హిమాచల్ ప్రదేశ్లో సీఎం బ్యాక్గ్రౌండ్
కార్యకర్త నుంచి సీఎం పదవి దాకా అలుపెరుగని పయనం
ఒక్కోమెట్టే ఎక్కుతూ అత్యున్నత స్థాయికి చేరుకున్న కొందరు వ్యక్తుల జీవన పయనం ఆసక్తికరంగా ఉంటుంది. కొంతమంది నాయకులు అదృష్టం కొద్దో, అడ్డదారిలోనో అందలం ఎక్కితే మరికొందరు అవకాశాలను కల్పించుకుని అందరినీ మెప్పించి పైకొస్తారు. చంద్రబాబు నాయుడు మొదటి సారి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అందరికీ తెలుసు. ఆయన సీఎం అయ్యాక పాలు, పెరుగు అమ్మకాల కోసం కోట్ల రూపాయలతో హెరిటేజ్ సంస్థను ఏర్పాటు చేశారు. రెండు ఎకరాల ఆసామికి అన్ని వేల కోట్లు ఎలావచ్చాయని ఇప్పుడు ఎవరైనా అడిగితే పాలు పెరిగి అమ్మి సంపాదించామని నారా లోకేషే ఆమధ్య చెప్పుకున్నారు. చంద్రబాబు లాగా కాకుండా నిజంగానే పాలు అమ్మి సీఎం స్థాయికి చేరుకున్నారు సుఖ్విందర్ సింగ్ సుఖు. ఈయనే హిమాచల్ ప్రదేశ్ కు కొత్త ముఖ్యమంత్రి.
సుఖు నేపథ్యం గమనిస్తే వాళ్లది ఒక సాధారణ కుటుంబం. తండ్రి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్ గా పనిచేసేవారు. పదిహేడేళ్ల వయసులో కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తగా సుఖ్విందర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చదువుకునే రోజుల్లో పాలు అమ్మారు. ఛోటా సిమ్లాలో ఓ పాల బూత్ ను నిర్వహించారు. 1964 మార్చి 27న పుట్టిన సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీ నుంచి ఎంఏ, ఎల్ఎల్ బీ పూర్తిచేశారు. విద్యార్థి దశలో ఎన్ఎస్ యూఐలో చురుకుగా వ్యవహరించారు. సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కు రెండు సార్లు కౌన్సిలర్ గా కూడా సుఖ్విందర్ సేవలందించారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. తర్వాత యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు.
హామిర్పూర్లోని నాదౌన్ నుంచి 2003లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, 2013 నుంచి 2019 దాకా హెచ్పీసీసీ చీఫ్గా ఉన్నారు. ప్రస్తుతం పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న సుఖ్విందర్ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఐదోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి అభిమానం చూరగొన్న సుఖ్విందర్ను కాంగ్రెస్ అధిష్ఠానం హిమాచల్ ప్రదేశ్ కు 15వ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.