ఏడెనిమిది నెలలకు ముందే ఏపీ రాజకీయాలు ఊపందుకున్నాయి. కౌన్ బనేగా సీఎం అంటూ జనం ప్రశ్నించుకుంటున్నారు. జనం కంటే జనసైనికుల్లో విశ్వాసం పెరుగుతోంది. ఈసారి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావడం పక్కా అని వాళ్లు చెప్పుకుంటున్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామో పవన్ చెప్పేస్తున్నారు. సంకీర్ణం వైపుకు అడుగులు వేస్తున్నట్టే కనిపించినా.. సీఎం పదవిపై ఆయన ఎందుకు ఆశలు పెట్టుకున్నారన్నది కూడా ఓ ప్రశ్నే….
రాజకీయాల్లోకి రావడమంటేనే అత్యున్నత పదవికి గాలం వేసినట్లు పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రజలు కోరుకుంటే తాను సీఎం అవుతానని పవన్ కల్యాణ్ తరచూ చెప్పుకోవడం కూడా ఈ దిశగానే చూడాలి. జనసైన్యం కూడా పవన్ ను చూసినప్పుడల్లా సీఎం..సీఎం అంటూ నినాదాలిస్తుంటుంది. తాజాగా వారాహి యాత్ర మూడో దశలో భాగంగా పవన్ కల్యాణ్ విశాఖ వెళ్లినప్పుడు పార్టీ కేడర్ అదే నినాదాలిస్తూ ఆయన్ను ఉత్తేజ పరిచారు. పవన్ సైతం తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ పోయారు. ఇదే మిత్రపక్షాల్లోనే కొందరికి నచ్చొచ్చు కొందరికీ నచ్చకపోవచ్చు. నచ్చిన వారి గేమ్ ప్లాన్ లో భాగంగా కూడా పవన్ తరచూ నేను సీఎంను అంటూ మాట్లాడొచ్చు. కాకపోతే పవన్ కల్యాణ్ కు పాపులాటిరీ పెరుగుతోందని చెప్పేటoదుకు కూడా ఈ గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారనుకోవాలి. ఎప్పుడూ వాళ్లేనా వేరే వాళ్లకు అవకాశం రాకూడదా అన్నది కూడా ఇప్పుడు కొత్త ప్రశ్న….
విశాఖ లో పవన్ ప్రసంగం మొత్తం ఆవేశపూరితంగా సాగింది. వచ్చేది జనసేన ప్రభుత్వమే అంటూ ధీమాగా చెప్పడమూ కనిపించింది. వైసీపీలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారంతా రెడీగా ఉండాలని పవన్ హెచ్చరించడమూ జరిగింది.ఏపీలో వైసీపీని ఓడిస్తామని పవన్ అంటున్నారు. తామే అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు కూటమి గురించి కాకుండా జనసేన మాత్రమే అధికారంలోకి వస్తుందని పవన్ చెప్పడం పైన తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది.జనసేన మాత్రమే ఏపీని గాడిలో పెట్టగల పార్టీ అని పవన్ అంటున్నారు. విశాఖలో పవన్ స్పీచ్ చూస్తే సీఎం పదవి కి అధికారానికి తామే ప్రధాన పోటీ అని చెప్పకనే చెప్పారని అంటున్నారు.పొత్తులు ఉండొచ్చు, మిత్రుల మధ్య స్నేహాలు ఉండవచ్చు కానీ తమ అజెండాతోనే ముందుకు వెళ్తామని అధికారంలోకి వస్తామని పవన్ మాటలను బట్టి అర్ధం అవుతోంది.
జనసేనకు గత ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు వచ్చాయి. ఈ సారి అది 12 నుంచి 15 శాతం వరకు పెరగొచ్చిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి నేతలు విశ్లేషిస్తున్నారు. మరికాస్త బలం పుంజుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా తన రాజకీయ భవిష్యత్తుపై ధీమాగానే ఉన్నారు.ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కాపు సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేస్తుండగా. ఏదో విధంగా ఈసారి పవన్ ను సీఎం కుర్చీలో చూడాలని జనసైన్యం ఆశ పడుతోంది. ఇప్పటి వరకు ఉన్న పార్టీలతో జనం విసిగిపోయారని, ఈ సారి పవన్ సీఎం కావాలన్నది జనసేన కార్యకర్తల ఆలోచనా విధానం. అందుకు చంద్రబాబు కూడా సహకరంచిన పవన్ ను సమర్థించాలని కోరుకునే వాళ్లూ ఉన్నారు. ఒక శాతం ఓట్ షేర్ ఉన్న బీజేపీ ఎలాగూ పవన్ కల్యాణ్ కు మద్దతిస్తుందని జనసేన ఎదురుచూస్తోంది. పవన్ కు బీజేపీ నుంచి పూర్తి సమర్థింపు ఉందని ఇటీవల పరిణామాలు చెబుతున్నారు. అందుకే ఆయన ఇప్పుడు ఫుల్ ఫోర్స్ లో మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే ఎగరేసి తంతానని ఆయన సవాలు చేస్తున్నారు. చెప్పుతో కొడతాను అన్న డైలాగ్ కూడా వచ్చేసిందనుకోండి.
తన భావోద్యేగ డైలాగుల ద్వారానే జనసైనికులను పవన్ ఐకమత్యంగా ఉంచగలుగుతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పవన్ సీఎం అంటే వారిలో ఒక తెలియని అనుభూతి, ఒక కొత్త కిక్కు కనిపిస్తోంది. పూనకంతో ఊగిపోతున్నారు. పవన్ గద్దెనెక్కాల్సిందే.. మేము చూడాల్సిందే అన్న రేంజ్ లో వాళ్లు డిసైడయ్యారు. మరి జనసైనికుల కోర్కేను పవన్ ఎలా నెరవేర్చుతారనేదే పెద్ద ప్రశ్న. టీడీపీని వదిలేసి బీజేపీతో మాత్రమే కలిసి పోటీ చేసి.. జాక్ పాట్ కొట్టేందుకు పవన్ సిద్దమేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీలైనంత త్వరలో పొత్తులపై క్లారిటీ వస్తే ఏదైనా చెప్పొచ్చు.. అంతే మరి..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…