రాజకీయ పార్టీలకు కేసులే బ్రహ్మాస్త్రాలు

By KTV Telugu On 19 April, 2023
image

కేసులు కేసులు కేసులు. ఎటు చూసినా కేసులు రాజకీయ నేతలపై కేసులు. రాజకీయ పార్టీలకు వత్తాసు పలికే వ్యాపారులపై కేసులు ఒకరినొకరు తిట్టిపోసుకోడానికి కేసులు. ప్రజాసమస్యల గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు. ఫలానా పార్టీ నేతలపై ఆ కేసులు ఉన్నాయని వీళ్లు వీళ్లపై ఆ కేసులున్నాయని వాళ్లు పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడంతోనే సరిపోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇపుడు అందరి దృష్టి  కొన్ని కేసులపై ఉంది. ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై 2018లో విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన హత్యాయత్నం కేసును ఎన్.ఐ.ఏ. దర్యాప్తు చేస్తోంది. ఇక 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు వై.ఎస్.ఆర్.కడప జిల్లా పులివెందులలో జరిగిన వై.ఎస్.వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. చంద్రబాబు నాయుడి హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో వందల కోట్ల కుంభకోణంపై సిఐడీ సమర్పించిన వివరాలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈకేసులో చంద్రబాబు నాయుడితో పాటు ఆయన తనయుడు లోకేష్ పాత్రలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక టిడిపికి అనుకూలంగా వార్తలు రాస్తూ కాంగ్రెస్ కు తాము వ్యతిరేకులమని కోర్టు ముందే చెప్పుకున్న ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ కంపెనీలో ప్రజల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించడమే కాకుండా ఆ నిధులను అక్రమంగా దారి మళ్లించారన్న అభియోగాలపై సిఐడీ దర్యాప్తు జరుగుతోంది.

దీనిపైనే సుప్రీం కోర్టులోనూ విచారణ జరుగుతోంది. ప్రస్తుత ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెంనాయుడిపై ఈఎస్ఐ కుంభకోణం టిడిపి మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై హత్య కేసు ధూళిపాళ నరేంద్ర పై సంఘం డైరీ అక్రమాల కేసు ఉన్నాయి. అమరావతి భూకుంభకోణంలో చంద్రబాబు నాయుడి హెరిటేజ్ ఫుడ్స్ తో పాటు పలువురు టిడిపి నేతల పై ఆరోపణలు ఉన్నాయి. ఇపుడీ కేసులపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ మోహన్ రెడ్డి పాత్ర ఉందన్నట్లు చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా ఆరోపణలు చేస్తున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులోనూ జగన్ మోహన్ రెడ్డే కావాలని దాడి చేయించుకుని సానుభూతి కోసం ప్రయత్నించారన్నది చంద్రబాబు ఆరోపణ. చిత్రం ఏంటంటే ఈ రెండు కేసుల్లోనూ బాధితుడు జగన్ మోహన్ రెడ్డే. వై.ఎస్.వివేకానంద రెడ్డి స్వయానా జగన్ మోహన్ రెడ్డికి బాబాయ్. కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డిని ఏకాకిని చేయడానికి వివేకానంద రెడ్డికి పులివెందులలో కాంగ్రెస్ టికెట్ ఇచ్చి విజయమ్మపై పోటీ చేయించినా ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత వివేకా తిరిగి వై.ఎస్. జగన్ కు దగ్గరయ్యారు. వివేకాకు ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇచ్చారు జగన్. అయితే  గెలిచే అవకాశాలు ఉన్న చంద్రబాబు నాయుడి పార్టీ ప్రలోభాల కారణంగా వివేకా ఓడిపోయారు. బలం లేకపోయినా టిడిపి అభ్యర్ధి బిటెక్ రవి గెలిచారు.

ఇక హత్య జరిగే సమయానికి  వివేకానంద రెడ్డి వైసీపీ విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. తన అన్న కొడుకు ముఖ్యమంత్రి కావాలని పదే పదే చాటుకున్నారు. అటువంటి వివేకా దారుణ హత్యకు గురి కావడం జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి పెద్ద షాకే. అప్పుడు సిఎంగా ఉన్న చంద్రబాబు నాయుడే కేసు దర్యాప్తును నీరు గార్చారని హత్య వెనుక టిడిపి నేతల ప్రమేయం ఉందనే అలా చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. సరే ఆ కేసే ఇపుడు సిబిఐ దర్యాప్తులో ఉంది. ఈ  రెండు కేసులనూ అస్త్రాలుగా చేసుకోవాలని 2019 ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు. సొంత బాబాయ్ నే చంపేశారంటూ చంద్రబాబు ఆరోపించారు అయితే జనం నమ్మలేదు వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. నాలుగేళ్ల తర్వాత ఏడాదిలో ఏపీ ఎన్నికలకు వెళ్లబోయే తరుణంలో విచిత్రంగా ఈ రెండు కేసులనే అస్త్రాలుగా మలుచుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకే ఈ రెండు కేసుల్లోనూ జగన్ మోహన్ రెడ్డిని విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు టిడిపి నేతలు. ఇక టిడిపికి అనుబంధ పత్రికగా ప్రచారంలో ఈనాడు అధినేత రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల కేసులో ఏపీ సిఐడీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటిదాకా చేసిన దర్యాప్తులో మార్గదర్శిలో అక్రమాలు జరిగాయనడానికి ఆధారాలు దొరికాయని నిధుల మళ్లింపు రిజర్వు బ్యాంకు  మార్గదర్శక సూత్రాలకు విరుద్ధంగా జరిగినట్లు కూడా నిర్ధరణ అయ్యిందని సిఐడీ అధికారులు స్పష్టం చేశారు.

