బండి సంజయ్ బహిష్కరణ ఖాయం! ఆ విలువలే పాటిస్తే …

By KTV Telugu On 7 June, 2022
image

యూపీలో  ఓ వర్గాన్ని కించ పరిచేలా వ్యూహాత్మకంగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో  యూపీ అట్టుడికిపోతోంది. కాన్పూర్‌లో ప్రజా జీవనం స్తంభించిపోయింది. దేశ విదేశాల్లోనూ పరువు పోయింది. ఖతార్ వంటి దేశాలు భారత్‌పై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పరిస్ధితి చేయి దాటుతోందని.. నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ అనే వ్యక్తులపై వేటు వేశారు. మత సహనంలో బీజేపీ తర్వాతే ఎవరైనా అన్నట్లుగా కొత్తగా ప్రకటనలు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతల తీరు చూస్తే… అతడిని మించి అచంట మల్లన్న అన్న తీరుగా ఉంటుంది. తెలంగాణలో ఆ మాదిరి మంట పెట్టాలని బండి సంజయ్ చేస్తున్న ప్రయత్నాలు కళ్ల ముందే ఉన్నాయి. కానీ అలాంటి వారిని బీజేపీ ప్రోత్సహిస్తోంది.

బీజేపీ విధానమే అది !

భారతీయ జనతా పార్టీ నేతలు హిందూయేతర వర్గాలు.. వారు బాగా  ఆరాధించే వ్యక్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామనే. అలాంటి వారిపై చర్యలు తీసుకునే సంప్రదాయం బీజేపీలో లేదు. గతంలో మహాత్ముడ్నే దారుణంగా అవమానించి.. వ్యాఖ్యలు చేసిన వారిపై కూడా బీజేపీ చర్యలు తీసుకోలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు యూపీలోని కాన్పూర్‌లో అల్లర్లకు కారణంగా మారిన ఇద్దరు బీజేపీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. అంతే కాదు..  అందరూ ఇదే విషయాన్ని చూపిస్తే.. మీ వాళ్లు అంత కన్నా ఎక్కువ మాట్లాడారు.. వాళ్ల సంగతేంటి అని ప్రశ్నించడం ప్రారంభించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు.

తెలంగాణలోనూ  మత చిచ్చుకు బండి సంజయ్ విశ్వ ప్రయత్నాలు !

తెలంగాణలో బీజేపీ బలపడాలంటే మత చిచ్చు తప్ప మరో మార్గం లేదని బండి సంజయ్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయన ఏ మాత్రం మొహమాటలు పెట్టుకోవడం లేదు. ముందూ వెనుకా ఆలోచించడం లేదు. తన రాజకీయం తాను చేస్తున్నారు. యూపీలో జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని.. తెలంగాణలోనూ అదే వాదన తీసుకొచ్చారు. తెలంగాణలోనూ వేలాది ఆలయాలను గతంలో ధ్వంసం చేశారని, మసీదులు తవ్వితే శివలింగాలు బయటపడతాయన్నారు.  తెలంగాణలోనున్న మసీదులను తవ్వి చూద్దాం… శవాలొస్తే మీవి…. శివం వస్తే మావి  అందుకు మీరు సిద్ధమా? అని సవాళ్లు కూడా చేశారు.

బీజేపీ రాజకీయం అంతా ఓ మతం చుట్టూనే !

బీజేపీకి అలవాటైన విధంగా ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని రెచ్చగొట్టేలా మాట్లాడటం రోజూ జరుగుతోంది. మదర్సాలపైనా.. ఈద్గాలపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు సామాన్యమైనవి కావు.  మైనారిటీ రిజర్వేషన్లను పూర్తిగా తుడిచేస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో హిందువులకు ప్రమాదం పొంచి ఉందంటూ రెచ్చగొట్టేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. తమది మత తత్వ పార్టీనే అని బండి సంజయ్ కూడా చెప్పుకుంటారు. మాట్లాడితే పాతబస్తీ.. చార్మినార్..  భాగ్యలక్ష్మి టెంపుల్ అంటూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తారు.

బండి సంజయ్‌ మాటలు హాయిగా అనిపిస్తున్నాయా ?

బీజేపీ నిజంగా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందా?, అదే నిజమైతే అన్ని మసీదులను తవ్వి ఉర్దూపై నిషేధం విధించాలన్న బండి సంజయ్‌పై చర్యలు తీసుకోగలరా? అని కేటీఆర్ సూటిగా అడిగిన ప్రశ్నకు.. బీజేపీ దగ్గర సమాధానం లేదు. కేటీఆర్ మాత్రమే కాదు.. గతంలో ఇతర వర్గాలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతల స్టేట్‌మెంట్లను నెటిజన్లు ప్రదర్శిస్తూ వారినేం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ లేనిది.. ఇతర వర్గాన్ని కించ పరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని బీజేపీ సస్పెండ్ చేయడం ఓ వింత. దేశానికి ఇబ్బందికరంగా మారడంతో బీజేపీ స్పందించింది. కానీ ఇలాంటి తీరు వల్ల దేశంలో తెచ్చిన విభజనను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోంది.