బాబు మనసులో పేలుతోన్న అగ్నిపర్వతాలేంటి?
గుండెల్లో ఏముందో కళ్లల్లో తెలుస్తుంది అని ఓ సినీకవి రాసింది నిజమే అనిపిస్తోంది.హృదయంలో ఏముందో మాటల్లో తెలుస్తుంది అని మార్చి పాడుకున్నా తప్పులేదనిపిస్తోంది. ఇదంతా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి గురించే.
రాజకీయంగా ఎన్నో ఢక్కా ముక్కీలు తిని చాణక్యుడి తర్వాత రాజకీయం చేయాలంటే చంద్రబాబే అని కీర్తించుకుని మూడు సార్లు ముఖ్యమంత్రి హోదాను అనుభవించిన చంద్రబాబు నాయుడు ఎందుకో కానీ కొంతకాలంగా బేలగా మారిపోయారు. తన రాజకీయ ఎత్తుగడలతో ఎందరినో ఏడిపించి ఇంకెందరినో ఫుట్ బాల్ ఆడుకున్న చంద్రబాబు నాయుడు ఏదో ఒక రోజున తనను ఏడిపించే వాడు వస్తాడని ఊహించి ఉండడు. కానీ అది నిజమైంది. కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు చాలా టెన్షన్ గా ఉంటున్నారు. చాలా అసహనంగా వ్యవహరిస్తున్నారు. ఊరికే మండిపడుతున్నారు. ఈ చికాకులన్నింటికీ ఏదో ఒక బలమైన కారణం ఆయన గుండెల్లో గూడుకట్టుకునే ఉంటుందని రాజకీయ సైకాలజిస్టులు అంటున్నారు.
మొన్న కర్నూలు లో నిన్న ఏలూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలను ఉద్దేశించి ఇవే నా చివరి ఎన్నికలన్నారు. దాంతో టిడిపి శ్రేణులతో పాటు రాజకీయ పండితులూ విస్తుపోయారు. ఇదేంటి రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారా ఏంటి చంద్రబాబు అని చర్చించుకోవడం మొదలైంది. మొదటి రోజున ఇవే చివరి ఎన్నికలన్న చంద్రబాబు రెండో రోజు కొద్దిగా లైన్ మార్చి ఇదే మీకు చివరి అవకాశం అని ప్రజలపైనే ఆ భారం పడేశారు. చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికలా? లేక ప్రజలకే చివరి ఎన్నికలా? అన్నది పక్కన పెడితే అసలు చివరి ఎన్నికలు అన్న మాట చంద్రబాబు నోట ఎందుకొచ్చిందన్నదేప్రశ్న. 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితం అయ్యింది టిడిపి. 2024 ఎన్నికల నాటికి మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తెస్తారని టిడిపి అభిమానులు ఆశలు పెట్టుకున్న తరుణంలో చంద్రబాబు నాయుడు చివరి ఎన్నికలనడం ఏంటి? అది దేనికి సంకేతం?
బహుశా వచ్చే ఎన్నికల్లోనూ టిడిపికి ఓటమి తప్పదని చంద్రబాబు నాయుడు భయపడుతున్నారా? ఒక వేళ వచ్చే ఎన్నికల్లోనూ టిడిపి అధికారంలోకి రాలేకపోతే టిడిపి రాజకీయంగా సమాధి అయినట్లేనా? అంటే ఔననే జవాబులే వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల నాటికి చంద్రబాబుకు 75 ఏళ్లు వస్తాయి. అప్పుడు అధికారంలోకి రాలేకపోతే 2029 ఎన్నికల్లో మరో ప్రయత్నం చేసుకోవాలి. అప్పటికి ఆయనకు 80 ఏళ్లు వస్తాయి. ఆ వయసులో ఆయన యాక్టివ్ గా చురుగ్గా వ్యవహరించగలరా అన్నది ప్రశ్న. చంద్రబాబే కాదు ఎవరికీ అది అంత తేలిక కాదు. బహుశా అందుకే చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ 2024లోనే గెలిచి తీరాలని అనుకుంటున్నారు. అయితే 2024 ఎన్నికల్లోనూ టిడిపికి అనుకూల వాతావరణం లేదన్న అనుమానాలు చంద్రబాబులో రోజు రోజుకీ పెరుగుతున్నట్లు అనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. ఆయనలోని అసహనం, ఆగ్రహం, ఆవేశం, ఆక్రోశం వంటివి తరచుగా బయటపడ్డానికి అదే కారణమై ఉండచ్చంటున్నారు. ఇంతకీ 2024లోనూ టిడిపి గెలవదని ఆయన ఎందుకు అనుమానిస్తున్నట్లు?
2019లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబులో ఓధీమా ఉండేది. ఏ మాత్రం అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసుకుంటూ పోయి ప్రజాగ్రహానికి గురవ్వడం ఖాయం అని చంద్రబాబు భావించారు.
అయితే దానికి భిన్నంగా జగన్ మోహన్ రెడ్డి దూసుకుపోవడం చంద్రబాబుకు జీర్ణం కావడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడమనే కొత్త సంప్రదాయానికి తెరతీసిన జగన్ మోహన్ రెడ్డి సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ పరుగులు పెడుతున్నారని కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రశంసలు, రిజర్వు బ్యాంకు, నీతి అయోగ్ నివేదికలే చెబుతున్నాయి. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు జగన్ మోహన్ రెడ్డి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో పాటు వివిధ ఉప ఎన్నికల్లోనూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. చిత్రం ఏంటంటే 2019లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కి వచ్చిన ఓట్ల శాతం కన్నా కూడా స్థానిక ఎన్నికల్లో చాలా ఎక్కువ ఓట్లు సొంతం చేసుకుంది పాలకపక్షం.
చివరకు చంద్రబాబు నాయుడి కంచుకోట అయిన కుప్పంలోనూ టిడిపికి ఘోరపరాజయం తప్పలేదు. 2024 ఎన్నికల్లో తన కుమారుడు లోకేష్ కు సురక్షితమైన నియోజక వర్గం అన్వేషించాలనుకుంటోన్న చంద్రబాబుకు ముందు తనకే ఓ సురక్షిత నియోజకవర్గం వెతుక్కోవలసిన అవసరం వస్తుందని చంద్రబాబు కలలో కూడా ఊహించి ఉండరు. కానీ అది అనివార్యమవుతోంది. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు తన సొంత టీమ్ చేత రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకున్న సర్వేలోనూ టిడిపి పట్ల ప్రజల్లో ఇంకా వ్యతిరేకత ఉండడమే కాకుండా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పట్ల తిరుగులేని సానుకూలత ఉన్నట్లు తేలిందట. ఇవన్నీ చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం మాట దేవుడెరుగు అసలు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితులు ఉన్నాయా అన్న ప్రశ్నలూ ఉదయిస్తున్నాయి.
ఈ ఆందోళనలే చంద్రబాబు గుండెల్లో అగ్ని పర్వతాలు రగిలిస్తున్నాయి. ఆ ఆక్రోశంలోనే చంద్రబాబు నాయుడి నోట అనాలోచితంగానే చివరి ఎన్నికలన్న మాట వచ్చేసి ఉంటుందని పొలిటికల్ సైకాలజిస్టులు భావిస్తున్నారు.
నాయకుడికే పార్టీ విజయంపై ధీమా లేకపోతే ఇక పార్టీ శ్రేణులకు ధైర్యం ఎక్కడుంటుంది? సేనాని వెను తిరిగితే సైన్యం కూడా యుద్ధభూమి నుండి వెనక్కి వెళ్లిపోతుంది. 2024 ఎన్నికలు చంద్రబాబు నాయుడికీ, తెలుగుదేశం పార్టీకీ కూడా జీవన్మరణ సమస్యే అని చెప్పక తప్పదు. ఎందుకంటే అప్పుడు అధికారంలోకి రాకపోతే పార్టీని మరో అయిదేళ్ల పాటు నడిపించగల బలమైన నాయకుడు అవసరం అవుతారు.
టిడిపిలో అటువంటి వారు లేరు. అపుడు మళ్లీ నందమూరి వంశీకులను రంగంలోకి దించాల్సి వస్తుంది. జూనియర్ ఎన్టీయార్ ను పిలిచే అవకాశాలున్నాయి. కాకపోతే చంద్రబాబు నాయుడిని మరోసారి నమ్మి మోసపోడానికి జూనియర్ సిద్ధంగా లేడని అంటున్నారు. తన తండ్రి హరికృష్ణనే అవమానాల పాలు చేసిన చంద్రబాబు నాయుడి పార్టీకోసం పనిచేయకూడదని జూనియర్ అనుకోవడం వల్లనే 2018లో తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి హరికృష్ణ తనయ సుహాసిని పోటీచేసినా జూనియర్ ఎన్టీయార్ ప్రచారానికి రాలేదు. సో 2024లో అధికారంలోకి రాకపోతే మాత్రం టిడిపికి గడ్డు కాలం తప్పదంటున్నారు రాజకీయ జ్యోతిష్కులు.