తైవాన్ మరో ఉక్రెయిన్ అవుతుందా..

By KTV Telugu On 3 August, 2022
image

అమెరికా, చైనా  మధ్య తైవాన్ నలిగిపోతోందా…. తైవాన్  పై డ్రాగన్ దేశం దండయాత్ర చేస్తుందా…ఉక్రెయిన్ పరిస్థితులు తైవాన్ కు దాపురిస్తాయా… సుదీర్ఘ యుద్ధం ఎవరికి ప్రయోజనం, బైడెన్ వర్సెస్ జిన్ పింగ్ లో పేలుతున్న మాటల తూటాలేమిటి…..

తైవాన్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుని చాలా రోజులైంది. చైనా మాత్రం అది ముమ్మాటికి తమ దేశంలో అంతర్భాగమేనని చెప్పుకుంటోంది. స్వతంత్ర కాంక్ష ఉన్న తైవాన్ ప్రజలు చైనాలో కలిసేందుకు సిద్ధంగా లేరు. పాశ్చాత్య దేశాలు తైవాన్ ను ప్రత్యేక దేశంగా గుర్తించి చాలా రోజులైంది. దౌత్య సంబంధాలతో పాటు.. తైవాన్ కు ఆర్థిక సాయం చేస్తూ.. ఆ దేశం ధైర్యంగా నిలబడేందుకు ఊతమిస్తున్న అమెరికా.. నిత్యం చైనాతో సంఘర్షణ కోసం తైవాన్ ను వాడుకుంటోంది. ఇప్పటికే టిబెట్ ను కలిపేసిసుకున్న చైనా పాలకులు తైవాన్ ను కూడా అదే తరహాలో నొక్కెయ్యాలని ప్రయత్నిస్తున్నారు…

తైవాన్ పేరెత్తకుండా అమెరికా ఉండలేదు.. గట్టిగా సమాధానం చెప్పకపోతే చైనా మనసొప్పదు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత జీ జిన్ పింగ్ ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా తైవాన్ అంశం చర్చకు వచ్చింది. నిప్పుతో చెలగాటమాడితే మీకే నష్టమని జిన్ పింగ్ గట్టిగా చెప్పినట్లు సమాచారం. తైవాన్ పై  ఆధిపత్యం కోసం యుద్ధానికైనా సిద్ధమన్నట్లుగా చైనా మాట్లాడుతోంది. తైవాన్ వ్యవహారంలో మాటల తూటాలు పేలడం ఈ ఏడాదిలో ఇది రెండోె సారి ….ఫిబ్రవరిలో అమెరికా రక్షణశాఖ బృందం చైనా పర్యటించినప్పుడు కూడా చైనా గట్టి హెచ్చరికలే చేసింది. రెచ్చగొట్టే చర్యలు వద్దంటూ ప్రకటనలు గుప్పించింది. ఇప్పుడు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి..తైవాన్లో పర్యటిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో చైనా ఆగ్రహానికి లోనవుతోంది..

ఉక్రెయిన్ పై రష్యా  దండయాత్ర చేసినట్లుగానే.. చైనా కూడా తైవాన్ పై దాడి చేసే వీలుందని కొంతకాలంగా చర్చ జరుగుతోంది. చైనా మొండి వైఖరే అటువంటి  చర్చలకు కారణమవుతుండగా.. దండయాత్ర అంత సులభం కాదని యుద్ధ రంగ నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం నేర్పిన పాఠాలను చైనా అర్థం చేసుకోవాలంటున్నారు. వారంలో ఉక్రెయిన్ తమకు దాసోహం అంటుందని  ఎదురు చూసిన రష్యా భంగపడి చాలా రోజులైంది. యుద్ధం ఇంకా కొనసాగుతోంది. జెలెన్ స్కీ సైన్యం వీరోచితంగా పోరాడుతోంది. తైవాన్ కూడా అదే స్థాయిలో ప్రతిఘటనకు దిగుతుందని అంచనా వేస్తున్నారు. పైగా భూమార్గంలో ఉక్రెయిన్ కు సరఫరాలు  పంపే అవకాశం రష్యాకు  ఉంది. తైవాన్ ఒక దీవి దేశం కావడంతో యుద్ధం వస్తే పూర్తిగా నావికాదళంపై ఆధారపడాల్సిన అవసరం చైనాకు వస్తుంది. ఇప్పటి వరకు చైనా ఎవరితోనూ యుద్ధం చేసిన సందర్భం లేకపోవడంతో సుదీర్ఘ యుద్ధానికి డ్రాగన్ సైన్యం సిద్ధంగా ఉందని కూడా చెప్పలేం..

