మేడిన్ ఇండియా కాలేదు. అద్భుతాలేమీ జరగలేదు. అలాగని పాలన అస్తవ్యస్తంగా ఏమీ లేదు. కొంచెం తీపి, కొంచెం పులుపు, కొంచెం వగరు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలను గౌరవించాలి. తొందరపాటు నిర్ణయాలు జరిగితే సవరించుకోవాలి. రైతు చట్టాలపై మోడీ ప్రభుత్వం చేసిందదే. నెలలతరబడి రైతులు ఉద్యమించి, పదుల ప్రాణాలు గాల్లో కలిశాకగానీ రైతు చట్టాల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గలేదు. కౌంట్‌డౌన్ పూర్తయిన ప్రతీ రాకెట్ కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలనేం లేదు. లక్ష్యం మంచిదనుకున్నా కొన్నిసార్లు అది మన వ్యవస్థకు రుచించకపోవచ్చు.
కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక తీసుకున్న అతిపెద్ద తొందరపాటు నిర్ణయం పెద్దనోట్ల రద్దు. రాత్రికి రాత్రి 500, 1000 రూపాయల నోట్ల రద్దు దేశాన్ని కుదిపేసింది. సామాన్యుడి బతుకుని నరకప్రాయం చేసింది. కష్టమోనష్టమో పెద్ద నోట్లు రద్దుతో నల్లధనం బయటికొస్తుందనుకుంటే అదీ జరగలేదు. వెయ్యినోట్లను రద్దుచేసి 2000 నోట్లను తెరపైకి తేవటంతో ఓ సాహసోపేత నిర్ణయానికి విలువ లేకుండా పోయింది.
పెద్ద నోట్ల రద్దుతో ఈ దేశానికి ఇదిగో ఇలాంటి ప్రయోజనం కలిగిందని పాలకపక్షపెద్దలే గట్టిగా చెప్పలేని నిస్సహాయస్థితి. ఎందుకంటే ఆశించిన, ఊహించిన ఫలితాలేమీ కళ్లెదుట కనిపించలేదు. విపక్షపార్టీలు విమర్శించడం వేరు. కానీ సొంతపార్టీనేతలకు కూడా నోట్ల రద్దు ఇప్పటికీ మింగుడుపడని నిర్ణమే. కానీ బాస్ ఈజ్ ఆల్‌వేస్ రైట్ అన్నట్లు ఎవరూ నోరెత్తలేదు. ఎవరూ తప్పుబట్టలేదుకాబట్టి అంతా ఆమోదించినట్లు కాదు. నోట్ల రద్దు తప్పుడు నిర్ణయమని ఇప్పుడు ఓ బీజేపీ ఎంపీనే అంటున్నారు. 2000 నోట్లతో దేశంలో బ్లాక్‌మనీ పెరుగుతోందన్నారు బీజేపీ ఎంపీ సుశీల్‌కుమార్ మోడీ. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెయ్యినోట్లు రద్దుచేసి రెండువేల నోట్లను చలామణిలో ఉంచడం అర్ధంలేని పనంటున్నారు బీజేపీ ఎంపీ. అవును అది తొందరపాటు నిర్ణయమేనని మోడీ ఒప్పుకోగలరా? పార్టీ ఎంపీది క్రమశిక్షణారాహిత్యమని తప్పుపట్టగలరా? ఇవాళ సుశీల్‌కుమార్, రేపు మరొకరు కడుపులో ఎవరైనా ఎన్నాళ్లని దాచుకోగలరు.