ఏపీలో వారసత్వ రాజకీయంపై చర్చ
వారసులకు నో ఛాన్స్ అంటున్న జగన్
జై కొడుతున్న చంద్రబాబు
2024 టార్గెట్ గా వైసీపీ, టీడీపీల ప్రత్యేకవ్యూహం
ఏపీలో వారసత్వ రాజకీయాలపై హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ ఇటీవల వర్క్ షాప్ లో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీశాయి. వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని జగన్ కుండబద్దలు కొట్టారు. వారసులను ప్రమోట్ చేసుకోండి…కానీ టికెట్ మాత్రం మీకే ఇస్తానంటూ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో చురుగ్గా తిరుగుతున్న యువ నాయకులు జగన్ నిర్ణయంతో సందిగ్ధంలో పడిపోగా…అటు పలువురు నేతలు, ఎమ్మెల్యేలు సైతం అంతర్మథనంలో పడ్డారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా… కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల బదులు వారసులు జనంలో తిరుగుతున్నారు. వయసు, ఆరోగ్యసమస్యల కారణంగానో లేక వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోతే వారసులను బరిలో నిలపవచ్చని ఎమ్మెల్యేలు భావించారో తెలియదు గానీ…జగన్ మాత్రం వారసులకు నో ఛాన్స్ అంటూ ఝలక్ ఇచ్చారు.
2024 ఎన్నికలను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 175కు 175 అసెంబ్లీ స్థానాలు గెలవాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. పనితీరు బాగోలేని ప్రజాప్రతినిథులకు చురకలంటిస్తున్నారు. మెరుగుపడాలని సలహాలు, సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రతి గడపను తట్టాలని దిశానిర్దేశం చేస్తున్నారు. జనంలోకి వెళ్లని నేతలకు టిక్కెట్ ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. దాంట్లో భాగంగానే, వచ్చే ఎన్నికల్లో వారసులను బరిలోకి దింపితే కొత్త ముఖాలను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న ఆందోళనతో ప్రభుత్వ పెద్దలున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్తలు, ఎనలిస్టులు కూడా కొత్త ముఖాలను దించడం సమంజసం కాదని చెప్పేశారట. రిస్క్ చేయడం మంచిది కాదనే ఉద్దేశంతోనే జగన్ మళ్లీ సిట్టింగ్ లకే సీట్లు అంటున్నారని సమాచారం. అందుకే, వారసులు కాకుండా ప్రతి ఎమ్మెల్యే గడపగడపకు తిరగాలని…ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని తేల్చిచెబుతున్నారు జగన్.
వారసుల ఎంట్రీపై జగన్ అలా ఉంటే….టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వారసత్వానికి జై కొడుతున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఇంచార్జిగా శ్రీనివాసులరెడ్డి బదులుగా దినేశ్ రెడ్డిని ప్రకటించడమే అందుకు ఉదాహరణ. 2019 ఎన్నికల్లోనూ టీడీపీలోని చాలా మంది సీనియర్ నేతలు తమ వారసులను బరిలోకి దింపారు. దాదాపు 40 మందికి టిక్కెట్ ఇచ్చి చంద్రబాబు పెద్ద సాహసమే చేశారు. కానీ, వాళ్లందరూ దాదాపుగా ఓడిపోయారు. ఈసారి కూడా వారసులను పెద్ద ఎత్తున రంగంలోకి దింపబోతున్నారు. లోకేష్ యువనాయకులను ప్రోత్సహిస్తుండడంతో…పార్టీలో అంతా కొత్తతరం ముందుకు వస్తోంది. ఇప్పటికే చంద్రబాబు కూడా యువతకు 40శాతం టిక్కెట్ల ఇస్తానని ప్రకటించారు. చంద్రబాబు ఆ కోటాను పార్టీ సీనియర్ల వారసులతో భర్తీ చేస్తారని సమాచారం.