ఉత్తరాది పార్టీగా ముద్ర పడ్డ బీజేపీ… క్రమంగా దాన్నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తోంది. కాషాయ పార్టీల్లో జరుగుతున్న పరిణామాలన్నీ… అలాగే అనిపిస్తున్నాయ్. కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత… ఊహించని నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా…. పార్టీని బలోపేతం చేసుకుంటోంది.
భారతీయ జనతా పార్టీ అంటేనే… బ్రాహ్మణుల పార్టీగా ప్రజల్లో గుర్తింపు పొందింది. అయితే దీన్నుంచి క్రమంగా బయటపడేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీజేపీ అంటే అన్ని వర్గాలు… అన్ని మతాలు… అన్ని కులాలు అన్న సూత్రంతో ముందుకెళ్లడానికి పక్కా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటోంది. ఏ మతానికి, కులానికి వ్యతిరేకంగా కాదన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెడీ అవుతోంది. వరుసగా రెండు పర్యాయాలు బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ…ఈ టెంపోను కంటిన్యూ చేయాలని భావిస్తోంది. దేశంలో దళితులు, గిరిజనుల ఓట్లను సుస్థిరం చేసుకోవడమే లక్ష్యంగా పని చేస్తోంది. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత… దళిత వర్గానికి చెందిన రాంనాథ్ కోవింద్ ను రాష్ట్రపతిగా ఎన్నుకుంది. తాజాగా గిరిజన సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును… ప్రెసిడెంట్ గా గెలిపించుకుంది బీజేపీ. దళితులు, గిరిజనులకు తొలిసారి దేశంలోనే అత్యున్నత పదవులను కట్టబెట్టిన పార్టీగా గుర్తింపు పొందింది. దీంతో ఆ రెండు వర్గాలను తమ వైపు తిప్పుకోవడంలో కొంత సక్సెస్ అయింది.
దళితులు, గిరిజనులకు ప్రాధాన్యత కల్పించిన విధంగానే… వెనుకబడిన వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. పార్టీలో కష్టపడి పని చేస్తున్న వెనుకబడిన వర్గాల నాయకులకు… మంచి పదవులు కట్టబెట్టాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీసీ నేతలకు పార్టీలో ప్రాముఖ్యత కల్పిస్తే… వచ్చే ఎన్నికల్లో ఆ సామాజిక వర్గాల ఓటర్లను ఆకర్షించవచ్చన్న అభిప్రాయానికి బీజేపీ నేతలు వచ్చారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 27 మంది ఓబీసీ నేతలను… కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంది. ఓబీసీ వర్గానికి చెందిన జగదీప్ ధన్కర్ ను… ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. రాజస్థాన్, హార్యానాలో జాట్ ఓటర్లు భారీగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఆయన్ను… అత్యున్నత పదవికి ఎంపిక చేసింది. ఇటు తెలంగాణలోనూ ఈటల రాజేందర్ కు పార్టీలో చేరికల కమిటీ బాధ్యతలు కట్టబెట్టింది. ఉత్తరప్రదేశ్ నుంచి లక్ష్మణ్ ను రాజ్యసభకు పంపింది.
బీజేపీకి దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. దీన్ని మరింత పటిష్టంగా చేసుకోవడంపై ఆ పార్టీ నేతలు ఫోకస్ పెట్టారు. పార్లమెంట్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా… కమలం పార్టీకి పట్టణ ప్రాంతాల్లోనే మెజార్టీ ఓట్లు వచ్చాయ్. సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్లమెంట్ స్థానం తీసుకున్నా…అర్బన్ ఓటర్లే బీజేపీ వైపు మొగ్గు చూపారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు… కాషాయ పార్టీని పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి పట్టణ ప్రాంతాల్లో పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీజేపీ హైకమాండ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.