వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ జగన్ సోదరి షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఏపీలో పార్టీ పెట్టడం ఖాయమని తేల్చేశారు. ఢిల్లీలో పార్టీ ప్రకటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొత్తగా పార్టీ పెట్టి బిసి కి సీఎం పదవి ఇస్తామని ఆయన ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది. బ్రదర్ అనిల్ మాటల ప్రకారం.. ఆయన ఏ క్షణంలో అయినా ఏపీలోపార్టీ పెట్టడం ఖాయమని అనుకోవచ్చు. అంతేకాక బీసీ సీఎంనినాదంతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ పార్టీ ఎవరి కోసం పని చేస్తుంది ?
జగన్‌కు నష్టమనే ప్రాథమిక అంచనాలు మిడిమిడి జ్ఞానమే !
బ్రదర్ అనిల్ కుమార్ పార్టీ పెడితే సీఎం జగన్‌కు తీవ్ర నష్టమని కొంతమంది అంచనా వేస్తున్నారు. దీనికి కారణం బ్రదర్ అనిల్‌కు క్రైస్తవ సంఘాల్లో ఉన్న పట్టు అనుకోవచ్చు. ఆయన చాలా కాలంగా మతాన్ని రాజకీయాలను కలిపేశారు. మత సమావేశాలు పెట్టి వైఎస్ జగన్ పార్టీకి ఓటేయాలని మతస్తులతో ప్రార్థనలు చేయించేవారు. అదే సమయంలో చర్చిలకు.. గ్రూపులకు ఆయన ఆర్థిక సాయం చేసేవారు. ఈ కారణంగా ఆయనకు క్రైస్తవుల్లో కాస్తంత పట్టు ఉందని అనుకోవచ్చు. అయితే అంత మాత్రాన ఆయన పార్టీ పెడితే ఓట్లన్నీ బ్రదర్ అనిల్‌కే వేస్తారా అంటే… ఎలా? అనే ప్రశ్న ముందు వస్తుంది. ఆయనను మత ప్రచారకునిగానే చూస్తారు కానీ .. రాజకీయ నేతగా కాదు.
బీసీ నినాదం వెనుక అసలైన ప్లాన్ !
బ్రదర్ అనిల్ బీసీ నినాదం వినిపించడం వెనుక అసలైన ప్లాన్ ఉందని అనుకోవచ్చు. బ్రదర్ అనిల్ అంటే క్రైస్తవ సమాజానికి ముఖ్యంగా కన్వర్టడ్ క్రీస్టియన్ సమాజానికి ఓ బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు. ఆయన బీసీ నినాదం అందుకున్నారంటే.. తాము పార్టీ పెట్టి కష్టపడి.. బీసీని సీఎంను చేస్తామంటే.. నమ్మడం చాలా మందికి సాధ్యం కాదు. నమ్మలేరు కూడా. వారు కూడా నమ్మలేరు. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టినా అధికారంలోకి రాదు. అది వేరే విషయం. కానీ బీసీ నినాదంతో ఓట్లు అయితే సంపాదించుకోవచ్చు. ఈ ఓట్లు ఎవరివి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ఆర్‌సీపీవి మాత్రం కాదు. ఆయన సీఎం కావాలని అనుకుంటున్నవారు ఆయనకే వేస్తారు. బ్రదర్ అనిల్ చెప్పినా.. ఆయనకు వేయరు. ఎందుకంటే అధికారంలోకి రారు కాబట్టి.. కానీ బీసీ సీఎం నినాదం ఇవ్వడం వల్ల .. కనీసం.. రెండు, మూడు శాతం బీసీలను ఆకర్షించినా.. అసలు ప్లాన్ సక్సెస్ అయినట్లే.
పవన్ కల్యాణ్ రోడ్ మ్యాప్‌నకు విరుగుడే అనిల్ అస్త్రం !?
ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కల్యాణ్ ఏం చెప్పారు ? వైఎస్ఆర్‌సీపీ వ్యతిరేక ఓటు చీల్చనివ్వబోనన్నారు. అంటే ఓటు బ్యాంక్ ఉన్న ప్రతి పార్టీని కలుపుకుంటామని ఆయన ఉద్దేశం. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కన్సాలిడేట్ అవుతుంది. అది వైసీపీకి గడ్డు పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యతిరేక ఓటు చీలాలంటే ఏం చేయాలి…? ఖచ్చితంగా మరో ఓట్లు చీల్చగలిగే శక్తి ఉండాలి. ఇప్పటికిప్పుడు పార్టీపెట్టి ఓట్లు చీల్చగలిగే శక్తి ఉన్నది.. వైఎస్ జగన్ కుటుంబీకులకు మాత్రమే. వారికి కులం, మతం అండ ఉంటుంది. కావాల్సినంత ఆర్థిక మద్దతుఉంటుంది. వ్యూహాలు అమలు చేయడానికి అధికార సపోర్ట్ ఉంటుంది. ఫలితంగానే బ్రదర్ అనిల్ పార్టీ తెరపైకి వస్తుంది.
అనిల్ పార్టీ వల్ల జగన్‌కే లాభం !
సోదరి షర్మిలతో జగన్ కు విభేదాలున్నాయని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. అందుకే ఇప్పుడు అనిల్ పార్టీ పెడుతున్నారంటే.. అది జగన్‌కు వ్యతిరేకమనే అనుకుంటారు. నిజానికి షర్మిల అన్నకు వ్యతిరేకంగా బహిరంగంగా ఇప్పటి వరకూ ఒక్క మాట మాట్లాడలేదు. బ్రదర్ అనిల్ మాత్రమే పైపైన మాట్లాడుతున్నారు. ఓట్లు చీల్చే వ్యూహం కాబట్టి… ఈ ప్రణాళిక ముందుకు వస్తుందని అనుకోవచ్చు. వైఎస్ జగన్ మార్క్ రాజకీయాలు ఎప్పుడూ ఆయన తనకు వ్యతిరేకంగా చేసుకుంటున్నారన్న భావన కల్పిస్తాయి.. కానీ అంతిమంగా లాభం చేస్తాయి. బ్రదర్ అనిల్ పార్టీ కూడా అంతే అనుకోవాలి.