2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా… కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల్లోని పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడమే లక్ష్యంగా భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుడుతోంది.
వరుసగా రెండు సార్లు అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ… 2024లో అధికారంలోకి వచ్చి తీరాలని వ్యూహాలు రచిస్తోంది. అధికార పార్టీ విభజన రాజకీయాలు, మత ఘర్షణలు, జీఎస్టీ, అదుపులేని నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని భావిస్తోంది. కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత…గ్యాస్ సిలిండర్ మూడింతలు పెరిగింది. పెట్రోల్ రేట్లు డబుల్ అయ్యాయ్. వీటన్నంటిని భారత్ జోడో యాత్రలో…ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. దేశాన్ని ఏకసూత్రంతో జోడించడమే యాత్ర ముఖ్య ఉద్దేశమని హస్తం పార్టీ చెబుతోంది.
దేశంలో నిత్యావసరాల ధరాలు ఆకాశాన్ని అంటున్నాయ్. గ్యాస్ సిలిండర్ ధర 11వందలు దాటిపోయింది. రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పతనమైంది. దేశంలో నిరుద్యోగంతో పాటు ద్రవ్యోల్భణం పెరిగిపోయింది. దేశ రక్షణ విషయంలోనూ బీజేపీ చెలగాటమాడుతోంది. అగ్నిపథ్ పేరుతో నాలుగేళ్ల పాటు సైన్యం పని చేసేలా పథకాన్ని తీసుకొచ్చింది. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చినా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి…ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి…అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటోంది. ప్రశ్నించిన వారిని ఈడీ, సీబీఐ, ఐటీ పేరుతో నోరుమూయిస్తోంది. అప్పటికి దారిలోకి రాకపోతే…కేసుల పేరుతో వేధిస్తోంది. ప్రణాళికబద్ధంగా…బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేసింది.
దేశంలో జరుగుతున్న విభజన రాజకీయాలు, రైతులు, బలహీనవర్గాల సమస్యలపై యాత్రలో ప్రముఖంగా ప్రస్తావించనుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ…150 రోజుల పాటు ప్రజల్లోనే ఉండేలా పకడ్బందీగా యాత్రకు ఏర్పాట్లు చేస్తోంది. ముచ్చటగా మూడోసారి కాషాయ పార్టీ అధికారంలోకి రాకుండా….సామాన్య ప్రజలకు దగ్గర కావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. దాదాపు ఐదు నెలల పాటు రాహుల్ గాంధీ….ఢిల్లీకి దూరంగా ఉండనున్నారు. యాత్రలో రైతులు, కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగులు…ఇలా అన్ని వర్గాలను కలిసే విధంగా పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దక్షిణాదిలో బీజేపీ చెప్పుకోదగినంత బలంగా లేదు. ఫ్యూచర్ లో బలపడటం కూడా అంత సులువైన విషయం కాదు. అందుకే సౌత్ లో ఎక్కువ సీట్లు గెలుపోందడమే లక్ష్యంగా…కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కర్ణాటక 28, తెలుగు రాష్ట్రాల్లో 42, తమిళనాడు 39, కేరళలో 20 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయ్.
ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత పెరిగిపోతున్నా…దాన్ని వినియోగించడంలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమవుతూనే ఉంది. అగ్నిపథ్, మూడు సింహాలు, నిత్యావసరాలు, ప్రత్యర్థులపై కేంద్ర సంస్థల ప్రయోగం, మత విద్వేషాలు, రైతు సమస్యలపై నిలదీస్తే…కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో బూస్ట్ వచ్చింది. రాహుల్ గాంధీ ప్రజల్లోనే ఎక్కువ గడిపి…కేంద్రం వైఫల్యాలపై దూకుడుగా వ్యవహరిస్తే…బీజేపీని ఓడించడం పెద్ద విషయం కాదు.