‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఓ విడత పూర్తయింది. ఆ విడత పూర్తయిన తర్వాత హుజురాబాద్‌లో భారీ గెలుపు లభించింది. రెండో విడత ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే బండి సంజయ్ ఇమేజ్ అమాంతం పెంచుకున్నారు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారిని దాటి ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం హైకమాండ్ వద్ద కూడా ఆయనకు పలుకుబడి ఎక్కువగానే ఉంది. ఈక్రమంలో రెండో విడత పాదయాత్ర తర్వాత ఆయన తెలంగాణ వైఎస్‌గా పేరు తెచ్చుకుంటారని … ఆ దిశగా ఇమేజ్ కోసం ఆయన వర్గీయులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు.
రెండో విడత బండి సంజయ్ సుదీర్ఘ పాదయాత్ర !
యాత్ర మలి విడతగా ఈ నెల 14న అలంపూర్ జోగులాంబ ఆలయం వద్ద మొదలు కానున్నది. తొలి విడత యాత్ర 438 కిలోమీటర్లు, 36 రోజుల పాటు కొనసాగింది. ఆగస్టు 24న హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి నుంచి మొదలై, హుస్నాబాద్‌లో అక్టోబర్ 2 గాంధీ జయంతిన ముగిసింది. ఈ యాత్రలో కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ స్థాయి నాయకులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేరు మార్చి, నిధులు మళ్లించి తమ ఖాతాలో వేసుకుంటున్నారని జనంలోకి తీసుకెళ్తున్నారు. బండి సంజయ్ పాదయాత్ర ద్వారా కేవలం ప్రజల్నే కాదు.. బీజేపీ హైకమాండ్‌ను కూడా ఆకర్షిస్తున్నారు. ఆయనకు హిందీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండవచ్చు కానీ.. రాజకీయ భాష విషయంలో మాత్రం గట్టి పట్టు సాధించారని బీజేపీ వర్గాలు నమ్మకంతో ఉన్నారు.
మొదటి విడత పాదయాత్రపై బీజేపీ హైకమాండ్ ప్రశంసలు !
బండి సంజయ్ పాదయాత్ర తెలంగాణ బీజేపీలో ప్రత్యేకమైన ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది. సానుకూల స్పందన వచ్చిందన్న రిపోర్టులు ఢిల్లీకి చేరడంతో హైకమాండ్ కూడా రెండో వడితకు వంతు సాయం చేయాలని నిర్ణయించుకుంది. గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశంసించారు ప్రధాని మోడీ. ఆయన రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూంటారు. ఈ క్రమంలో బండి సంజయ్ పాదయాత్రపైనా ఆయన అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కొన్ని సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా భావించే పడిన వారికి ఈ సారి ఎక్కువ చాన్సులు ఉంటాయన్న అభిప్రాయం ఉంది. ఈ మేరకు టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజల దృష్టిలో ఉండాలంటే ఏం చేయాలో హైకమాండ్ తెలంగాణ బీజేపీ నేతలకు ప్రత్యేకమైన సూచనలు చేస్తోంది. సర్కార్‌పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, అసంతృప్తిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని.. నిర్ణయించారు.
ప్రతీ వారం తెలంగాణకు కేంద్ర ప్రతినిధులు
రెండో విడత పాదయాత్రలో కేంద్రం ప్రతినిధులుగా ప్రతీ వారం ఓ కేంద్రమంత్రి బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొనేలా షెడ్యూల్ రూపొందంచారు. అమిత్ షా పర్యవేక్షణలో పనిచేసే ఆరుగురు సభ్యుల బృందం రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటికే పనిచేయడం మొదలుపెట్టింది. అమిత్ షాటీం.. ప్రజా సంగ్రామ యాత్ర వెంటే సాగుతూ ఎప్పటికప్పుడు అమిత్ షా, నడ్డాలకు నివేదికలు పంపనుంది. మొదటి విడత పాదయాత్రలోనూ అంతే చేశారు. కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొనేందుకు ఏం చేయాలి తదితర అంశాలను నివేదికల ద్వారా పంపి ఎప్పటికప్పుడు ఆదేశాలు తీసుకుంటున్నారు. యాత్రకు కేడర్, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు జాతీయ నాయకత్వం అభిప్రాయానికి వచ్చింది. రెండో విడత తర్వాత బండి సంజయ్ ఇమేజ్ కూడా దానికి తగ్గట్లే పెరుగుతుందని.. ఆయన పాదయాత్రతో అధికారాన్ని తెచ్చుకున్న వైఎస్ తరహాలో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తెస్తారని ఆశ పడుతున్నారు.