సుప్రీం కొత్త చీఫ్‌ జస్టిస్‌ బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా

By KTV Telugu On 9 November, 2022
image

న్యాయదేవత సాక్షిగా.. రెండు తరాల వారసత్వం

సుప్రీంకోర్టు కొత్త చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అందరి నోళ్లలో నానుతున్నారు. ఆయన నేతృత్వంలో న్యాయం నాలుగుపాదాలమీద నడుస్తుందన్న నమ్మకం కలిగిస్తున్నారు. కారణం ఆయన నేపథ్యం. సుప్రీం న్యాయమూర్తిగా ఆయన గతంలో సంచలన తీర్పులు ఇచ్చారు. ఆధార్‌ బిల్లును మనీ బిల్లుగా పాస్‌ చేయడాన్ని మెజార్టీ న్యాయమూర్తులు సమర్థిస్తే అది రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఒక్కరే కుండబద్దలు కొట్టారు. ఆ చట్టంలోని నిబంధనలు వ్యక్తిగత గోప్యత, గౌరవం, స్వేచ్ఛని ప్రభావితం చేస్తాయని తేల్చిచెప్పారు. 10నుంచి 50 ఏళ్ల మహిళలను శబరిమల ఆలయ ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని తప్పుపట్టింది కూడా జస్టిస్‌ డీవై చంద్రచూడే. వ్యభిచారం నేరంకాదని మెజార్టీ తీర్పుతో ఏకీభవించారు. 44 ఏళ్లక్రితం తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేస్తే, ఇప్పుడు తనయుడు ఆ అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం విశేషం. భారత న్యాయవ్యవస్థలోనే ఈ అరుదైన ఘట్టం తొలిసారి చోటుచేసుకుంది. కొత్త సీజేఐ తండ్రి వైవీ చంద్రచూడ్‌ 44 ఏళ్లక్రితం ఏడేళ్లపాటు సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగి రికార్డు సృష్టించారు.

డీవై చంద్రచూడ్‌ ఈ కీలకబాధ్యతల్లో రెండేళ్లపాటు కొనసాగబోతున్నారు. 1959 నవంబరు 11న బాంబేలో జన్మించిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అమెరికా హార్వర్డ్‌ లా స్కూల్‌లో 1983లో స్కాలర్‌షిప్‌ మీద ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ చేశారు. అదే యూనివర్సిటీలో జ్యుడీషియల్‌ సైన్సెస్‌లో డాక్టరేట్‌ పూర్తిచేశారు. ఒక్లహామా యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లాలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా కూడా సేవలందించారు. న్యాయవాదిగా ఉన్నప్పటి నుంచి సామాజిక అంశాలపై సూక్ష్మదృష్టిసారించిన వ్యక్తిగా పేరున్న డీవై చంద్రచూడ్‌ చీఫ్‌ జస్టిస్‌ హోదాకు ఎదిగారు.