కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేయరట..కారణం అదేనా ?

By KTV Telugu On 8 October, 2022
image

ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కేసీఆర్‌. ఇతర రాష్ట్రాల్లో చిన్నచితకా పార్టీలను కలుపుకుని, మరికొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని బీఆర్‌ఎస్‌ అస్తిత్వం నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మాత్రం
ఎంపీగా పోటీచేయరని అన్నారు కేటీఆర్‌. తాను వెనకుండి పార్టీని నడిపించాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ఆలోచన వెనకాల ఒక వ్యూహం దాగుంది. తాను గనుక జాతీయ రాజకీయాలంటూ దేశమంతా తిరిగితే తెలంగాణ రాష్ట్రాన్ని గాలికొదిలేశారు… ఓట్లేసిన ప్రజలను పట్టించుకోవడం మానేశారు అని ప్రత్యర్థులు విమర్శించే అవకాశం ఉంది. అందుకే… రాష్ట్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. అని బిఆర్ఎస్ ప్రకటన సందర్భంగానే కేసీఆర్ ప్రకటించారు. ఈ లెక్కన 2023లొ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఎమ్మెల్యేగానే పోటీచేస్తారు. గెలిస్తే మూడోసారి అధికారంలోకి వస్తారు. ఆ తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతా బిఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దించి ముఖ్యమంత్రి హోదాలో వారి తరఫున ప్రచారం చేస్తారు. కొత్తగా పెట్టిన బిఆర్ఎస్‌ను ప్రజలు ఎలా ఆదరిస్తారో తెలియదు. అందుకే కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తారు…కానీ దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు. 17 సీట్లున్న తెలంగాణలో ప్రస్తుతం ఆయనకున్న బలం కేవలం 9 మంది ఎంపీలు మాత్రమే. ఒకవేళ నరేంద్రమోడీ మూడోసారి అధికారంలోకి వస్తే కేసీఆర్ ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో కూచోడానికి నామోషీ అడ్డొస్తుంది. అసలు బిఆర్ఎస్ కు ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు. ఒకవేళ విపక్ష కూటమి అధికారంలోకి వచ్చే వాతావరణం ఏర్పడి..బిఆర్ఎస్ సాధించిన ఎంపీల మద్దతు కీలకంగా మారితే..అప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పవచ్చని కేసీఆర్‌ వ్యూహం. ఈ పరిణామాలన్నింటిని దృష్ఠిలో పెట్టుకునే కేసీఆర్ ఎంపీగా పోటీచేయబోరని కేటీఆర్ ప్రకటించారు అనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.