టీడీపీని ఇబ్బంది పెట్టేందుకు జగన్ వ్యూహం
చంద్రబాబుకున్న ప్రజాదరణను తగ్గించే ప్రయత్నం
క్షేత్రస్థాయిలో చంద్రబాబుకున్న ప్రజాదరణ చూసి ఆందోళన
బాబు రోడ్ షోలకు భారీగా జనం
అమరావతే ఏకైక రాజధాని అంటున్న ప్రజలు
మూడు రాజధానులకు ఫిక్సయిన జగనన్న
విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ఉంటుందన్న ధర్మాన
శ్రీబాగ్ ఒప్పందాన్ని గుర్తుచేస్తున్న మేథావులు
అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వెనుకాడని వైసీపీ
పాదయాత్రను విరమించుకునేందుకు రైతుల నిర్ణయం
టీడీపీని ఇబ్బంది పెట్టేందుకు వైసీపీ సమర్థమైన గేమ్ ప్లాన్ ను అమలు చేస్తోంది. బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబుకు వస్తున్న స్పందనను నిర్వీర్యం చేయడానికి తన శైలిలో ఆటాడుతోంది అడుగడుగునా చంద్రబాబుకు అవరోధాలు సృష్టిస్తూ జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే వత్తిడి పెంచి రైతుల పాదయాత్రను విరమించుకునే స్థాయికి తీసుకెళ్లింది. చంద్రబాబు పాపులారిటీని కంట్రోల్ చేయాలని జగన్ డిసైడయ్యారు. టీడీపీ వేగాన్ని నిలువరించే ప్లాన్ అమలు చేస్తున్నారు. చంద్రబాబు అయినా సరే, ఆయనకు మద్దతిచ్చే అమరావతి రైతులైనా సరే వైసీపీకి ధీటుగా ఉంటడానికి వీల్లేదని వైసీపీ శ్రేణులకు చెప్పేశారు. దానితో అడ్డగింత ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు టీడీపీ అధినేత కర్నూలు పర్యటనలో కూడా అదే కనిపించింది.
జగన్ పాలనపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వ్యతిరేకత మొదలైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ విమర్శనాస్త్రాల వేడిని పెంచింది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి జనంతో మమేకమవుతూ మరోసారి జగన్ కు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలు కావడం ఖాయమని ప్రచారం చేస్తోంది. పైగా జగన్ నిర్వహించే ప్రారంభోత్సవాలు, సభలకు జనం రాకపోవడం తాము నిర్వహిస్తున్నట్లు ప్రచార ఫలితమేనని టీడీపీ చెప్పుకుంటోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు కర్నూలు జిల్లాలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్కడ ఆయనకు విశేష స్పందన వస్తోంది. రోడ్ షోలకు ఇసుక వేస్తే చాలనంత జనం కనిపిస్తున్నారు. జగన్ పై బాబు వదిలే డైలాగులకు జనం కేరింతలు కొడుతున్నారు. చంద్రబాబు కూడా జనాన్ని చూసి రెచ్చిపోయి ఎగస్ట్రాగా నాలుగు డైలాగులు వదులుతున్నారు. మూడు రాజధానులు ఉండవని అమరావతే ఏకైక రాజధాని అని రోడ్ షోలకు వచ్చిన జనంతో చంద్రబాబు చెప్పిస్తున్నారు.
చంద్రబాబు తీరు జగన్ కు టెన్షన్ తెప్పిస్తోంది. మొక్కలోనే తుంచెయ్యకపోతే ఎన్నికల నాటికి పరిస్థితి మరింత ప్రతికూలంగా మారుతుందని జగన్ నిర్థారణకు వచ్చారు. పైగా మూడు రాజధానులకు డైసైడైన జగన్ దీన్ని అదునుగా తీసుకున్నారు. ఏకంగా కర్నూలు జనాన్ని, అక్కడి లాయర్లను చంద్రబాబుపై ఉసి గొల్పరు. అంతే వైసీపీకి మద్దతిచ్చే కర్నూలు న్యాయవాదులు చంద్రబాబు బసచేసే హోటల్ దగ్గర నిరసన చేపట్టారు. కర్నూలు న్యాయ రాజధానిపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారు చంద్రబాబు గడ్డం, రాయలసీమకు అడ్డం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దానితో టీడీపీ కార్యకర్తలు, వైసీపీ లాయర్ల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జగన్ కు కావాల్సిందీ జరిగిపోయింది. మరో పక్క మేథావులు, విద్యాధికులను కూడా రెచ్చగొట్టారు. ఒకటే రాజధాని అయితే ఇక రాయలసీమ ఎడారేనని వాళ్లు చెబుతున్నారు. శ్రీబాగ్ ఒపందాన్ని ప్రకారం కర్నూలుకు హైకోర్టు రావాలని డిమాండ్ చేస్తున్నారు. జనం మరిచిపోయిన శ్రీబాగ్ ను మళ్లీ గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు కూడా మూడు రాజధానుల పేరుతో ర్యాలీలు నిర్వహిస్తూ రాయలసీమ, నెల్లూరు, ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారు..
ఇంతకాలం ఉద్యమించిన అమరావతి రైతులు ఇప్పుడు జగన్ దెబ్బకు భయపడుతున్నారు. అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర చేస్తుంటే పోలీసులతో అడ్డుకోవాలని చూశారు. రాజమండ్రిలో స్థానిక ఎంపీ మార్గాని భరత్ నేతృత్వంలో వైసీపీ శ్రేణులు అమరావతి రైతులకు అడ్డుపడి నిరసనలు నిర్వహించారు. రైతులపై రాళ్ల దాడి చేశారు. హైకోర్టు కూడా రైతుల యాత్రకు అనుమతి ఇచ్చినప్పటికీ ఐడీ కార్డులు లేవంటూ ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. దానితో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో మహా పాదయాత్రను ఎంటర్ కానివ్వబోమని అక్కడి వైసీసీ మంత్రులు పరోక్షంగా హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ మాత్రమే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ఉంటుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు తేల్చేశారు. దానితో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే జగన్ వ్యూహం బయటపడింది. ఇక పాదయాత్ర కొనసాగిస్తే రక్తపాతం జరిగినా ఆశ్చర్యం లేదని గ్రహించిన అమరావతి రైతులు ఇప్పుడు దాన్ని విరమించుకునే ప్రయత్నంలో ఉన్నారు.