హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది ?. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు ప్రధానమంత్రి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఒక్క ప్రధానేనా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ.. ఇంకా చెప్పాలంటే బీజేపీ వీవీఐపీలందరూ హైదరబాద్‌లోనే మకాం వేస్తున్నారు. మరి ఎంత హడావుడి ఉండాలి. అంతా ఉంది… కానీ మీడియాలోనే. హైదరాబాద్ బయట చూసేవారికే ఈ హడావుి కనిపిస్తోంది. కానీ హైదరాబాద్‌లో ఉన్న వారికి మాత్రం టీఆర్ఎస్ ప్లీనరీ ఏమైనా జరుగుతుందా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే నగరంలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు.. పోస్టర్లే కనిపిస్తున్నాయి మరి..!
హైదరాబాద్‌లో ఉన్న అన్ని యాడ్ ఏజెన్సీలకు చెందిన హోర్డింగ్‌లు.. మెట్రో పిల్లర్లకు చెందిన అడ్వర్టయిజ్‌మెంట్ స్పేస్ .. ఇలా మొత్తం నాలుగో తేదీ వరకూ తెలంగాణ రాష్ట్ర సమితి బుక్ చేసుకుంది. ఎలాంటి భారీ కార్యక్రమం పార్టీ పరంగా చేపట్టే ఉద్దేశం లేనప్పటికీ టీఆర్ఎస్ భారీగా ఖర్చు పెట్టి వీటిని బుక్ చేసుకుంది. వెంటనే ప్రభుత్వ పథకాలు.. అభివృద్ధిని కళ్లకు కట్టేలా ఆయా చోట్ల పబ్లిసిటీ ప్రారంభించింది. ఈ కారణంగా హైదరాబాద్ గులాబీ మయం అయిపోయింది . అందుకే హైదరాబాద్ రహదారుల గుండా వెళ్తున్న వారికి టీఆర్ఎస్ కార్యక్రమం ఏదో జరుగుతోందన్న అభిప్రాయం మనసులో కలుగుతుంది.
మోదీ వస్తున్నారని నెల రోజుల నుంచి హడావుడి చేస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు ప్రచారం విషయంలో మాత్రం మొదట వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయారు. అన్ని పనులు చేసుకుని తీరిగ్గా యాడ్ ఏజెన్సీల దగ్గరకు వెళ్లే సరికి కానీ వారికి లైట్ వెలగలేదు. అప్పటికే అన్నీ బుక్ అయిపోయాయని.. ఏమీ లేవని చెప్పడంతో ఇప్పుడు మోదీకి… బీజేపీ అగ్రనేతలకు స్వాగత ఫ్లెక్సీలు ఎక్కడ పెట్టాలా అని బీజేపీ నేతలు మథన పడిపోతున్నారు. టీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ ఏర్పాటు చేస్తున్న సభా వేదిక నుంచి తల పైకెత్తి చూస్తే చుట్టూ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపిస్తూంటాయి. సభలో ప్రసంగించే మోదీ కానీ ఇతర బీజేపీ అగ్రనేతలకు కానీ ఈ ఫ్లెక్సీలు స్పష్టంగా కనిపించనున్నాయి. ఇది తెలంగాణ బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది.
అయితే బీజేపీ ఓ కార్యక్రమం చేసుకుంటూంటే ఇలా టీఆర్ఎస్ ఫ్లెక్సీలతో ఎదురుదాడికి దిగడం ఏమిటని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికీ టీఆర్ఎస్ నేతలు సమాధానం ఇస్తున్నారు. తెలంగాణ జరుగుతున్న అభివృద్ధి గురించి బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వచ్చే వారికి తెలియచేయడానికి ఇంతకు మించిన మంచి సందర్భం ఏమి దొరుకుతుందని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. నిజాలు తెలియాలంటే.. ఇలా ప్రత్యక్షంగా చూపించాల్సిందేనని అంటున్నారు. ఈ విషయంలో బీజేపీ నేతలు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో పడిపోయారు.
ఇక యాడ్ ఏజెన్సీలకు సంబంధం లేని .. పబ్లిక్ ప్లేసుల్లో స్వాగత తొరణాలు పెట్టాలన్నా బీజేపీ నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. గ్రేటర్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి వాటిని తొలగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఫైన్స్ వేస్తున్నారు. ఇప్పటి వరకూ ఇలా వేసిన ఫైన్లు రెండు లక్షలకు దాటిపోయాయి. ఓ వైపు ఏజెన్సీల నుంచి స్పేస్ దొరక్క.. మరో వైపు పబ్లిక్ ప్లేసుల్లో పెట్టుకోక… బీజేపీ కార్యవర‌్గ సమావేశాల హడావుడి హైదరాబాద్‌లో కనిపించడం లేదు. దీంతో బీజేపీ నేతలు అసహనానికి గురవుతున్నారు.
రాజకీయం అంటే ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం.. వ్యూహాలను పకడ్బందీగా రూపొందించుకోవడం. ఆవేశపడితే రాజకీయాల్లో వర్కవుట్ కాదు. ఆలోచన ఉండాలి. ఈ విషయంలో బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేసి అందర్నీ ఆవేశపరిచి.. తాము ఆవేశ పడుతున్నారు కానీ.. ఆలోచనతో ముందడుగు వేయలేకపోయారు. ఫలితంగా ఇప్పుడు… ప్రధాని సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఇతర అగ్రనేతలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తాము చేసిన అభివృద్ధిని వారు వెళ్లే దారుల్లోనే ప్రదర్శిస్తోంది.
ఈ విషయంలో బీజేపీ నేతలు చేయగలిగిందేమీ కూడా లేకుండా పోయింది !