అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని చెప్పడం సులభం.. ఆచరణ అసాధ్యం… విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని రప్పించి ప్రతీ పేదవాడి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని ప్రకటించడం కూడా అంతే సులభం.. చేసేది మాత్రం శూన్యం.. దేశంలో ప్రస్తుత పరిస్థితులకు కారణం ఎవరు. మోదీ మహాశయుడు ఏం చేస్తున్నారు.. ఓ సారి చూద్దాం…
స్విస్ బ్యాంకు డిపాజిట్లు మరోమారు మన దేశంలో చర్చనీయాంశమయ్యాయి. భారతీయ సంస్థలు, వ్యక్తులు స్విస్ బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు 30 వేల 500 కోట్లకు చేరాయి. 2020 చివరి నాటికి స్విస్ బ్యాంకుల్లోని భారతీయ ఖాతాదారుల సంపద 20,700 కోట్లు ఉండేది డిపాజిట్ల తాజా పెరుగుదలతో 14 ఏళ్ల గరిష్టానికి చేరుకోగా.. 50 శాతం పెరిగినట్లు కూడా పరిగణించాల్సి ఉంటుంది. స్విస్ సెంట్రల్ బ్యాంకు అందించిన సమాచారం ప్రకారం భారతీయులు వ్యక్తిగత ఖాతాల్లో దాచుకున్న సొమ్ము 4 వేల 800 కోట్లకు చేరింది. రెండేళ్లుగా వ్యక్తిగత డిపాజిట్లు తగ్గుతుండగా ఈ ఏడాది అమాంతం పెరిగిపోయాయి. ఇదీ ఏడేళ్ల గరిష్టమని స్విస్ జాతీయ బ్యాంక్ ప్రకటించింది. భారత్లో ఉన్న స్విస్ బ్యాంక్ శాఖల్లోనూ మన వారి డిపాజిట్లు బాగా పెరిగాయి.
భారతీయుల ఖాతాలకు సంబంధించి స్విస్ ప్రభుత్వం తాజాగా వెల్లడించిన వివరాల్లో ఎన్ఆర్ఐ డిపాజిట్లను చేర్చలేదు థర్డ్ కంట్రీ ఎంట్రీ.. అంటే వేరే దేశాల్లో శాఖలున్న చోట చేసిన డిపాజిట్ల వివరాలు అందించలేదు. మొదటి నుంచి తమ వద్ద జమ చేసిన సొమ్మును స్విస్ బ్యాంకులు బ్లాక్ మనీగా పరిగణించడం లేదు. అయితే వాటి సమాచారాన్ని మాత్రం 2018లో చేసుకున్న ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వానికి అందిస్తోంది. గోప్యత అంశాలను ఆధారంగా చేసుకుని భారత ప్రభుత్వం ఆ వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఉంచడం లేదు. అందుకే భారతీయులు దైర్యంగా స్విస్ బ్యాంకుల్లో సొమ్ము భద్రపరుచుకుంటున్నారని భావించాల్సి వస్తోంది.
