టీఆర్ఎస్ ను ఓడించేందుకు బండి సంజయ్ కొత్త ప్లాన్ వేశారు. కాశ్మీర్ ఫైల్స్ ను స్పూర్తిగా తీసుకుని కొత్త ప్లాన్ తయారు చేస్తున్నారు. నిజాం అరాచకాలను గుర్తు చేస్తూ ప్రత్యర్ధి పార్టీల వ్యూహాలకు చెక్ పెట్టేలా అడుగులు వేస్తున్నారు. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ తో రజాకార్స్ ఫైల్స్ రెడీ చేయాలని తెరవెనుక రంగం సిద్ధం చేస్తున్నారు.
2024ను కమలనాథులు టార్గెట్ గా పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొంది… తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాండించాలన్న లక్ష్యంతో దూసుకెళ్తున్నారు. కశ్మీరీ పండిట్ల జీవితాలను తెరపైకి తెచ్చినట్లే… రజాకార్ల దారుణాలను ప్రజలకు చూపించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు… వ్యూహాలు రచిస్తున్నారు బీజేపీ నేతలు. రజాకార్ల ఫైల్స్ సినిమాతో ఎంఐఎంను దూరం చేయడమే కాకుండా… ప్రజల్లో సానుభూతి సంపాదించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
తెలంగాణలో టీఆర్ఎస్ గద్దె దిగాలంటే… రజాకార్ల ఫైల్స్ సినిమా రావాల్సిందేనా ? నిజాం పాలనలో జరిగిన దారుణాలు, హింసలు, అరాచకత్వాలు, మత మర్పిళ్లను తెరపైకి తీసుకొచ్చేందుకు బీజేపీ సిద్ధమైంది. పక్కా ప్రణాళికతో విజయేంద్ర ప్రసాద్ ను… పెద్దల సభకు పంపింది కాషాయ పార్టీ.
కశ్మీరీ ఫైల్స్ లాగే రజాకార్ల ఫైల్స్ ను తెరపైకి తీసుకొస్తామని… పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నోసార్లు చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభకు నామినేట్ చేసిన తర్వాత… తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్… విజయేంద్ర ప్రసాద్ ని కలిశారు. ఆయనతో రజాకార్ల ఫైల్స్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పై చర్చించినట్లు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాను తీయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఒకట్రెండు నెలల ముందు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
కశ్మీర్ ఫైల్స్ మూవీని నిర్మించిన అభిషేక్ అగర్వాల్… ఇప్పుడు ఢిల్లీ ఫైల్స్ పేరుతో సినిమా తీస్తున్నారు. ఇందులో ఇందిరా గాంధీ మరణం తర్వాత జరిగిన సిక్కుల ఉచకోత మీద మూవీ నిర్మిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల రోజుల ముందు… సినిమాను రిలీజ్ చేసేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే… ఈ ఏడాది చివరిలో రజాకార్ల ఫైల్స్ మూవీ… సెట్స్ పైకి వెళ్లనుంది. దీనికి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తారా ? లేదంటే రాజమౌళినా ? కశ్మీర్ ఫైల్స్ ను తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తారా అన్నది తేలాల్సి ఉంది.