పోటీపోటీగా జిల్లాల పర్యటనలు..
పరస్పర రాజకీయ విమర్శలు
జనంతోనే తన పొత్తు అంటోన్న జగన్
ప్రజలకే లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన బాబు
ఇంకా ఏడాదిన్నర సమయమున్నప్పటికీ ఏపీలో ఎన్నికల సందడి మొదలైనట్లే కనిపిస్తోంది. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు పోటాపోటీ జిల్లా పర్యటనలతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. మదనపల్లెలో ముఖ్యమంత్రి సభకు జనం పోటెత్తగా అటు ఏలూరులోనూ చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరోసారి గెలుపే లక్ష్యంగా దూకుడు పెంచుతున్న జగన్ వరుస పర్యటనలతో హీటెక్కిస్తున్నారు. జిల్లాల్లో భారీ బహిరంగసభలు నిర్వహిస్తూ తండోపతండాలుగా తరలొచ్చిన జనసందోహం మధ్యే సంక్షేమ పథకాల నిధులను విడుదల చేస్తున్నారు. అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా మదనపల్లెలో విద్యాదీవెన కింద నాలుగో విడత నిధులను మంజూరు చేసిన జగన్ శుక్ర, శని వారాల్లో తన సొంత నియోజకవర్గానికి వెళ్తున్నారు.
అటు చంద్రబాబు కూడా తగ్గేదేలే అంటున్నారు. జగన్‌కు ధీటుగా జిల్లా టూర్‌లు నిర్వహిస్తున్నారు. ఒక్కో జిల్లాలో మూడు రోజుల పాటు మకాం వేస్తోన్నారు. ఇదివరకు కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన ఇప్పుడు ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటకు వెళ్లారు. మూడు రోజుల పాటు అక్కడే బహిరంగ సభలు, రోడ్‌షోలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏలూరుకు వెళ్లిన బాబుకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. ఏపీలో వైసీపీ పాలనను నిరసిస్తూ టీడీపీ చేపట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని చంద్రబాబు ఏలూరులో ప్రారంభించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు వివేకా హత్యపై ఇచ్చిన తీర్పుతో పాటు పోలవరంపై జగన్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ బాదుడే బాదుడుపై ప్రజల్లో చైతన్యం రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
మదనపల్లె సభా వేదికగా మరోసారి జగన్ ఎప్పటిలాగే దుష్టచతుష్టయంపై నిప్పులు చెరిగారు. బాబు, పవన్ కల్యాణ్‌తో పాటు ఆ పార్టీల అనుబంధ మీడియాపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిలిపివేయటానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందని నమ్మితేనే తనకు ఓటు వేయాలంటూ సెంటిమెంట్ పండించారు. ఇక ఇదే సమయంలో పొత్తులకు సంబంధించి కీలక కామెంట్స్ చేసారు. మళ్లీ సింగిల్‌గానే వస్తామనే సంకేతాలు పంపారు జగన్. తనకు ప్రజలతోనే పొత్తుంటుందని స్పష్టం చేశారు. ఇక కర్నూలులో ఇదే తనకు లాస్ట్ ఛాన్స్ అన్న చంద్రబాబు స్వరం మార్చారు. ప్రజలకే లాస్ట్ అంటున్నారు. జగన్ వంటి ఉన్మాదులు గెలిస్తే అమరావతి రాజధానిగా ఉండదని పోలవరం ముంచేస్తాడని తాను ముందే చెప్పినా వినలేదని ఇప్పుడైనా వింటారని ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పుకొచ్చారు. ఈసారి కూడా అర్ధం చేసుకోకపోతే ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ అవుతుందంటూ చెప్పుకొచ్చారు.