తైవాన్ కు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. రాజధాని తైపేపై పలు దేశాలు దండయాత్ర చేశాయి. 16వ శతాబ్దంలో డచ్, స్పెయిన్ దేశస్తులు తైవాన్ ను తమ కాలనీగా మార్చుకునే ప్రయత్నం చేశారు. 19 శతాబ్దం నాటికి జపాన్ పాలనలోకి తైవాన్ వెళ్లిపోయింది. జపాన్ కు కూడా తైవాన్ దగ్గరగా ఉండటంతో పాలన సులభమైంది. తైవాన్ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు జపాన్ సాయపడింది. రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత తైవాన్ పై హక్కులను జపాన్ వదులుకోవడంతో కొత్త చరిత్రకు తెరలేచింది. అదే సమయంలో మావో నేతృత్వంలో కమ్యూనిస్టులు చైనాపై పట్టు సాధించడంతో అక్కడి చాంగ్ కాయ్ షేక్ వర్గం .. గత్యంతరం లేక తైవాన్ పారిపోయింది వారి వారసత్వమే ఇప్పుడు తైవాన్ లో పాలన సాగిస్తోంది. 1940ల నుంచి తైవాన్ ను కలిపేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తూనే ఉంది. 2025 నాటికి యుద్ధం చేసే దిశగా చైనా తమ సైన్యానికి తర్ఫీదు ఇస్తోందని తైవాన్ పాలకులు ఆరోపిస్తున్నారు….

రష్యా,ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా నేరుగా పాల్గొలేదు. ఇతోధికంగా ఉక్రెయిన్  కు కొంత సాయం అందిస్తుందంతే. చైనా, తైవాన్ యుద్ధం వస్తే కూడా బైడెన్ ప్రభుత్వ వైఖరి అలాగే ఉండబోతోంది. ఆప్ఘనిస్థాన్ అనుభవం తర్వాత ఎక్కడా డైరెక్ట్ ఫైట్ కు అమెరికా  ఇష్టపడటం లేదు. చైనా మాత్రం నిత్యం తైవాన్ ను కవ్విస్తూనే ఉంది. అప్పుడప్పుడు చైనా విమానాలు తైవాన్ గగనతలంలోకి ప్రవేశించి ఆ దేశాన్ని రెచ్చగొడుతున్నాయి. తైవాన్ తో చాలా రకాలుగా చైనాకు వ్యూహాత్మక అవసరాలున్నాయి. సెమీ కండెక్టర్ల పరిశ్రమలో తైవాన్ నెంబర్ వన్. ప్రపంచ సెమీకండక్టర్ల తయారీలో సగం తైవాన్ నుంచే వస్తాయి తైవాన్ తమదే అయి ఉంటే  ఆ పరిశ్రమ తమ చేతుల్లో ఉండేదని చైనా విశ్వసిస్తోంది. పైగా తూర్పు చైనా సముద్రంలో ఉన్న నాలుగు దేశాల్లో తైవాన్ కీలకమవుతుంది. మరో పక్క చైనాకు కూడా యుద్ధం ఇష్టం లేదన్నది బహుకొద్ది మంది వాదన. దానివల్ల వచ్చే ఆర్థిక, ఇతరత్రా నష్టాలను చైనా బేరీజు వేసుకుంటోంది. కాకపోతే  టిబెట్ ను కలిపేసుకున్నట్లుగా తైవాన్ ను కూడా కలిపేసుకోవాలన్న ఆశ మాత్రం ఉంది.