బాబు బై బై… పొలిటికల్ గేమ్ షురూ!

By KTV Telugu On 18 November, 2022
image

ఒక్క ఛాన్స్..వన్ మోర్ ఛాన్స్‌లకు
వరంగా మారిన బాబు లాస్ట్ ఛాన్స్‌
ప్రత్యర్థులకు బ్రహ్మాస్త్రం ఇచ్చిన సీబీఎన్
ఆడుకుంటోన్న వైసీపీ..జనసేన సైతం
బాబు మాటలతో బీజేపీకి దారిదొరికినట్లేనా?

ఏపీలో అధికారం కోరుకుంటున్న ప్రధాన పార్టీల నేతలందరిదీ ఇప్పుడు ఒకటే మాట. పవన్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటుంటే, బాబు మాత్రం లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. ఇద్దరి మధ్యలో జగన్ వన్స్ మోర్ అంటుండడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎవరి రాజకీయం ఎలా ఉన్నా కర్నూలు పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. గెలిపిస్తే అసెంబ్లీకి వెళతా, లేకుంటే ఇవే తనకు చివరి ఎన్నికలంటూ చంద్రబాబు సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ పూశారు. అయితే అది బాబు మెడకే చుట్టుకుంటోంది. ప్రజలు జాలిపడడం ఏమో గానీ ప్రత్యర్థులకు మాత్రం బ్రహ్మాస్త్రాన్ని అందించినట్లైంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గెలిపిస్తే సరే, లేకుంటే పోటీ చేసేది లేదన్నట్టుగా చెప్పడం రాజకీయ వర్గాలను విస్మయపర్చింది. అంతేకాదు తనను, తన భార్యను అవమానించారంటూ చంద్రబాబు మానిపోయిన గాయాన్ని మళ్లీ గిల్లడం ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపర్చింది. వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసమే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారనేలా విమర్శలకు తావిచ్చినట్లైంది. బాబు ఏ ఉద్దేశంతో అలాంటి మాటలన్నారో గానీ నిజమే చెప్పారని అధికార వైసీపీ ఆడుకుంటోంది. అంతేకాదు జనసైనికులు కూడా చంద్రబాబును ఈవిషయంలో టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం సంచలనం రేపుతోంది. ఇక రాష్ట్రంలో ఎదగాలనుకుంటున్న బీజేపీకి బాబు అవకాశం కల్పించినట్లు అయ్యింది. మొత్తంగా అందరూ బాబు బైబై అనే రీతిలో పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు.

సీబీఎన్‌ను ఆడుకుంటోన్న వైసీపీ
చంద్రబాబు వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మల్చుకోవడంలో వైసీపీ సఫలీకృతమవుతోంది. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా పోటీ పడి మరీ మంత్రులు, వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. చంద్రబాబును ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇదే తనచివరి ఎన్నిక అంటూ చంద్రబాబు మొదటిసారి నిజం చెప్పారంటూ ఎద్దేవా చేస్తున్నారు. తాము మొదటి నుంచి చెబుతుంది అదేనని చంద్రబాబుకు వచ్చే ఎన్నికేల చివరవి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబు కోరిక తప్పక తీరుతుందని దేవుడు కూడా తథాస్తు అంటారని సెటైర్లు పేలుస్తున్నారు. తులసీనీళ్లు పోస్తేనే బతుకుతాను అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎన్నికలకు ముందే ఆయన ఓటమిని అంగీకరించారని రకరకాల స్టేట్ మెంట్లు బాబు వ్యాఖ్యలకు జోడిస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదంటూనే చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరివన్న విషయం ప్రజలకు ఎప్పుడో తెలుసునంటూ వెటకారం చేస్తున్నారు. అదేసమయంలో ఇ‍ప్పటికే చంద్రబాబుకు కుప్పం జారిపోయిన విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. జనం మరోసారి జగన్‌నే కోరుకుంటున్నారని చెబుతున్నారు.

