మొన్న అక్టోబరు 30న బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో పాలక పక్ష నేత జెయిర్ బోల్సొనారో పై లెఫ్ట్ వింగ్ కు చెందిన లూయిజ్ ఇనాసియో లూలా విజయం సాధించారు. ఇద్దరి మధ్య ఓట్ల తేడా చాలా తక్కువ. లూలాకు 50.9శాతం ఓట్లు రాగా ఓటమి చెందిన బోల్సొనారోకు 49.1 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓటమిని బోల్సొనారో అస్సలు నమ్మలేకపోయారు. తాను ఓడ్డం ఏంటి అని తనను తాను ప్రశ్నించుకున్నారు. తనపై లూలా గెలవడం ఏంటని ఒకింత అక్కసుతో నిలదీశారు. ఇందులో ఏదో కుట్ర ఉందని ఓ నిర్ణయానికి వచ్చేశారు. బోల్సొనారో ఓటమి చెందడంతో ఆయన మద్దతు దారులు మండిపడ్డారు. మా నాయకుడు ఓడేదే లే అన్నారు. ఎన్నికల తంతులోనే ఏదో మోసం ఉందని తీర్మానించేశారు. దేశంలోని సర్వోన్నత వ్యవస్థలన్నీ కూడా బోల్సొనారో గెలవకూడదని కలసి కట్టుగా కుట్ర చేశాయని వీరు ప్రచారం చేశారు.
అంతే తమ నేతకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటామా అని వేలాది మంది బోల్సొనారో మద్దతు దారులు రాజధాని కి తరలి వెళ్లారు. దేశాధ్యక్ష భవనంతో పాటు సుప్రీంకోర్టు, కాంగ్రెస్ కార్యాలయాలు ఉన్న భవనాలను చేరుకున్నారు. కిటికీ తలుపులు బద్దలు కొట్టారు. మంటలు రాజేశారు. అడ్డొచ్చిన పోలీసులపై దాడులు చేశారు. బోల్సొనారోకు మద్దతుగా నినాదాలు చేశారు. బ్రెజిల్ జాతీయ పతకాలతో హల్ చల్ చేశారు. ఈ దేశం దేశంలోని కాంగ్రెస్ అధ్యక్ష పదవి అన్నీ కూడా తమవేనని అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. భవనాల్లో చొరబడ్డ ఆందోళన కారులు అక్కడి విలువైన వస్తువులను లూటీ చేశారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బర్ బులెట్లు, టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలను ప్రయోగించారు. వందలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నికలకు ముందు నుంచి కూడా దేశంలో ఎన్నికల వ్యవస్థ కుళ్లి పోయిందని నిండా అక్రమాలు అవకతవకలతో నిండిపోయిందని పదే పదే ఆరోపించారు బోల్సొనారో. దేశంలోని మేథావులంతా తనను ఓడించడానికి కుట్ర పన్నుతున్నారని కూడా బోల్సొనారో ఆరోపించారు. మేథావులు, మీడియా కలిసి చేతులు కలిపి కుట్రపూరితంగా బోల్సొనారో పరాజయాన్ని రచించారని ఆయన మద్దతు దారులు దుయ్యబడుతున్నారు. దేశంలోని సైన్యం వెంటనే జోక్యం చేసుకుని లూలా అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలని కూడా వీరు డిమాండ్ చేశారు. లూలా విజయం సాధించినట్లు ఫలితాలు వెలువడినప్పటి నుండి బోల్సొనారో మద్దతుదారులు ఘర్షణలు రాజేస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి శాంతి భద్రతలు పరిరక్షించే పోలీసులపై పదే పదే దాడులు చేశారు. పోలీసు వాహనాలను దగ్ధం చేశారు. హింసాత్మక ఆందోళనలతో విధ్వంసాలకు తెగబడ్డారు.
మాజీ అధ్యక్షుడు బోల్సొనారోనే అల్లరి మూకలను రెచ్చగొట్టి విధ్వంసాలకు తెగబడ్డారని కొత్త అధ్యక్షుడు లూలా ఆరోపించారు. బోల్సొనారో తో పాటు ఆయన మద్దతుదారులు చేసిన విధ్వంసాన్ని క్షమించలేం అంటున్నారు లూలా. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే శిక్ష తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. బ్రెజిల్ లో చోటు చేసుకున్న ఈ అల్లర్లను ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. ప్రభుత్వ భవనాలపై దాడులు కలచి వేస్తున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను అందరూ గౌరవించి తీరాల్సిందేనని నరేంద్ర మోదీ సూచించారు. బ్రెజిల్ లో పాలక పక్షానికి ప్రభుత్వ అధికారులకు భారత్ మద్దతు ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. శాంతియుతంగా జరుగుతోన్న ప్రజాస్వామ్య బదలీపై దాడి జరగడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. బ్రెజిల్ లో ప్రజాస్వామ్య వ్యవస్థలకు అమెరికా మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు బైడెన్.
దేశ ప్రజలు తమ ఓటు హక్కుద్వారా వ్యక్తం చేసిన ఆకాంక్షలను అణచివేయకూడదని బైడెన్ అన్నారు. భవిష్యత్ లో లూలాతో కలిసి పనిచేయడంపై తాను దృష్టి సారిస్తున్నానని ఆయన అన్నారు. ఐక్యరాజ్య సమితి కూడా ఈ దాడులను ఖండించింది. ఈ దాడులకు సూత్రధారి అయిన బోల్సొనారో మొదట్నుంచీ వివాదస్పదుడే. తరచుగా ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం ఆయనకు కొత్త కాదు. ఈ మధ్యనే ఓ మహిళా సభ్యురాలిని ఉద్దేశించి ఆమెను నేను రేప్ చేయను ఎందుకంటే ఆమెకు అంతటి అర్హత లేదు అంటూ బోల్సొనారో తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్య చేసి విమర్శల పాలయ్యారు. పోయిన అధికారాన్ని విధ్వంసాలతో పొందచ్చని బోల్సొనారో కానీ ఆయన మద్దతుదారులు కానీ అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు మరోటి ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.