దేశం మళ్లీ ఆరోగ్య ఎమర్జెన్సీలోకి జారుకుంటోందా? కొత్త వైరస్ తో తంటాలు తప్పవా ? పిల్లలే ఎందుకు టార్గెట్ అవుతున్నారు ? నివారణోపాయం ఉందా.. దానికి మార్గాలేమిటి..?
కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందన్న భయం ఓ పక్క వెంటాడుతోంది. ఒమైక్రాన్ మరో రూపంలో దాడి చేస్తుందన్న అనుమానం కలగుతోంది. మరో పక్క కొత్త వైరస్ సమాజాన్ని ఇబ్బంది పెట్టేందుకు సిద్ధవుతున్నట్లే కనిపిస్తోంది. టమాట ఫ్లూతో చిన్నారులు అల్లాడిపోతున్నారు. టమాట ఫీవర్, టమాట వైరస్ అని కూడా పిలిస్తున్న కొత్త వ్యాథిని నియంత్రించేందుకు వైద్య నిపుణులు అహరహం కృషి చేస్తున్నారు. మా పిల్లలకు టమాట ఫ్లూ సోకకుండా చూడు దేవుడా అని తల్లిదండ్రులు ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నారు.
టమాట ఫ్లూ ప్రస్తుతం ఎండమిక్ దశలోనే ఉందని వైద్య నిపుణులు ప్రకటించారు.
కేరళలోని కొల్లాం జిల్లాలో 2022 మే 26న తొలి కేసు నమోదైంది. కేవలం రెండు నెలల్లోనే ఈ సంఖ్య 82కు చేరింది. ఈ వైరస్‌తర్వాత తమిళనాడు, కర్ణాటక ఒడిశా, హర్యానా రాష్ట్రాలకు విస్తరించింది. దీంతో టమాట ఫ్లూ పట్ల అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 23న అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. వ్యాధి విస్తరణను అడ్డుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం మార్గనిర్దేశకాలు జారీ చేసింది. మొత్తం మీద వంద కేసులే ఉన్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే వేల కేసులున్నాయని.. జనం భయపడకుండా చూసేందుకే సంఖ్యను తగ్గించి చెబుతున్నారన్న వాదన వినిపిస్తోంది. వ్యాధి లక్షణాలు బయట పడిన వెంటనే దాన్ని గుర్తించడం కష్టమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ లక్షణాలు కూడా ఉండటంతో కొంత అయోమయ స్థితి తప్పడం లేదు. ఈ టమాటా ఫీవర్‌లో ఎక్కువ జ్వరం ఉండడంతో పాటుగా ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్ కూడా సాధారణంగా వస్తాయి. ర్యాషెస్ కూడా ఒంటి మీద ఉంటాయి. టమాటా ఫీవర్ వచ్చినప్పుడు ర్యాషెస్ వేరుగా ఉంటాయి. పిన్ పాయింట్ లాగ అంతా కూడా ఫ్లూయిడ్‌తో ఉంటుంది. నోరు, మోచేతులు, మోకాలు, పిరుదుల ప్రాంతాల్లో ఈ దద్దుర్లు ఉంటాయి. దద్దుర్లు టమాటను పోలి ఉండటంతో ఆ పేరు వచ్చిందని చెబుతున్నారు. అలసటగా ఉండటం, వాంతులు, ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు, పొత్తి కడుపు నొప్పి లాంటివి కూడా దీని లక్షణాలుగా చెప్పొచ్చు. ఒకటి నుంచి ఐదు సంవత్సరాల పిల్లల్లో టమాట ఫీవర్ కనిపించగా.. ఇప్పుడు తొమ్మిది పదేళ్ల పిల్లలకు కూడా వస్తోంది.
ఫ్లూ వచ్చినట్లుగా అనుమానాలున్నప్పుడు వారితో పాటు ఇతర పిల్లలు ఒకే కంచంలో అన్నం తినకూడదు. ఫ్లూ సోకిన పిలల్ల ఆట వస్తువులను ఇతరులు తాకకుండా చూసుకోవాలి. వారి చేతులు పట్టుకోవడం లాంటివి చేయకూడదు. పిల్లల్ని అడించే క్రమంలో వారిని ముద్దుపెట్టుకోవడం కూడా తగదు. నివాస ప్రాంతాల్లో హైజిన్ చాలా ముఖ్యం. చెత్తచెదారం పడేస్తే వైరస్ చాలా త్వరగా వ్యాపిస్తుందని గుర్తించాలి. చిన్నారులను కనీసం వారం పది రోజులు ఐసోలేషన్లో ఉంచాలి. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా ఎక్కువ కాలం ఆన్ లైన్ క్లాసులు ఉండటంతో పాటు.. ఎక్కువ సెలవులు రావడం వల్లే టమాట వైరస్ త్వరగా వ్యాపించలేదని అధికారులు అంటున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో స్కూల్స్ తెరవడం వల్ల టమాట ఫ్లూ బారిన పడే ప్రమాదం ఎక్కువగానే ఉంది. అది మహమ్మారిలా మారకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.