కేసీఆర్‌ ఫస్ట్‌ టార్గెట్‌ కర్ణాటక

By KTV Telugu On 6 October, 2022
image

1. కర్ణాటకలో బీఆర్ఎస్ జెండా ఎగరాలన్న కేసీఆర్‌
2. మహారాష్ట్ర, కర్ణాటక తమ మొదటి కార్యక్షేత్రాలన్న కేసీఆర్‌

త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌ తో కలిసి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో కొత్త పార్టీ పేరును ఆయన ప్రకటించారు. తాను దేశంలో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు… టీఆర్ఎస్ ను తెలంగాణకే పరిమితం చేస్తే ఎలాగని చాలా మంది తనను ప్రశ్నించారని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ తొలి కార్యక్షేత్రాలు కర్ణాటక, మహారాష్ట్ర అని తెలిపారు. త్వరలోనే ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలందరూ తమతో పాటు కలిసొస్తారని చెప్పారు.
దేశంలో అనేక పార్టీలకు రాజకీయం అనేది ఒక క్రీడలా మారిపోయిందని.. తనకు మాత్రం రాజకీయం అనేది ఒక టాస్క్ వంటిదని చెప్పారు. దేశంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందని… మన దేశం బంగ్లాదేశ్ కంటే వెనుకబడిందని అన్నారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసమే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు. రైతు సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అజెండా అని తెలిపారు. సీఎం కేసీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడు అని కర్ణాటక మాజీ సీఎం, జేడీయూ నేత హెచ్ డీ కుమారస్వామి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని కితాబిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపాలని.. దేశమంతటా తెలంగాణ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమాజ్‌వాదీ సీనియర్‌ నాయకుడు ములాయం సింగ్‌ ఆరోగ్యం బాగా లేనందున అఖిలేష్‌ యాదవ్‌ను ఈ సమావేశానికి రావొద్దని చెప్పానని కేసీఆర్‌ తెలిపారు. తమతో కలిసి ముందుకు సాగడానికి దేశ వ్యాప్తంగా అనేక పార్టీల నాయకులు ముందుకొస్తున్నారని వివరించారు.