మునుగోడు తర్వాత నెక్ట్ టార్గెట్

By KTV Telugu On 11 August, 2022
image

తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడా చూసినా…ఇపుడు మునుగోడు గురించే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి…ఎపుడు రాజీనామా చేస్తారన్న దానిపై ఆసక్తికరంగా మారింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి…రాజీనామాను ఆమోదించిన వెంటనే…మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక రానుంది. మునుగోడు తర్వాత మరిన్ని ఉప ఎన్నికలు రానున్నాయా ? టీఆర్ఎస్ ను మానసికంగా దెబ్బ తీసేందుకు బీజేపీ ప్రయత్నాలు షురూ చేసింది.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీకలో చేరికకు ముందే…ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత…ఆమోదించడం తిరస్కరించడం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మీద ఆధారపడి ఉంటుంది. ఒక వేళ రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదించిన తర్వాత…ఆరు నెలల్లోపు కేంద్ర ఎన్నికల సంఘం…ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలో జరిగిన నాలుగు ఉప ఉప ఎన్నికల్లో రెండు టీఆర్ఎస్, మరో రెండు బీజేపీ గెలిచింది. మునుగోడు…తెలంగాణలో ఐదో ఉప ఎన్నిక అవుతుంది. ఈ ఎన్నికల్లో గెలిచి…సత్తా చాటాలని అధికార పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయ్.

మునుగోడు గెలుపుతో రాష్ట్రంలో తాము ప్రత్యామ్నాయశక్తిగా మారాలని బిజెపి భావిస్తోంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదించిన తర్వాత…అధికార పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలకు బీజేపీ వల వేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా..అటు టీఆర్ఎస్ తో పాటు ఇటు కాంగ్రెస్ నేతలతో బీజేపీ అగ్రనేతలు చర్చలు జరుపుతున్నారు. జిల్లాల్లో మంచి పట్టున్న నేతలకు టికెట్ ఇస్తామంటూనే…పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితమైన నేతలు కాకుండా…మూడు నాలుగు అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగల నేతలతో కమలనాథులు సంప్రదింపులు జరుపుతున్నారు. నేతల ఆర్థిక బలం, అంగబలాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని….ఇటీవలే ఈటల రాజేందర్ చెప్పారు. ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో…కన్నెబోయిన రాజయ్య యాదవ్‌, ఎర్రబెల్లి ప్రదీప్‌ రావుతో పాటు మరికొంత మంది కాషాయ తీర్థం పుచ్చుకునే ఆస్కారం ఉంది. గత ఎన్నికల్లో ఖైరతబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్…తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

మునుగోడు తరహాలోనే రాష్ట్రంలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ…బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు భవిష్యత్‌ ఉండదని భావిస్తున్న..10 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడుతున్నారన్న వార్తలు దుమారం రేపుతున్నాయ్. ఈ కామెంట్స్ బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపుతుంటే…గులాబీ నేతల్లో కలవరం మొదలైంది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 62కు పైగా స్థానాలు వస్తాయని, సర్వేల్లోనూ ఇదే తేలిందని బీజేపీ చెబుతోంది. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నా…టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీలు…రేసులో లేవన్న సంకేతాలు పంపేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో అన్ని విధాలా తమకే బలం ఉందని…టీఆర్ఎస్ అవినీతిని ప్రజలు సహించడం లేదంటూ చెప్పుకుంటున్నారు. మునుగోడులో బీజేపీ భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.