే బడా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాలు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మొండి బకాయిలను, కేటాయింపులు జరిపిన నిరర్థక రుణాలను నాలుగేండ్ల తర్వాత బ్యాంకులు వాటి ఖాతాపుస్తకాల్లోంచి రైటాఫ్‌ చేస్తాయి. తద్వారా బ్యాంకులు పన్ను ప్రయోజనాలు పొందుతాయి. రుణాలు రైటాఫ్‌ జరిగినా, సంబంధిత రుణగ్రస్తులు రుణాలు చెల్లించాల్సిందేనని, రికవరీ ప్రక్రియను బ్యాంకులు కొనసాగిస్తాయని చెబుతున్నారు. కానీ ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయి. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ దేశంలోని బ్యాంకులు లక్షల కోట్ల విలువైన మొండి బకాయిలను రైటాఫ్‌ చేశాయి. ఇందులో దాదాపు 70 శాతం ప్రభుత్వరంగ బ్యాంకులు చేసినవే. బ్యాంకుల నుంచి తమ అనుయాయులకు రుణాలు ఇప్పించడం, అనంతరం వాటిని ఎన్‌పీఏలుగా మార్చి రైటాఫ్‌లు చేయించడం.. తర్వాత నెపాన్ని బ్యాంకు అధికారులపైకి నెట్టేయడం పరిపాటిగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

చిన్నచిన్న మొత్తాలు లోను తీసుకునే సామాన్యుల విషయంలో వాయిదాలు కట్టలేకపోతే రికవరీ ఏంజెట్లను పంపించే బ్యాంకులు…రాజకీయనాయకులు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలు వంటి వారి విషయంలో మాత్రం ఏం చేయలేకపోతున్నాయనే విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. రూ.5 కోట్ల కంటే ఎక్కువ రుణం తీసుకుని తిరిగి చెల్లించని ఖాతాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆర్‌బీఐకి బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ సంస్థలు వంటివి ఇస్తుంటాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం బ్యాంకుల నుంచి బాకీలు తీసుకుని కావాలనే ఎగవేసిన ఖాతాల సంఖ్య గత నాలుగేళ్లలో 10 వేలు దాటింది. మరి ఇలాంటి వారి ఆస్తులు ఎందుకు వేలం వేయడం లేదు.. అంటే… అదో పజిల్. దాని గురించి చర్చించుకుంటే దేశద్రోహం కూడా కావొచ్చు. అందుకే బ్యాంకులకు చార్జీలు కట్టుకుని.. సైలెంట్ గా ఉండిపోవాలి.

బ్యాంకులు అంటే నమ్మకం. కానీ ఇప్పుడు బ్యాంకింగ్ రంగం..దేశ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తోంది. కానీ ప్రత్యామ్నాయం ప్రజలకు లేదు. అందుకే బ్యాంకుల ఇష్టారాజ్యం అయిపోతోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి