మొదటికే మోసం వస్తుందా.. కమలనాథులకు గుజరాత్ టెన్షన్ పట్టుకుందా…

By KTV Telugu On 18 May, 2022
image

ఉట్టికెక్కలేనమ్మ… స్వర్గానికి ఎక్కుతుందంట.. అన్న పాత సామెత మరోసారి గుర్తుచేసుకోవాలి. ఇప్పుడు బీజేపీ సామెతను గుర్తుచేసుకుంటూ.. బెంగ పెంచుకుంటోంది. ప్రస్తుతం డబుల్ ఇంజిన్ సర్కారు.. అంటే కేంద్రంలోనూ, గుజరాత్ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంది. రేపు చరిత్ర పునరావృతమవుతుందన్న నమ్మకం కలగడం లేదు. ఈ ఏడాది జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లోనూ గెలిచేందుకు వ్యూహరచన చేసుకుంటున్న బీజేపీకి…. పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సారి గుజరాత్ లో ఓడిపోతే అది మోదీ – అమిత్ షాకు అవమానం మాత్రమే కాకుండా.. లోక్ సభ ఎన్నికల్లో పోటీపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని బీజేపీ ఆందోళన చెందుతోంది…

బహుముఖ పోటీ
గుజరాత్ అసెంబ్లీలో 182 సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి 99 స్థానాలు దక్కాయి. రాష్ట్రంలో బీజేపీ వరుసగా ఐదు సార్లు అధికారానికి వచ్చింది. ఈ సారి గెలిపించుకుని కొత్త రికార్డు సృష్టిస్తామని బీజేపీ గుజరాత్ నేతలు అంటున్నారు. అధిష్టానం నుంచి తమకు పూర్తి మద్దతు ఉందని చెబుతున్నారు. గుజరాత్ లో మాత్రం ఇప్పుడు బహుముఖ పోటీ ఖాయమనిపిస్తోంది. మోదీ ఢిల్లీకి మారినా బీజేపీ బలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ మెజార్టీలు తగ్గుతున్న తీరు భయానికి కారణమవుతున్నాయి. అమిత్ షా ప్రత్యక్ష పర్యవేక్షణలో త్వరలోనే ప్రచార కార్యక్రమం ఊపందుకుంటుందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నందున తమకు ఎలాంటి భయం లేదని వాదిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన హార్ధిక్ పటేల్ త్వరలోనే ఆ పార్టీని వీడి తమతో చేతులు కలపుతారని బీజేపీ ఎదురుచూస్తోంది. పైగా కాంగ్రెస్ అసంతృప్తుల్లో ఎక్కువ మంది బీజేపీ వైపు వస్తారట. సోనియా గాంధీ పొలిటికల్ సెక్రటరీగా పనిచేసిన అహ్మద్ పటేల్ చనిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. పైగా రాష్ట్ర నేతలను ముఖ్యంగా యువతను పట్టించుకోవడం లేదని గుజరాత్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అహ్మద్ పటేల్ తనయుడు ఫైసల్ అహ్మద్ కూడా కాంగ్రెస్ తీరుపై పెదవి విరుస్తున్నారు…

ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సారి గుజరాత్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ పార్టీ అధినేత అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరచూ గుజరాత్ పర్యటనకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనమైపోయిందని, ఆ పార్టీ నేతలతో పాటు బీజేపీ వ్యతిరేకులంతా తమ వైపుకు వస్తారని కేజ్రీవాల్ ఎదురు చూస్తున్నారు. గిరిజన ఓటర్లను ఆకర్షించే దిశగా భారతీయ ట్రైబల్ పార్టీతో ఆప్ పొత్తు పెట్టుకుంటోంది. ఇప్పటికే గుజరాత్ లో 20 రోజుల పరివర్తన్ యాత్ర ప్రారంభమైంది. పాటిదాస్ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు నరేష్ పటేల్ త్వరలో ఆప్ లో చేరతారని వార్తలు వస్తాయి. అయితే ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాటిదార్ సామాజిక వర్గం నాయకుడు కావడంతో నరేష్.. ఆప్ లో చేరడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, సామాజిక సమీకరణాలు పనిచేయవని బీజేపీ వర్గాలు అంటున్నాయి…

ఒవైసీ రాక..

ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కూడా గుజరాత్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతీ రాష్ట్రంలోనూ పోటీ చేయాలని సంకల్పంతో ఇటీవలే ఉత్తర ప్రదేశ్లోనూ ఎంఐఎం బరిలోకి దిగింది. ఒక్క సీటు కూడా గెలవకుండా చేతులు కాల్చుకున్నప్పటికీ… గుజరాత్ లో కూడా అత్యధిక స్థానాలకు బరిలో దిగబోతున్నట్లు ఎంఐఎం వర్గాలు చెబుతున్నాయి. అయితే ఓట్లు చీల్చి, బీజేపీకి అనుకూలంగా ఫలితం తెచ్చేందుకు ఒవైసీ పాటుపడుతుంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి…

చింతన్ బైఠక్ లో జరిగిందేమిటి ?

గుజరాత్ ఎన్నికలపై కేంద్ర హోం మంత్రి షా నేతృత్వంలో రెండు రోజుల పాటు బీజేపీ సమావేశమైంది. అహ్మదాబాద్ లో జరిగిన ఈ చింతన్ బైఠక్ కు కేంద్ర పార్టీ నుంచి వచ్చిన కొందరు పెద్దలతో పాటు రాష్ట్రంలోని బీజేపీ ప్రముఖులంతా హాజరయ్యారు. రెండు అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని పోటీ చేయించాలా వద్దా అన్న చర్చ జరిగింది. ఈ అంశంపై ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారని అమిత్ షా తేల్చారట. మెజార్టీ పెంచుకోవడమెలాగన్న చర్చ రెండోది. ఓడిపోయిన నియోజకవర్గాల్లో గెలిచేందుకు చర్యలు తీసుకోవాలని, అతి తక్కువ మెజార్టీతో గెలిచిన చోట్ల మరింతగా మెజార్టీని పెంచుకునేందుకు శ్రమించాలని రాష్ట్ర పార్టీని అమిత్ షా ఆదేశించారు. ఇన్ని సీట్లు గెలుస్తామని ఇప్పుడే ఒక సంఖ్యను ప్రచారం చేయవద్దని కూడా అమిత్ షా సూచించారట. మరి పార్టీ నేతలు వింటారో లేదో చూడాలి….