తమ దాకా వస్తే కానీ తత్వం బోధపడదేమో..!

By KTV Telugu On 13 December, 2022
image

ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని సినీ కవి ఆత్రేయ యాభై ఏళ్ల క్రితం రాసిన పాట ఇప్పటికీ రెలవెంటే. “కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రశ్నించిన వారిని వెంటాడి వేటాడి వేధించుకు తినేస్తున్నారు బాబూ…! ” అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారాల పట్టి కల్వకుంట్ల కవిత మనసు నొచ్చుకుంటున్నారు. కేంద్రంలోని బిజెపి నిర్ణయాలను తప్పుపట్టిన వారిపైనా, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపినవారిపైనా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందనేది కవిత ఆరోపణ.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందంటూ ఆరోపణలు రావడంతో ఒక పక్క ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు మరొ పక్క సిబిఐ నిన్న కాక మొన్న కవితను ఆమె నివాసంలో ఇంచుమించు ఏడుగంటల పాటు విచారించిన సంగతి తెలిసిందే. మరిన్ని వివరాల కోసం త్వరలో మళ్లీ విచారణకు హాజరు కావల్సి ఉంటుందని సిబిఐ నోటీసులు జారీచేయడంతో కవిత మండి పడుతున్నారు. బిజెపి దుర్మార్గాలను నిలదీస్తున్నాం కాబట్టే టి.ఆర్.ఎస్.పై కక్షసాధిస్తున్నారని కవిత ఆరోపిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు.

అయితే ఇదే టి.ఆర్.ఎస్. పార్టీ గతంలో అప్పటి మంత్రి ఈటల రాజేందర్ విషయంలో ఎలా వ్యవహరించిందో ఓ సారి గుర్తు చేసుకోవాలంటున్నారు కమలనాథులు. కేసీఆర్ కేబినెట్ లో నంబర్ 2 గా ఓ వెలుగు వెలిగిన ఈటల రాజేందర్ తో కేసీఆర్ కు ఏ విషయంలో తేడా వచ్చిందో తెలీదు కానీ రాత్రికి రాత్రే ఈటలపై భూకుంభకోణాల ఆరోపణలు రావడం ఆ వెంటనే దర్యాప్తుకు ఆదేశించడం ఆ మరుక్షణమే ఈటల మంత్రి పదవికి రాజీనామా చేయడం చక చకా జరిగిపోయాయి. కేసీఆర్ వైఖరిని నిలదీసినిందుకే తనను టార్గెట్ చేసుకున్నారని అప్పట్లో ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈటల కేసీఆర్ పై నేరుగా ఆరోపణలు చేయడంతో ఈటలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టేశారు. ఈటల రాజేందర్ కు చెందిన పౌల్ట్రీ ఫాంలో సోదాలు నిర్వహించారు. ప్రభుత్వభూములను ఈటల కబ్జాచేశారని ఆరోపించి ఆ మేరకు దర్యాప్తులూ చేశారు.

అప్పుడు ఈటలకూడా ఇప్పుడు కవితలాగే కేసీఆర్ నిరంకుశ వైఖరిని ప్రశ్నించినందుకే తనను లక్ష్యంగా చేసుకుని కక్షసాధించేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈటల దుయ్యబట్టారు. అప్పట్లో గులాబీ నేతలు ఈటల తప్పు చేశారు కాబట్టే దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తున్నాయన్నారు. ఇపుడు కవిత తప్పు చేసింది కాబట్టే సిబిఐ తన పని తాను చేస్తోందని కమలనాథులు అంటున్నారు. దానికి కవిత వక్రభాష్యాలు చెప్పడం తగదని వారంటున్నారు. అంటే ఎవరి చేతిలో అధికారం ఉంటే వాళ్లదే రాజ్యమన్నమాట. దర్యాప్తు సంస్థలను ప్రభుత్వాలు తమ ప్రత్యర్ధును చావు దెబ్బతీసేందుకు ఆయుధాలుగా వాడుకుంటున్నాయన్నమాట.

తెలంగాణాలో కేసీఆర్ అధికారంలో ఉన్నారు కాబట్టి తనను ప్రశ్నించిన వారిపై ఆయన ప్రభుత్వం కేసులు పెట్టిందనుకోవాలా? కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది కాబట్టే కవితను టార్గెట్ చేస్తున్నారని నమ్మాలా? మరి అసలు నిజాలు ఎపుడు బయటకు వస్తాయి.? అపుడు ఈటల అక్రమాలకు పాల్పడ్డారన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇపుడు కవితను దర్యాప్తుల పేరుతో విచారణల పేరుతో వెంటాడుతోన్న బిజెపి కవితపై నిజంగానే చర్యలు తీసుకుంటారా? అసలు అప్పుడు ఈటల కానీ, ఇపుడు కవిత కానీ నిజంగానే తప్పులు చేశారా? లేక రాజకీయ కక్షసాధింపులో ఇద్దరూ బలిపశువులు అయ్యారా? ఇవి తేలాలంటే సిబిఐ దర్యాప్తు పూర్తై ఛార్జ్ షీటు దాఖలు చేయాలి. కాకపోతే తమ దాకా వస్తేకానీ ఎవరికీ కూడా తత్వం బోధపడదని కవిత మరోసారి నిరూపించారని మేథావులు అంటున్నారు.