అంతరిక్షంలో చెత్త పోగేస్తున్న డ్రాగన్ కంట్రీ!
పాకిస్తాన్‌కు సాయం చేస్తుంది. తైవాన్‌మీద కయ్యానికి దిగుతుంది. రష్యాకు వంతపాడుతుంది. భారత్ భూభాగంలోకి చొచ్చుకొస్తూ కవ్వింపు చర్యలకు దిగుతుంది. మన పొరుగున ఉన్న డ్రాగన్ కంట్రీ కంత్రీ చేష్టలు అన్నీఇన్నీకావు. ఆయుధసంపత్తిని పెంచుకుంటూ పోతున్న చైనా ఆకాశంలో కూడా తన పెత్తనమేనంటోంది. అంతరిక్షంలోనూ చెత్త పోగేస్తూ ప్రపంచానికి తల్నొప్పులు తెచ్చిపెడుతోంది.
చైనాకు చెందిన ఓ భారీ రాకెట్ శిథిలాలు భూమిపై పడబోతున్నాయి. 23 టన్నుల శకలాలు ఏ క్షణమైనా భూవాతావరణంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. అంతరిక్షంలో చైనా చేపట్టిన న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ పనులు పూర్తికావచ్చాయి. ఈ కేంద్రం నిర్మాణం కోసం డ్రాగన్ చివరి మాడ్యూల్‌ను భూమి నుంచి పంపించింది. ఈ రాకెట్ భూకక్ష్యను చేరుకున్న తర్వాత తిరిగి భూమిపైకి ప్రవేశిస్తుంది. దాదాపు 10 అంతస్తుల భవనమంత ఉండే ఈ రాకెట్ భూవాతావరణంలోకి చేరుకున్నాక కొంతభాగం కాలిపోయినా కొన్ని ప్రధాన భాగాలు మాత్రం అలాగే భూమిపై పడతాయి.
చైనా రాకెట్ శకలాలు ఎక్కడ పడొచ్చనేదానిపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. అయితే ఈ శకలాలతో మానవాళికి కొంత ప్రమాదం తప్పకపోవచ్చని ఏరోస్పేస్ కార్పొరేషన్ అంచనావేస్తోంది. 88శాతం నివాస ప్రాంతాల్లోనే ఈ శకలాలు పడే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన ల్యాబొరేటరీ మాడ్యూల్‌ను తరలించేందుకు 2020నుంచి నాలుగుసార్లు చైనా రాకెట్‌ని ప్రయోగించింది. పోయినేడాది లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్ శకలాలు మాల్దీవుల సమీపంలో కూలిపోయాయి. ఈ ఏడాది జులైలో ప్రయోగించిన రాకెట్ శకలాలు మలేసియా, ఇండోనేషియా సమీపంలోని ద్వీపంలో, ఫిలిప్పీన్స్ సమీపంలోని సముద్రంలో పడిపోయాయి. మరి ఈసారి ఎవరి నెత్తిన పడతాయో తెలీదుగానీ చైనా వ్యవహారాలతో ప్రపంచమంతా ఆందోళనపడాల్సి వస్తోంది.