తెలంగాణ, ఏపీ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.

By KTV Telugu On 2 October, 2022
image

*జగన్‌ సర్కారు పై టీఆర్‌ఎస్‌ మంత్రుల ఆరోపణలు
*కౌంటర్లతో విరుచుకుపడిన ఏపీ మంత్రులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మ‌ధ్య మాట‌ల యుద్ధం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల‌పై కేసులు పెట్టి జైల్లో వేస్తోంద‌ని తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు చేసిన ఆరోప‌ణ‌లతో అగ్గి రాజుకుంది. హరిశ్‌రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. హరిశ్‌రావు ఒకసారి ఏపీకి వచ్చి ఇక్కడి ఉపాధ్యాయులను అడిగితే వాస్తవాలు తెలుస్తాయని బొత్స అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఒక ఉద్యోగిని హరిశ్‌రావు కాలితో తన్నిన విషయం ఎవరూ మర్చిపోలేదని మంత్రి అమర్‌నాథ్‌ గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమపథకాలపై చర్చకు సిద్ధమా అని మంత్రి అంబటి రాంబాబు హరిశ్‌రావును సవాల్‌ చేశారు. ఇక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ కేసీఆర్‌తో హ‌రీశ్ రావుకు విభేదాలుంటే వాళ్లే ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించారు. సజ్జల వ్యాఖ్యల‌పై తెలంగాణ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ రియాక్టయ్యారు. వైఎస్సార్ కుటుంబాన్ని స‌జ్జ‌ల విచ్ఛిన్నం చేశార‌ని ఆరోపించారు. త‌ల్లిని కొడుకును, అన్నా, చెల్లిని కూడా ఆయనే విడ‌దీశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. వైఎస్సార్ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసిన స‌జ్జ‌ల‌… ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని విడ‌దీయ‌డానికి య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. 2014కు ముందు అస‌లు స‌జ్జ‌ల అంటే ఎవ‌రికి తెలియదని అన్నారు గంగుల. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత వైసీపీలో చేరిన స‌జ్జ‌ల‌… ఆ పార్టీని ఉడుములా ప‌ట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అమలువుతున్న ప‌థ‌కాలు ఎక్కడా లేవని, వాటి గురించి చెబుతూ పొరుగు రాష్ట్రాల గురించి ప్ర‌స్తావిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. త‌మ‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో 2014కు ముందు ఉద్య‌మంలోనే చూపించామ‌ని గుర్తు చేశారు. ఇక‌నుంచైనా త‌మ‌తో పెట్టుకోవ‌ద్ద‌ని వైసీపీ నేత‌ల‌ను హెచ్చరించారు గంగుల. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల రియాక్షన్‌ ఎలా ఉంటుందో మరి.