ఏపీ బీజేపీకి కొత్త బాస్ రాబోతున్నారా?

By KTV Telugu On 10 October, 2022
image

ఏపీలో బలపడేందుకు బీజేపీ ప్లాన్
రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే ఆలోచన
సత్యకుమార్ కు బాధ్యతలు అప్పగించే…
ఆలోచనలో బీజేపీ అగ్రనేతలు

ఏపీలో బలపడేందుకు బీజేపీ ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నా వర్కవుట్ కావడం లేదు. పొత్తులతో వెళ్తే కొద్దో గొప్పో సీట్లు రావడం మినహా సొంతంగా ఆ పార్టీ ఎక్కడా పుంజుకోవడం లేదు. వెంకయ్యనాయుడు లాంటి సీనియర్ నేత ఏపీలో ఉన్నా బీజేపీ మాత్రం పెద్దగా రాష్ట్రంలో ప్రభావం చూపలేకపోయింది. 2014 ఎన్నికల్లో జనసేన, టీడీపీలతో కలిసి వెళ్లిన బీజేపీ నాలుగు అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలను గెలుచుకోగలిగింది. ఇక,ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లి ఒక్కసీటు కూడా గెలవకపోగా, ఘోరంగా చతికిలపడింది. కేంద్రంలో మోడీ, షా హవా నడుస్తున్నా….ఏపీలో అధ్యక్షులను మారుస్తున్నా ఎలాంటి ఫలితం ఉండడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం పవన్ తో కలిసి నడుస్తున్నా మైలేజీ రావడం లేదు.

వైసీపీతో సఖ్యతగా మెలగడం బీజేపీకి మైనస్ గా మారిందనే అభిప్రాయం పొలిటికల్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అవసరమైనప్పుడల్లా కేంద్రానికి వైసీపీ మద్దతుగా నిలుస్తోంది. అయితే, కేంద్రం ఇచ్చే నిధులు, పథకాలపై జగన్ స్టిక్కర్ వేసుకుంటున్నారనే అభిప్రాయం కమలనాథుల్లో గట్టిగా ఉంది. ఈవిషయంలో వైసీపీ ప్రభుత్వానికి ధీటుగా కౌంటర్ ఇవ్వడంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఫెయిల్ అయ్యారని అగ్రనేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా సక్సెస్ కాలేకపోతున్నారు. వైసీపీ కూడా బీజేపీని లైట్ గా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు…రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే ఆలోచనలో బీజేపీ పెద్దలున్ననట్లు తెలుస్తోంది.

అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడైన పార్టీ కార్యదర్శి సత్యకుమార్ కు….ఏపీ బాధ్యతలు అప్పగించేందుకు మోడీ-షా సిద్ధమయ్యారట. సత్యకుమార్ ను రంగంలోకి దించితే వైసీపీని ధీటుగా ఎదుర్కోవచ్చనేది అధిష్టానం ప్లాన్ గా కనిపిస్తోంది. సత్యకుమార్ మంచి వాగ్ధాటి , ఎన్నికల వ్యూహాల్లోనూ దిట్ట. అందుకే కీలక రాష్ట్రాల భాధ్యతలు బీజేపీ పెద్దలు సత్యకుమార్‌కే అప్పజెప్తుంటారు. ప్రస్తుతం యూపీ బీజేపీకి కో ఇన్ ఛార్జ్ గా సత్యకుమార్ ఉన్నారు. ఎన్నికల సమయంలోనూ చురుగ్గా పనిచేసి పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఈనేపథ్యంలో ఏపీలో సొంతంగా ఎదిగేందుకు వ్యూహాలు రచిస్తోన్న బీజేపీ అధిష్టానం… ప్రత్యర్థులకు సత్యకుమారే సరైన వ్యక్తి అని డిసైడ్ అయ్యారట. మరి, అది ఎంతవరకు నిజమనేది వేచిచూడాల్సిందే.