పత్తికొండలో చంద్రబాబు హాట్ కామెంట్స్
గెలవకపోతే రాజకీయలకు దూరమవుతారా?
లేక జగన్‌ను కొట్టేందుకు ఆయింట్మెంట్ పూశారా?
ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ఏపీలో అప్పుడే హీట్ మొదలైంది. రాబోయే ఎన్నికలు టీడీపీకి చావోరేవోగా మారాయి. ఈనేపథ్యంలో ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్న చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు రావొచ్చనే అంచనాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓ వైపు లోకేష్ పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తూనే తాను జిల్లాల పర్యటనలు, నియోజకవర్గ సమీక్షలతో దూకుడు పెంచుతున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు పత్తికొండలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే, లేకపోతే ఇవే తనకు చివరి ఎన్నిక అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో తనను, తన భార్యను అవమానించారని కౌరవసభను గౌరవసభగా మార్చేందుకు తనకు అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఈసారి గెలవకపోతే నిజంగానే బాబు రాజకీయాలకు దూరమవుతారా?లేక కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోటగా మారినందున అక్కడ గెలుపు కోసం సెంటిమెంట్ పండించారా అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది.
వైసీపీకి మొదటి నుంచి కర్నూలు జిల్లా ప్రజలు అండగా నిలుస్తూ వస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాలుండగా గత ఎన్నికల్లో అన్ని స్థానాలను వైసీపీ గెలుచుకుంది. జిల్లా మొత్తం జగన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 2014 ఎన్నికల్లోనూ 12 అసెంబ్లీ 2 లోక్ సభ సీట్లను గెలుచుకుంది. దీంతో జగన్ కు పట్టున్న ఈ జిల్లాలో ఎలాగైనా పాగా వేయాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో టీడీపీ ఈ జిల్లాలో అత్యధిక స్థానాలు దక్కించుకుంది. 2004 తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్సార్సీపీలకు జిల్లా ప్రజలు మద్దతు ఇస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి జిల్లాలో పార్టీకి పునర్ వైభవం తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మెజారిటీ స్థానాలను గెలుచుకునేలా వ్యూహరచన చేస్తున్నారు. దాంట్లో భాగంగానే అక్కడ మూడు రోజుల పర్యటన పెట్టుకున్న బాబు జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. రాజధానుల పేరుతో మూడు ముక్కల ఆట ఆడుతున్నాడని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే కర్నూలు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడతానంటూ హామీ ఇచ్చారు. అదే సమయంలో గతంలో నంద్యాల ఉపఎన్నిక సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సింపథీ పొందే ప్రయత్నం చేశారు బాబు. తనను జగన్ రోడ్డు మీద కాల్చివేయాలన్నారని, ఉరి తీయాలన్నారని గుర్తు చేసారు.
ఇక, టీడీపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలు ఆపేస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన బాబు అలాంటిదేమీ లేదని కర్నూలులో క్లారిటీ ఇచ్చారు. నవరత్నాలు పెద్ద మోసమని విమర్శించారు. ఇదిలా ఉంటే ఇక తనకు అండగా నిలుస్తున్న కర్నూలు ప్రజల కోసం జగన్ అక్కడ న్యాయరాజధానిని ప్రకటించారు. అదేసమయంలో జిల్లాలో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో మాదిరే రాయలసీమ ప్రజల అభిమానం చూరగొనేందుకు అక్కడ వికేంద్రీకరణకు మద్దతుగా ర్యాలీలు, సభలు మొదలుపెట్టింది. టీడీపీ మాత్రం రాజధాని అమరావతికే కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఇలాంటి సమయంలో సీమ ప్రజలు ముఖ్యంగా కర్నూలు ప్రజానీకం టీడీపీకి సపోర్ట్ చేస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. అందుకనుగుణంగానే ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక బాబు ఓ అడుగు ముందుకేసి ఇవే తన చివరి ఎన్నికలంటూ ప్రకటించారు. మరోసారి తమదే అధికారమనే ధీమాతో ఉన్న వైసీపీ కర్నూలు ప్రజలు తమవెంటే ఉంటారని విశ్వసిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జిల్లా ప్రజలు ఎవరివైపు నిలుస్తారో చూడాలి.