ఏపీ బీజేపీతో దూరం.. ఢిల్లీ బీజేపీకి దగ్గర ! వ్వాటే ఫార్ములా పవన్ జీ !

By KTV Telugu On 5 June, 2022
image

ఏపీ బీజేపీ నేతలతో పరిచయాలే లేవు అని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. కానీ ఢిల్లీ బీజేపీ నేతలతో మాత్రం రాజకీయాల్లోకి రాక ముందు నుంచీ పరిచయాలు ఉన్నాయంటున్నారు. ఆయన మాటల్లో ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీలో బీజేపీతో ఎలాంటి సంబంధాలు పెట్టుకునే పరిస్థితి లేదని.. ఢిల్లీతో మాత్రం సన్నిహితంగా ఉంటామని చెబుతున్నారు. నడ్డా పర్యటనకు ముందు పవన్ ఈ ప్రకటన చేయడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

ఏపీ బీజేపీకి పవన్ దూరం.. దూరం !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మెల్లగా బీజేపీకి దూరమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆత్మకూరులో బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ఆయన సిద్ధగా లేరు. పోటీకి దూరమని ప్రకటించారు కానీ పోటీ చేస్తామంటున్న బీజేపీకి ఆయన మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. మరో వైపు రాష్ట్ర పర్యటనకు వస్తున్న నడ్డా ను కలిసే చాన్స్ కూడా లేదని ఆయన ప్రకటించారు. ఏపీ బీజేపీ నేతలు కూడా పవన్ ను దూరం పెడుతున్నారు. అన్ని కార్యక్రమాలు కలిసే నిర్వహించాలని అనుకుంటున్నప్పుడు జనసేనను పిలవాలి.. కానీ పిలవడం లేదు. గోదావరి గర్జన పేరుతో నిర్వహిస్తున్న సభకు కూడా పవన్ కల్యాణ్ కు ఎలాంటి ఆహ్వానం అందలేదు. కనీస సమాచారం కూడా లేదు. నడ్డా ఏపీకి వస్తూ.. మేజర్ మిత్రపక్షమైన జనసేనకు సమాచారం ఇవ్వకపోవడంతో జనసేన అగ్రనేతలు కూడా నొచ్చుకున్నారు. తనకేమీ తెలియదని.. కలిసే అవకాశం కూడా లేదని.. పవన్ తెగేసి చెప్పారు.

పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే చాన్స్ లేనట్లే !

పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ కొంత మంది బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే నడ్డా టూర్‌కు అసలు పవన్ ను ఆహ్వానించకుండా ఆయనను సీఎం అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఇదంతా వ్యూహాత్మకంగా పవన్ కల్యాణ్‌ను కించ పరిచే ప్రయత్నమని భావిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలను అసలు పట్టించుకోనని పవన్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వారంతా వైసీపీ కోవర్టులేనని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు.

పొత్తు పేరుతో జనసేనను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిన బీజేపీ నేతలు !

ఏపీ బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా జనసేనను నిర్వీర్యం చేసేప్లాన్ అమలు చేస్తున్నారన్న అనుమానాలు పవన్ కల్యాణ్‌లో  చాలా కాలంగా ఉన్నాయి.  పవన్ కల్యాణ్ బీజేపీతో ఏ ఉద్దేశంతో కలిశారో కానీ అప్పట్నుంచి ఆయన రాజకీయంగా నిర్వీర్యం అయిపోతూ వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు పవన్ కల్యాణ్‌తో పొత్తును టేకిట్ గ్రాంట్‌గా తీసుకుంటున్నారు. జనసేన పార్టీకి అస్థిత్వమే లేదని.. తమది జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి.. జనసేన తాము చెప్పినట్లుగానే చేయాలన్నట్లుగా ఏపీ బీజేపీ నేతలు వ్యవహరించారు. చివరికి తిరుపతి ఉపఎన్నికల్లో ప్రచారం చేయరేమో అన్న అనుమానం వచ్చినప్పుడు.. ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని సోము వీర్రాజు ప్రకటించారు. అందులోనూ రకరకాల మాటలు. వైసీపీ వీరాభిమానులుగా భావించే విష్ణువర్ధన్ రెడ్డితో పాటు… తిరుపతి ఎంపీ అభ్యర్థి రత్నప్రభ కూడా.. సీఎం అభ్యర్థి పవన్ కాదని వాదించారు కూడా.   గత ఎన్నికల్లో బీజేపీ నేతలకు కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. కానీ జనసేనకు ఆరు శాతం వరకూ ఓట్లు వచ్చాయి. అదే సమయంలో… పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపించింది. కానీ బీజేపీ ఎక్కడా చూపించలేదు. జనసేన బలంతో ఒకటీ అరా సీట్లు గెల్చుకుంది. కానీ బీజేపీతో పొత్తు వల్ల జనసేన ఎంతో నష్టపోయింది.  తిరుపతి మున్సిపల్ ఉపఎన్నిక తర్వాత బీజేపీ – జనసేన మధ్య గ్యాప్ బాగా పెరిగింది. దీన్ని సరి చేసుకునే ప్రయత్నాన్ని ఏపీ బీజేపీ నాయకత్వం చేయలేదు. ప్రస్తుత బీజేపీ ఏపీ నాయకత్వంలో అధికార పార్టీ సానుభూతిపరులు ఎక్కువగా ఉన్నారు. వీరు ఎవరూ పవన్ కల్యాణ్‌ మీద సదభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపించరు. ఆయన క్రేజ్‌ను వాడుకుని ఏదో  తమబలం అన్నట్లుగా చూపించుకుందామని ప్రయత్నిస్తారు కానీ .. నిజంగా ఆయనకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వరని అంటున్నారు.

అన్నీ ఆలోచించే పవన్ దూరం !

రాష్ట్ర రాజకీయాల విషయంలో బీజేపీ తీరుపై పవన్ కల్యాణ్ అన్ని విశ్లేషించుకున్న తర్వాతనే ..  దూరంగా ఉండటం మంచిదన్న భావనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.  కేంద్ర అవసరాలో.. లేకపోతే.. మరో  రకమైన రాజకీయమో కానీ..  వైసీపీని వారు ప్రోత్సహిస్తున్నారని.. తాను మధ్యలో అమాయకంగా బలైపోతున్నానన్న అభిప్రాయానికి పవన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే ఆయన బీజేపీకి దూరమైనట్లుగానే భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి.. ఢిల్లీ బీజేపీతో సఖ్యతగా ఉండి.. రాష్ట్రంలో మాత్రం సొంత రాజకీయాలు చేసుకునేందుకు పవన్ సిద్ధమైనట్లుగా అంచనా వేయవచ్చు.