బీజేపీ ప్రత్యర్థి కాంగ్రెస్సా? ఆమ్ఆద్మీనా
మోడీ చరిష్మానే బీజేపీని వరసగా రెండుసార్లు అధికారంలోకి తెచ్చింది. అందులో నో డౌట్. గుజరాత్ మోడల్‌తో ముఖ్యమంత్రిగా ఇంటనెగ్గి ప్రధానిగా కూడా తనదైన ముద్ర వేయగలిగారు నరేంద్రమోడీ. కానీ ఆయన క్రేజ్ బీజేపీని మరోసారి అధికారంలోకి తెస్తుందా? మోడీషా మంత్రాంగం మళ్లీ ఫలిస్తుందా అన్నదే పాయింట్. కాంగ్రెస్ నిర్వీర్యమైపోయింది. దేశంలోని మిగిలిన విపక్షాలు రాష్ట్రానికెక్కువ, దేశానికి తక్కువ. వామపక్షాలు ఉనికికోసం పోరాడుతున్నాయి. కాంగ్రెస్ విముక్త భారత్ నినాదంతో ప్రధాన ప్రత్యర్థిని దెబ్బతీయటంతో పాటు మిగిలిన విపక్షాలు కూడా ఎదగకుండా బీజేపీ ఎత్తుగడలేస్తోంది.
గుజరాత్‌లో ఏడోసారి రికార్డ్‌స్థాయి మెజారిటీతో బీజేపీ గెలపు విపక్షాలను ఆత్మరక్షణలో పడేసింది. అదే సమయంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి ఆశలు రేపింది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారం చేజారటం విపక్షాల ఆలోచనలకు ఊపిరిపోస్తోంది. రెండు రాష్ట్రాల్లో విభిన్న తీర్పులతో స్థానిక సమస్యలపై ప్రజల్లో ఆలోచనని రేకెత్తించగలిగి బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపితే ఆ పార్టీని ఓడించటం అసాధ్యమేమీ కాదన్న ఆలోచన మొదలైంది. బలమైన స్థానిక అంశాలు ఉంటే వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే రాష్ట్రాల్లో మోడీకి చెక్ పెట్టొచ్చనుకుంటున్నాయి విపక్షాలు. హిమాచల్ ప్రదేశ్‌లో పాతపెన్షన్ విధానాన్ని పునరుద్దరిస్తామనే హామీ కాంగ్రెస్‌ని గెలుపు గుర్రం ఎక్కించింది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హిందూత్వ, జాతీయవాదమే బీజేపీ ప్రచారాస్త్రాల్లో కీలకంగా ఉంటాయనేది నిస్సందేహం. మోడీ ప్రభంజనాన్ని నిలువరించేందుకు దేశంలో థర్డ్‌ఫ్రంట్ కోసం ప్రయత్నాలు జరిగాయి. కానీ విపక్షాల మధ్య ఈ విషయంలో ఏకాభిప్రాయం లేదు. వామపక్షాలు ఊగిసలాటలోనే ఉన్నాయి. దీంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో మోడీని ఢీకొట్టేది కాంగ్రెస్సా, కేజ్రీవాలా అన్న చర్చకు తెరలేచింది. ఈసారి బీజేపీకి చెక్ పెట్టాలనే పట్టుదలతో రాహుల్ పాదయాత్ర కూడా చేస్తున్నారు. దేశమంతా చుట్టేస్తున్నారు. కానీ ఆమ్ఆద్మీతో కాంగ్రెస్‌కు పెద్దసవాలే ఎదురవుతోంది. గుజరాత్‌లో ఆప్ ఓట్లు చీల్చటంతో కాంగ్రెస్ 17 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఓట్లు 41శాతం నుంచి 27శాతానికి పడిపోతే, ఆప్ ఏకంగా 13శాతం ఓట్లు సాధించింది. ఎంసీడీలోనూ కాంగ్రెస్ ఆశలకు ఆప్ గండికొట్టింది.
గుజరాత్‌లో అంచనాలు తప్పినా పెరిగిన ఓట్లతో ఆప్ దూకుడు పెంచబోతోంది. బీజేపీకి తానే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. హిమాచల్ ప్రదేశ్‌పై ఆమ్ ఆద్మీ గట్టిగా దృష్టిపెట్టి ఉంటే కాంగ్రెస్‌కి నష్టం జరిగి ఉండేది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు ఉందో లేదో వచ్చే ఏడాది జరిగే సెమీఫైనల్స్ తేల్చబోతున్నాయి. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నెగ్గితే బీజేపీకి ఆ పార్టీనే ప్రధాన ప్రత్యర్థి అవుతుంది. ఆప్ పంజాబ్‌లోలా మ్యాజిక్ చేస్తే మాత్రం చీపురుపార్టీనే అందరికీ ప్రత్యామ్నాయంలా కనిపిస్తుంది.