రామోజీరావు ఆయన కోడలు శైలజా కిరణ్ లను విచారించిన సిఐడీ ఇద్దరూ కూడా దర్యాప్తుకు సహకరించలేదని చెప్పారు. ఇక ఈ కేసుపైనే సుప్రీంలోనూ విచారణ జరుగుతోంది. తాజా విచారణలో మార్గదర్శిలో డిపాజిట్ దారులందరికీ చెల్లింపులు చేశామని మార్గదర్శి తరపు న్యాయవాది చెప్పారు. అయితే డిపాజిట్ దార్ల పేర్లు వివరాలతో పాటు వారికి చెల్లింపులు చెక్ ల రూపంలో ఇచ్చారా నగదు రూపంలో ఇచ్చారా ఇంకేమైనా రూపాల్లో ఇచ్చారా అన్నది తెలియజెయ్యాలని పిటిషనర్ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉండవల్లి వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి డిపాజిట్ దార్ల వివరాలను సమర్పించాల్సిందేనని ఆదేశించింది. ఈ కేసు విచారణ ఎటుపోతుందో తేలాల్సి ఉంది. వివేకా హత్య కేసు పై టిడిపి నేతలు వారి అనుకూల మీడియాలో బ్యానర్ కథనాలుగా వస్తూ ఉంటే మార్గదర్శి అక్రమాలు టిడిపి నేతల కేసులపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు వారి అనుకూల మీడియాలో ప్రత్యేక కథనాలుగా వస్తున్నాయి. ఒకరి గాలి తీయడానికి మరొకరు కేసులనే అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. ఇపుడు రాజకీయాల్లో ఇదే కొత్త ట్రెండ్ గా ఉంది. అటు తెలంగాణాలోనూ అంతే బిజెపిని దెబ్బతీయడానికి ఎమ్మెల్యేల ఎర కేసును  బి.ఆర్.ఎస్. నేతలు ఫోకస్ చేస్తున్నారు. దానికి కౌంటర్ గా అన్నట్లు బిజెపి ఢిల్లీ లిక్కర్ స్కాంలో బి.ఆర్.ఎస్. ఎమ్మెల్సీ సిఎం కేసీయార్ తనయ కవిత పై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే కవితను ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

ఇక పదో తరగతి పరీక్షా పత్రాల లీక్ కేసులో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసు నమోదు చేసారు తెలంగాణా పోలీసులు. ఈ కేసును అస్త్రంగా మలుచుకుని బిజెపికి కౌంటర్ ఇస్తున్నారు బి.ఆర్.ఎస్. నేతలు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమె తనయుడు రాహుల్ గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఇంటి పేరును కించపరిచారంటూ రాహుల్ పై దాఖలైన కేసులో కొద్ది రోజుల క్రితమే ఆయన్ను దోషిగా ప్రకటించింది సూరత్ కోర్టు. ఈ కేసు ఆధారంగానే రాహుల్ పై అనర్హత వేటు వేసింది లోక్ సభ సెక్రటేరియట్. ఇలా రాజకీయ పార్టీలన్నీ కూడ  ఏదోఒక కేసులో ఇబ్బందులు పడుతున్నాయి. ఈ కేసులన్నీ కూడా రాజకీయ కక్షసాధింపుతో బనాయించినవా లేక నిజంగానే తప్పులు జరిగాయి కాబట్టే కేసులు పెట్టారా అన్నవి తేల్చాల్సింది న్యాయస్థానాలే. అయితే ఎన్నికల్లో ప్రజలకు కావల్సింది తమ నేతలు ఏ మేరకు ప్రజాసేవ చేస్తారన్నదే చూస్తారు. అంతే కానీ వారిపై ఉన్న కేసులను ప్రజలు సాధారణంగా పట్టించుకోరు. మరి వచ్చే ఎన్నికల్లో అటు తెలంగాణాలోనూ ఇటు ఏపీలోనూ రాజకీయ పార్టీల పట్ల ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది కాలమే చెప్పాలి. అప్పటిదాకా రాజకీయ పార్టీలు పరస్పరం బురద జల్లుకునే ఆట కొనసాగిస్తూనే ఉంటాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. కేసుల విచారణ కూడా ఏళ్లకు ఏళ్లు పట్టకుండా సత్వరమే విచారించాలని మాజీ న్యాయమూర్తులు చాలా సందర్భాల్లో సూచిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.