మునుగోడుకు 86 మంది ఇన్‌చార్జులు

By KTV Telugu On 6 October, 2022
image

1. చావో రేవో అంటున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు
2. రంగంలోకి దిగిన మంత్రులు హరిశ్‌రావ్, కేటీఆర్‌

నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల కావడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఎన్నికలను కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బై ఎలక్షన్‌లో గెలుపు కోసం తన పార్టీ శ్రేణులను మొత్తం మునుగోడులో మోహరించారు. నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీల వారీగా మొత్తం 86 మంది పార్టీ నేతలను ఇంచార్జిలుగా కేసీఆర్‌ నియమించారు. చండూరు మున్సిపాలిటీకి ఐదుగురిని, చండూరు మండలానికి 11 మందిని, చౌటుప్పల్ మున్సిపాలిటీకి 10 మందిని, చౌటుప్పల్ మండలానికి 12 మందిని, మర్రిగూడ మండలానికి 11 మందిని, మునుగోడు మండలానికి 13 మందిని, నాంపల్లి మండలానికి 11 మందిని, నారాయణపూర్ మండలానికి 13 మందిని ఇంచార్జిలుగా నియమించారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతలను మంత్రులు కేటీఆర్‌‌, హరీశ్‌‌రావుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే అప్పగించారు. మునుగోడు నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ ఇన్‌‌చార్జీలుగా నియమితులైన వారంతా పండుగ మరుసటి రోజు వారికి కేటాయించిన గ్రామాలకు వెళ్లాలని కేసీఆర్ ఆదేశించారు. ఎన్నికల ప్రచారం ముగిసే దాకా నియోజకవర్గంలోనే ఉండి ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి ఎమ్మెల్యే 20 మంది అనుచరులతో కలిసి గ్రామాలకు వెళ్లాలన్నారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని చెప్పారు. మంత్రి జగదీశ్‌‌ రెడ్డి ఆధ్వర్యంలో ఇంచార్జిలు ప్రచారం చేయాలని.. కేటీఆర్‌‌, హరీశ్‌‌ రావు ఎప్పటికప్పుడు ప్రచార సరళిని పర్యవేక్షిస్తారని చెప్పారు. ఇక తనవంతుగా ఈనెల నాలుగో వారంలో మునుగోడులో ప్రచారానికి వస్తానని పార్టీ శ్రేణులకు చెప్పారు కేసీఆర్‌.