బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలో పొలిటికల్ ఛేంజ్
రాష్ట్రంలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న జనసేన
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలవనుందనే సంకేతాలు
కేసీఆర్ రాకతో కొత్త సమీకరణలు తెరపైకి
బీఆర్ఎస్-జనసేన పొత్తుపై కొత్త చర్చ?
కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మారిపోతున్నాయి. ఇప్పటివరకు ఉన్న అంచనాలన్నీ తారుమారు అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొత్త సమీకరణలు తెరమీదకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఏపీ రాజకీయాలపై పడింది. ఏపీలోని రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల కోసం గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నాయి. పొత్తులపైనా అంతర్గతంగా చర్చలు జరుపుకుంటున్నాయి. మరోసారి జగన్ ఒంటరిగా బరిలోకి దిగేందుకే మొగ్గుచూపుతుంండగా…టీడీపీ, జనసేనతో కలిసి వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. ఆ దిశగా తమ్ముళ్లు సంకేతాలు ఇస్తున్నారు కూడా. అయితే, ఇప్పటికే బీజేపీ- జనసేన రాష్ట్రంలో భాగస్వామ్యపక్షాలుగా ఉన్నాయి. ఇద్దరూ దోస్తులన్న మాటేగానీ, ఎక్కడా రెండు పార్టీలు కలిసి కార్యక్రమాలు చేసింది లేదు. పోరాటాలు అంతకన్నా లేవు.
వచ్చే ఎన్నికల నాటికి జనసేన, బీజేపీతోనే కలిసి వెళ్తుందా ?లేక టీడీపీతో జతకడుతుందా ?అనే చర్చ జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ వచ్చి చేరింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయరాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… పొరుగు రాష్ట్రం ఏపీలో పార్టీ విస్తరణకు వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నారు. టీడీపీలో ఉన్న పరిచయాలతో కొందరు నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక, అదే సమయంలో వివిధ పార్టీల్లోని అసంతృప్త నేతలు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలను బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు…కేసీఆర్ ముగ్గురు మంత్రులకు బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదంతా, పక్కనబెడితే ఏపీలో జనసేనకు బీఆర్ఎస్ దగ్గరయ్యే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.
ఇప్పటివరకు టీడీపీ, జనసేన పొత్తుపై జరిగిన చర్చ అంతా…బీఆర్ఎస్ ఎంట్రీతో మరో మలుపు తీసుకుంటోంది.
టీడీపీతో పొత్తు సందర్భంలో సీట్ల ఖరారు పై సమస్యలు ఉంటాయని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారట. అయితే, టీడీపీ చంద్రుడిని కాదని తెలంగాణ చంద్రుడితో కలిస్తే రాజకీయంగా లాభమా – నష్టమా అనేది తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఇక, మెగా బ్రదర్స్ మద్దతు ఉంటే ఏపీలో బలపడొచ్చనే లెక్కలు వేసుకుంటున్నారట గులాబీ నేతలు. ఇందు కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీకి దూరంగా ఉన్న జనసేన…. టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తుందనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే, గత ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన జనసేన… కేవలం ఒక్కటంటే ఒక్కటే అసెంబ్లీ స్థానాన్ని గెల్చుకుంది. పవన్ కల్యాణ్ పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని జనసైనికులు చెబుతున్నప్పటికీ…మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలని ఆశిస్తున్నారు. . ఇందుకోసం వచ్చే ఏడాదిలో పవన్ కల్యాణ్ బస్సుయాత్రకు సిద్ధమవుతున్నారు.