ఆ 2గంటలు కోట్లమందికి ఊపిరాడలేదు!

By KTV Telugu On 25 October, 2022
image

వాట్సాప్‌ ఆగిపోతే ప్రాణం పోయినట్లేనా!

రెండుగంటలపాటు ఎవరో గొంతు పిసికేస్తున్నట్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. గుండెకు రక్తప్రసరణ ఆగిపోయినట్లు గుడ్లు తేలేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏదో కోల్పోయినట్లు మొహాలు వేలాడేశారు. ఇక మన ఇండియాలోనైతే కాలం ఆగిపోయినట్లే గింజుకున్నారు. ఏ మెసేజ్‌లూ లేవు. ఎక్కడినుంచీ ఎలాంటి సందేశాలు రావటం లేదు. ఏమన్నా పంపుదామంటే వీలుపడటం లేదు. గంటలతరబడి వాట్సాప్‌ ప్రపంచంలో బతికేసే కోట్లమంది రెండుగంటల తర్వాతే కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సేవలకు అనుకోకుండా అంతరాయం ఏర్పడింది. అప్పుడప్పుడూ కొన్ని సాంకేతిక అవరోధాలు వచ్చినా నిమిషాల వ్యవధిలో పరిష్కారమయ్యేవి. కానీ ఈసారి మాత్రం రెండుగంటలు వాట్సాప్‌ మొండికేసింది. మధ్యాహ్నం 12.30 నుంచి నిలిచిపోయిన సేవలు 2.30 గంటల నుంచి మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. భారత్‌ సహా దాదాపు 150దేశాల్లో వాట్సాప్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్‌ పనిచేయకపోవడంపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌ పోస్ట్‌ చేశారు. అంతా ట్విట్టర్‌ వైపు మళ్లారని కామెంట్స్ పెట్టారు. వాట్సాప్‌కి గ్రహణం పట్టిందంటూ ట్వీట్‌ చేశారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 244 కోట్ల మంది వాట్సాప్‌ సేవల్ని వినియోగించుకుంటున్నారు. 2009 నవంబర్‌లో యాపిల్‌ యూజర్ల కోసం తీసుకొచ్చిన వాట్సాప్‌ 2010లో అండ్రాయిడ్‌ ఫోన్లకు అందుబాటులోకి వచ్చాక క్రేజీయాప్‌గా మారిపోయింది. కేవలం నాలుగేళ్లలో 200 మిలియన్‌ యూజర్ల మార్క్‌కి వాట్సాప్‌ చేరుకుంది. వాట్సాప్‌ని 12రెట్ల ఎక్కువ విలువకి 19 బిలియన్‌ డాలర్లు వెచ్చించి 2014లో ఫేస్‌బుక్‌ సొంతం చేసుకుంది. భారత్‌లో వాట్సాప్‌కు 48 కోట్ల యూజర్లు ఉన్నారు.
మాట్లాడుకోవాలన్నా, సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలన్నా అన్నిటికీ వాట్సాపే. అందుకే 2గంటలు అది పనిచేయకపోయేసరికి కోట్లమందికి కాళ్లూచేతులు ఆడలేదు. మెసెజ్‌ షేరింగ్‌, ఫోటో షేరింగ్‌, స్టేటస్‌, కాలింగ్‌ సదుపాయాలతో వాట్సాప్‌ దైనందిన జీవితంలో భాగమైపోయింది. వాట్సాప్‌ వచ్చాక SMSలతో పాటు ISD కాల్స్‌మీద గట్టి దెబ్బపడింది. ఇక వాట్సాప్‌ గ్రూపులైతే కొత్త ఒరవడిని సృష్టించాయి. మీడియాకు వాట్సాప్‌ అతిముఖ్య సాధనంగా మారిపోయింది. అందుకే ఆ రెండుగంటలు ప్రపంచం అంతగా విలవిల్లాడిపోయింది.