చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. ఓ పక్క పాకిస్తాన్‌ని దువ్వుతూనే భారత్‌పై కుట్రలకు తెగబడుతోంది డ్రాగాన్ కంట్రీ. ఉద్దేశపూర్వకంగా వాస్తవాధీనరేఖని దాటుతోంది. దాడికి కూడా తెగబడుతోంది. గాల్వాన్ ఘర్షణలో రెండుదేశాలకు జరిగిన ప్రాణనష్టాన్ని మరిచిపోకముందే మరోసారి చైనా హద్దుమీరింది. తన పరిధి దాటింది. మూడ్రోజుల్లో రెండుసార్లు చైనా దుస్సాహసం ఘర్షణకు దారితీసింది. మన సైనికులతో పాటు చైనా సైనికులు కూడా గాయపడ్డారు.
శత్రుదేశాలతోనో, పొరుగుదేశాలతోనో సంబంధాలు బెడిసి కొట్టినా, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చెలరేగినా కేంద్రం వెంటనే ప్రకటన చేస్తే ఏ గొడవా ఉండదు. ఉన్నదున్నట్లు చెప్పేస్తే ఊహాగానాలకు తావే ఉండదు. కానీ చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతోందని విపక్షాలు చట్టసభల్లో నిలదీసేదాకా గోప్యంగా ఉంచాల్సిన అవసరంలేదు. ఇక దేశరక్షణకు సంబంధించిన అంశాన్ని రాజకీయాలతో అసలు ముడిపెట్టనే కూడదు. కానీ బీజేపీ అపర చాణక్యుడైన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోరు. అంగుళం భూభాగాన్ని కూడా చేజారిపోనివ్వం వరకూ బాగానే ఉంది. కానీ 1962లో చైనా ఆక్రమణ గురించీ, చైనానుంచి కాంగ్రెస్ నేతలకు విరాళాల ఆరోపణలతో సీరియస్ మ్యాటర్‌ని సిల్లీగా మార్చేశారు.
2005-2007 మధ్య కాలంలో చైనా రాయబార కార్యాలయం నుంచి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ కోటిన్నర గ్రాంట్ అందిన విషయం ఇప్పుడు ప్రస్తావించి కేంద్రపెద్దలు ఏ సందేశం ఇవ్వదల్చుకున్నారు. కాంగ్రెస్ దేశద్రోహానికి పాల్పడిందనా? కాంగ్రెస్‌ని చూసుకునే చైనా కవ్విస్తోందనా? చైనామీద నెహ్రూకున్న ప్రేమను ఇప్పుడు గుర్తుచేస్తున్నప్పుడు మాటమీద నిలబడని ఆ కంత్రీ కంట్రీతో ఎలా వ్యవహరించాలో ఇప్పుడున్న పాలకులకు ఓ స్పష్టత ఉండాల్సిన అవసరం లేదా? దేశ భూభాగాన్ని రక్షించుకునేందుకు మన సైన్యం ప్రాణాలొడ్డేందుకైనా సిద్ధం. వారి త్యాగనిరతి అపూర్వం. కానీ ఆ వీరుల త్యాగాలను రాజకీయం చేయాలనుకుంటే మాత్రం ఏ భారతీయుడూ క్షమించడు.