ఈ సారి గురి తప్పదా..? పౌరసత్వ చట్టం అమలుకు రెడీ

By KTV Telugu On 8 August, 2022
image

పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోందా ? దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ పూర్తికాగానే…మళ్లీ తీసుకొచ్చేందుకు బీజేపీ సర్కార్ సిద్ధమవుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా…సీఏఏ అమలు తీసుకొస్తామని…తనతో చెప్పినట్లు బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ట్వీట్ చేశారు. దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన మోడీ సర్కార్…ఇపుడు సరికొత్తగా తీసుకురావాలని నిర్ణయించింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే అమలు చేయాలన్న లక్ష్యంతో ఉంది కేంద్రం.

దేశంలో పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న చట్టంలో కొన్ని మార్పులు చేసి….పటిష్టంగా అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ ప్రికాషనరీ డోస్‌ డ్రైవ్‌ పూర్తయిన వెంటనే…దీన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇదే విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా… పశ్చిమ బెంగాల్‌ బీజేపీ శాసనసభా పక్షనేత సువేందు అధికారి వద్ద వెల్లడించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు అమిత్ షా చెప్పారని…సువేందు అధికారి ట్వీట్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా సీఏఏ అమలుపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యూపీ ఎన్నికల ప్రచారంలోనూ…రెండు నెలల క్రితం పశ్చిమ బెంగాల్ లోనూ ఇదే విషయాన్ని హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఏప్రిల్‌ నెలలో ప్రికాషనరీ డోసు కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. దాదాపు ఇది 9 నెలల పాటు సాగనుంది. అంటే 2023 జనవరి లేదా ఫిబ్రవరిలో మళ్లీ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పౌరసత్వ చట్టాన్ని 1986, 1992, 2003, 2005, 2015లో సవరించారు.

వివిధ దేశాల నుంచి వచ్చి భారత్‌లో స్థిరపడిన మైనారిటీలకు పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో…సీఏఏను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చిన మైనార్టీలైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం ఇవ్వడమే దీని లక్ష్యం. 2019 డిసెంబర్‌ 10న పౌరసత్వ సవరణ చట్టంపై సుదీర్ఘ చర్చ తర్వాత లోక్ సభ ఆమోదం తెలిపింది. డిసెంబరు 11న రాజ్యసభలో సైతం ఆమోదం పొందింది. ఆ తర్వాత రోజే ప్రభుత్వం సీఏఏను నోటిఫై చేసింది. డిసెంబర్ 12న…అప్పటి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సంతకం చేయడంతో ఆ బిల్లు చట్టంగా మారింది. పౌరసత్వ సవరణ బిల్లు రాష్ట్రపతి భవన్ తలుపు తట్టకముందే, ఈశాన్య రాష్ట్రాల నుంచి దానిపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయ్. రాజకీయ పార్టీలు, విద్యార్థులు, సామాన్య జనం వీధుల్లోకి రావడంతో…ఆందోళనలు తారాస్థాయికి చేరాయ్. దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయ్. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం భారీగా భద్రత దళాలను మోహరించినా..నిరసనలు తగ్గలేదు.

సీఏఏ అమలుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయ్. రాష్ట్ర శాసనసభల్లోనూ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేశాయ్. గతంలో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమనడంతో… కొన్ని మార్పులు చేసి…ఈ సారి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది బీజేపీ సర్కార్. సీఏఏపై విపక్షాలకు సమాధానం చెప్పేందుకు నేతలను అలర్ట్ చేస్తోంది. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా…అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.