బాబుపై జనసైనికుల వెటకారం
వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఎదుర్కొనేందుకు కలిసి నడుస్తామంటూ బాబు, పవన్‌లు బయల్దేరారు. జనసేనతో టీడీపీ పొత్తు ఖాయమని అంతా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో జనసైనికులు కూడా చంద్రబాబు వ్యాఖ్యలకు వెటకారం జోడించడం సంచలన విషయమనే చెప్పాలి. చంద్రబాబు వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. బాబు నిర్ణయం జనసేనకు కలిసొస్తుందని అంటున్నారు. బాబు విజన్ 2020తోనే ముగిసిందని, ఇప్పుడు కొత్త శకం మొదలైందని పోస్టులు పెడుతున్నారు. 2024 నుంచి జనసేన ప్రజా పరిపాలన మొదలవుతుందని జోస్యం చెబుతున్నారు. తమ అధినేతను బాబుతో పోల్చుతూ సెటైర్లు వేస్తున్నారు. పవన్ చిత్తశుద్దికీ, ఇతరుల అధికార దుర్భుద్దికి తేడా ఇది అంటూ ట్వీట్లు చేస్తున్నారు. పదవున్నా లేకున్నా ప్రజల కోసం పోరాడుతానన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తున్నారు. అధికారంలో లేకుంటే ఎమ్మెల్యేగా ఉన్నా సభలోకి అడుగు పెట్టనని 40 ఏళ్ల అనుభవం ఉన్న నేత మాట్లాడారని ప్రాణమున్నంత వరకూ ప్రజల పక్షాన పోరాడుతానంటూ పవన్ కళ్యాణ్ అన్నారని జనసైనికులు చెబుతున్నారు. చంద్రబాబు చివరి ఎన్నికలు అంటుంటే, తమ అధినేత మాత్రం పోరాటం చేస్తూనే ఉంటానని చెబుతున్నారని ఇద్దరి మధ్యే అదే తేడా అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన పార్టీ సత్తా చాటుతుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీకి బ్రహ్మాస్త్రం
తెలుగు రాష్ట్రాల్లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి చంద్రబాబు తాజా వ్యాఖ్యలు అస్త్రంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవకపోతే రాజకీయాలకు గుడ్ బై చెబుతాననేలా బాబు కామెంట్స్ ఉండడం కమలనాథులకు కలిసొచ్చేలా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు దగ్గరకు పవన్ వెళ్లకుండా చేయడంతో పాటు ఏపీలో కాషాయ పార్టీని బలోపేతం చేసేందుకు ఇదే సరైన సమయం అని బీజేపీ నేతలు భావిస్తున్నారట. ఇప్పటికే చంద్రబాబు స్థానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఆ స్థానం భర్తీ చేసేందుకు బీజేపీ ముందుకొస్తుందని స్వయంగా వైసీపీ మంత్రులే చెబుతున్నారు. ఇటువంటి అవకాశాలు అంది పుచ్చుకోవటంలో మోడీ-అమిత్ షాలు సిద్ద హస్తులనే విషయాన్ని పలువురు నాయకులు చెబుతున్న మాట.

పెద్దాయన మాటల్లో తప్పేముంది అంటోన్న తమ్ముళ్లు
తెలుగు తమ్ముళ్లు మాత్రం చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. ఈ విషయంలో వచ్చే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. చంద్రబాబు అవసరం ఈరాష్ట్రానికి ఉందంటున్న ఎల్లో టీమ్. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఎవరి రాజకీయం ఎలా ఉన్నా టీడీపీ అధినేత ఇదే తన చివరి ఎన్నిక అంటూ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేసింది. పాలిటిక్స్‌లో 40 ఇయర్స్ అనుభవం ఉన్న పెద్దాయన లాస్ట్ ఛాన్స్ మాటలు రానున్న కాలంలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.