ఇల్లు సరే.. సీటు సంగతేంటి.. ?

By KTV Telugu On 16 May, 2022
image

టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడును పెంచారు. బాదుడే బాదుడు అంటూ జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రతీ స్కీమును ఎండగడుతూ జనంలోకి వెళ్తున్నారు. చంద్రబాబుకు ప్రజాస్పందన కూడా బాగానే వస్తోంది. పనిలో పనిగా తన సొంత నియోజకవర్గం కుప్పంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన రెండు పర్యాయాలు కుప్పంలో విస్తృత స్థాయి పర్యటన చేపట్టారు. వీధివీధినా తిరుగుతూ జనంలో కలిసిపోయారు. ప్రతీ ఒక్కరినీ పలుకరించారు. కుప్పంలో ఒక ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. ఆయనకు హైదరాబాద్, నారావారిపల్లిలో ఇల్లు ఉన్నప్పటికీ ఎన్నడూ కుప్పంలో ఇల్లు కట్టుకునే ఐడియా రాలేదు. ఇప్పుడు కుప్పంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టానని చెప్పేందుకు ఆయన అక్కడ ఇంటిని నిర్మించుకుంటున్నారు. కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడు దశాబ్దాల తర్వాత ఆయన అక్కడ న్యూ హౌజ్ స్టార్ట్ చేశారు.

కుప్పంపై వైసీపీ ఫోకస్

నిజానికి చంద్రబాబును అన్ని విధాలుగా దెబ్బతీసేందుకు వైసీపీ పావులు కదుపుతూనే ఉంది. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ఉన్నప్పుడే కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే కుప్పం ప్రజలను మాత్రం తమవైపుకు తిప్పుకోలేకపోయింది. టీడీపీ ఓడిపోయినా.. కుప్పం ప్రజలు మాత్రం చంద్రబాబునే ఎన్నుకున్నారు. ఆ తర్వాత మాత్రం సీన్ కొంచెం మారింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఓటమి చవిచూసింది. వైసీపీ స్కెచ్ వేసి మరీ టీడీపీ మద్దతుదారులను తనవైపుకు తిప్పుకుని స్థానిక ఎన్నికల్లో గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లోపు కుప్పంలో టీడీపీని ఖాళీ చేయాలన్న ఉద్దేశంతో వైసీపీ పనిచేస్తోంది.

చంద్రబాబు సెట్ చేశారా..

స్థానిక ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. కుప్పంలో పార్టీ శ్రేణులకు నూతనోత్తేజం తెచ్చే దిశగానే ఆయన అక్కడ పర్యటనలు జరిపారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కుప్పంలోని ద్వితీయ శ్రేణి నేతలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు రెండు పర్యటనలతో కొంత మేర పార్టీని సెట్ చేసినట్లు భావిస్తున్నారు. పార్టీ పరిస్థితిపై నివేదికల ఆధారంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు.

వైసీపీ గేమ్ ప్లాన్ ఏమిటి..

వైసీపీ మాత్రం కుప్పంలో ఈ సారి చంద్రబాబును గెలవనివ్వకూడదని నిర్ణయించుకుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అందించిన ఫీడ్ బ్యాక్‌తో కుప్పంలో వైసీపీ పావులు కదుపుతోంది. అక్కడ టీడీపీ శ్రేణుల తీరు ఏమిటి.. ఎవరినీ తమ వైపుకు తిప్పుకునే అవకాశం ఉంది.. లాంటి అంశాల్లో సమీక్షలు చేస్తోంది. స్థానిక ఎన్నికల సమయంలో కొందరిని తమవైపు లాగేసుకున్న వైసీపీ.. ఇప్పుడు మరికొంతమందిని తమవైపుకు తిప్పుకునేందుకు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. కుప్పంలో టీడీపీ శ్రేణులను డీ మోరలైజ్ చేసిన పక్షంలో చంద్రబాబుపై వత్తిడి పెంచే వీలుంటుందని భావిస్తున్నారు. పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి….