టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టడానికి బీజేపీ ఖతర్నాక్‌ ప్లాన్‌

By KTV Telugu On 24 October, 2022
image

మునుగోడులో జంపింగ్‌ జంపాంగ్‌ ఆట నడుస్తోంది. మా పార్టీనుంచి నువ్వు ఇద్దరిని లాక్కుంటే…మేము మీ పార్టీవాళ్లను ముగ్గురిని లాక్కుంటాం అంటూ పోటీలు పడుతున్నాయి బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరగానే టీఆర్‌ఎస్‌ అప్రమత్తమైంది. వెంటనే ఆపరేషన్‌ ఆకర్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు కేసీఆర్‌. బీజేపీలో ఉన్న టీఆర్ఎస్ మాజీ నాయకులకు వల విసిరారు. ఫలితంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, శాసనమండలి చైర్మెన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్ గులాబీ గూటికి చేరారు. వీళ్లు కేసీఆర్‌ విధానాలు నచ్చక బీజేపీలో చేరారు. ఆ పార్టీలో చేరిన తరువాత కేసీఆర్ ను నానా తిట్లు తిట్టారు. అయినప్పటికీ వాళ్లను మళ్లీ పార్టీలోకి స్వాగతించారు. త్వరలో మరికొందరు నేతలు టీఆర్ఎస్ లో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, టీఆర్ఎస్ లో గుర్తింపు పొంది ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్న నేతలతో సీఎం కేసీఆర్ స్వయంగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. తమ పార్టీ నాయకులను లాక్కుంటున్న టీఆర్ఎస్ కు షాకివ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి వాళ్లతో బీజేపీ ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. త్వరలోనే కొందరు కీలక నేతలకు కాషాయ కండువా కప్పడం ఖాయమంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఎనిమిది మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. త్వరలోనే ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరబోతున్నారనే బాంబు పేల్చారు. దాంతో గులాబీ గూటికి చేరబోయే ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవలే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి కమలం పార్టీలో చేరుతారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు జంపింగ్ వార్తలను ఖండించారు. ప్రచారం ముగింపు రోజున టీఆర్ఎస్ కీలక నేతలకు కండువా కప్పి ఆ పార్టీకి షాకివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ నాయకులు చెబుతున్నది నిజమేనా…లేకపోతే అదంతా మైండ్‌ గేమా అన్నది ప్రచారం చివరి రోజునే తేలుతుంది.