మోదీ టూర్ తో బీజేపీ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోందా? జిరో నుంచి వాళ్లు హీరోలు అయ్యే అవకాశం ఉందా ? వచ్చే ఎన్నికల నాటికి వాళ్లు పుంజుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి ? రాష్ట్ర నేతల తీరు ఏమిటి ? అధిష్టానం ఆలోచన ఏమిటి ?
ఏపీలో ప్రధాని మోదీ రెండు రోజుల టూర్
ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించిన బీజేపీ లీడర్స్
క్షేత్రస్థాయిలో పార్టీని అభివృద్ధి చేయాలంటూ మోదీ దిశానిర్దేశం
ఉత్తరాది తరహాలో దక్షిణాదినా పుంజుకునే ప్రయత్నం
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం విశాఖ వచ్చిన ప్రధాని మోదీ రెండు రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆయన రాక తమకెంతో సంతోషమన్నట్లుగా నేతలంతా ఉత్సాహంగా కనిపించారు. పోటీ పడి ఆయనతో ఫోటోలు దిగడమే కాకుండా పార్టీ అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ కృషి చేస్తున్నట్లు చెప్పుకున్నారు. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేని బీజేపీని బలోపేతం చేయాలంటే క్షేత్ర స్థాయి నుంచి అభివృద్ధి చేయాలని మోదీ సూచించారు. అందుకు అవసరమైన సలహాలు ఇచ్చారు. ఉత్తరాదిలో పార్టీ పునాదులు గట్టి పడినట్లుగానే తెలంగాణలో కూడా విజయ తీరాలకు చేర్చాలని పార్టీ నేతలు అనుకుంటున్నారు.
ఏపీలో పార్టీ స్థితిగతులేమిటి
ఉమ్మడి ఏపీలో కొంత మేర బలం
విభజన తర్వాత బాగా బలహీనం
ప్రాంతీయ పార్టీల దెబ్బకు కొట్టుకుపోయిన జాతీయ పార్టీ
నవ్యాంధ్రప్రదేశ్ లో బీజేపీ స్థితిగతులు అంత ఆశాజనకంగా లేవు. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి కొంత మేర బలం ఉండేది. ఆ బలమంతా తెలంగాణదేనని రాష్ట్ర విభజన తర్వాత అర్థమైంది. గతంలో టీడీపీతో పొత్తుల కారణంగా కొంతమేర బలపడింది. తర్వాత అంతగా సీన్ కనిపించడం లేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ దెబ్బకు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కొట్టుకుపోయాయనే చెప్పాలి. 2019లో బీజేపీ అభ్యర్థులకు కొన్ని చోట్ల నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అందుకే ఉత్తరాది బీజేపీ నేతలు వారిని నోటా సే భీ ఛోటా అని ఎగతాళి చేస్తున్నారు.
తెలంగాణలో అధికారానికి వచ్చేంత బలం
ఏపీలో ఒక్క సీటు కూడా గెలవని దౌర్బల్యం
శక్తిమంతులైన నాయకులు లేకపోవడమే కారణం
కొత్తగా వచ్చిన వారికి దక్కని గౌరవం
తెలంగాణలో బీజేపీ అధికారానికి వచ్చే స్థాయికి ఎదిగిందని మునుగోడు ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెప్పాయి. ఆంధ్రప్రదేష్ లో మాత్రం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుస్తామన్న నమ్మకం లేని దుస్తితిలోకి దిగజారిపోయింది. దానికి కారణం ఛరిస్మా ఉన్న నాయకులు లేకపోవడమేనని చెప్పాలి. సోము వీర్రాజు, దగ్గుబాటు పురంధేశ్వరి సీఎం రమేష్ లాంటి నాయకులు తమ సామాజిక వర్గాల ఓటర్లను బీజేపీ వైపుకు తీసుకురాలేకపోతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన వెంటనే సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ వచ్చి టీడీపీలో చేరారు. దీని వల్ల బీజేపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య పెరిగింది. అలా వచ్చిన వారికి సముచిత స్థానం ఇవ్వడం లేదని, పార్టీలో గౌరవం దక్కడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాయకుల మధ్య ఆధిపత్య పోరు
కొత్త వారిని కోవర్టులుగా చూడటం
సమష్టితత్వం లోపీంచడం
రాష్ట్ర బీజేపీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు బాగా పెరిగిపోయింది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వాన్ని మెజార్టీ వర్గం బహిరంగంగా వ్యతిరేకిస్తోంది. కేవలం అధిష్టానం ఆశీస్సులతో ఆయన పదవిలో కొనసాగుతున్నారు. పైగా కొత్తగా వచ్చిన వారిని టీడీపీ కోవర్డులంటూ ముద్ర వేసి వారి వైపు అనుమానంగా చూస్తున్నారు. నాయకులంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఐకమత్యంగా ఉంటూ పార్టీని గెలిపించుకోవాలన్న తపన వారిలో కనిపించడం లేదు. పార్టీ ప్రత్యర్తులకు అది వరప్రసాదమైంది. నిజానికి గుజరాత్ తరహాలో ఏపీలోనూ సుదీర్ఘకాలం అధికారంలో ఉండాలన్నది బీజేపీ అగ్రనాయత్వం ఆలోచనా విధానం. ఇప్పటికైనా రాష్ట్ర నాయకులు ఆ సంగతిని అర్థం చేసుకుంటారో లేదో చూడాలి.