అందరు రాజకీయ నాయకుల్లాగే మోదీ కూడా భారీ వాగ్ధానాలు చేసి ఒట్టి చేతులు చూపించారు. అధికారానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. యాభై రోజుల్లోనే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని రప్పిస్తామన్నారు. ఒక్క పైసా కూడా వెనక్కి రాలేదు. ఇండియాలో దాచిన నల్ల ధనాన్ని ముక్కు పిండి బయటకు లాగుతామన్నారు. అదీ అట్టర్ ప్లాప్ అయ్యింది. పేదల ఖాతాలో 15 లక్షలు కాదు కదా…. పది పైసలు కూడా వేయలేకపోయారు. పైగా గ్యాస్ సబ్సిడీ కూడా ఆపేశారు. పెద్ద నోట్ల రద్దు మరో ఫెయిల్యూర్ గానే పరిగణించాలి.. మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల బ్లాక్ మనీ…అంతర్థానమవుతుందని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఆర్థిక వేత్తలు భావిస్తే రద్దు చేసిన కొద్దిరోజులకే 99 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి. నగదు దాచిన వారంతా దొడ్డిదారిన బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. నిజానికి దేశంలో ఉన్న బ్లాక్ మనీలో ఐదు శాతం మాత్రమే కరెన్సీ రూపంలో ఉంటుంది. మిగతాది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల రూపంలోనూ, బంగారం రూపంలోనూ మన కళ్లకు కనిపిస్తూనే ఉంటుంది. ఆ సంగతిని గ్రహించడంలో మోదీ విఫలమయ్యారు. బంగారంపై పరిమితులు విధించాలని భావించినా.. ప్రజాగ్రహానికి భయపడి టీమ్ మోదీ వెనుకడుగు వేసింది…
దేశంలో అన్నీ ఆంగ్లేయులు చేసిన చట్టాలే ఉన్నాయని, వాటిని కాంగ్రెస్ పాలనలో సవరించలేదని బీజేపీ ఆరోపిస్తూ ఉంటుంది ఇప్పుడు మోదీ వచ్చి ఎనిమిదేళ్లయినా చేసిందేమీ లేదు అవినీతి నిరోధక చట్టం , బినామీ లావాదేవీల చట్టం, అక్రమ ధన చలామణి నిరోధక చట్టం లాంటివి నిర్వీర్యమైపోయాయి. ఇటీవల అవినీతినిరోధక చట్టాన్ని సవరించినా.. అది నిందితులకే అనుకులంగా మారింది. కొన్ని సందర్భాల్లో విచారణాధికారులు…. ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకుని కేసులు పెట్టాలన్న నిబంధన విధించారు. దానితో అవినీతిపరులు సులభంగా తప్పించుకుంటున్నారు. పైగా అవినీతి సొమ్ము మొత్తం నల్లధనమేనని మరిచిపోకూడదు. ప్రభుత్వానికి లెక్కచూపని సంపద, దేశంలో స్మగ్లింగ్ పెరిగిపోవడం, డ్రగ్స్ రవాణా, పన్నులు ఎగవేసేందుకు బ్యాంకు ఖాతాలను తారుమారు చేయడం లాంటి చర్యలతో నల్లధనం పేరుకుపోతోంది. ఆర్థిక నేరగాళ్లయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లాంటి వారిని స్వదేశానికి రప్పించలేకపోవడంతో ఎన్ని చట్టాలు చేసిన ప్రయోజనం ఏముందన్న ప్రశ్న తలెత్తుతోంది….
ఉద్యమం సక్సెస్ అయ్యింది.. అవినీతి మాత్రం అలాగే ఉండిపోయింది. అన్నా హజారే ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని కేజ్రీవాల్ రాజకీయాల్లో రాణించారు. ఇప్పుడు కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా అందరి మన్ననలు పొందుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు. అసలు ఉద్యమకారుడు అన్నాను జనం మరిచిపోయారు. అప్పుడప్పుడు ఆయన రాలేగావ్ సిద్ధీలో దర్శనమిస్తారు. ఆమరణ దీక్షలు ప్రకటించి అంతలోనే రద్దు చేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా మహారాష్ట్ర ప్రభుత్వ మద్యం పాలసీపై ఉద్యమించి.. దీక్ష ప్రారంభానికి ముందే విరమించుకున్నారు. అన్నా లాంటి వాళ్లు ఎంతమంది ఉద్యమించినా… వ్యవస్థాగత లోపాల కారణంగా అవినీతిని నిరోధించడంలో సక్సెస్ కాలేకపోతున్నారు..
అవినీతి, నల్లధనం అవిభాజ్య కవలలు లాంటివి. వాటిని వదిలించుకోవడం అంత సులభం కాదు. మోదీ కూడా అరిచేతిలో వైకుఠం చూపించే నేతగా మిగిలిపోతున్నారే తప్ప.. తానిచ్చిన హామీల్లో చిత్తశుద్ధి చూపించలేకపోతున్నారు. మనం మాత్రం ఏం చేయగలం….