కమలదళంలో కన్ఫ్యూజన్..!

By KTV Telugu On 25 October, 2022
image

ప్రభుత్వంపై పోరుకు కలిసిరావాలన్న బాబు
ఏపీ బీజేపీ నేతల్లో భిన్న స్వరాలు
వద్దని ఓవర్గం, వెళ్లాలని మరోవర్గం
పొత్తులపై గందరగోళ ప్రకటనలు

ఏపీలో విపక్ష పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం గందరగోళంగా మారింది. చంద్రబాబు- పవన్ కల్యాణ్ ల భేటీతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలన్నీ మారిపోతున్నాయి. ప్రభుత్వంపై పోరుకు విపక్షాలన్నీ కలిసి రావాలని బాబు, పవన్ లు కోరుతున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ స్టాండ్ ఏవిధంగా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోసారి టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి నడుస్తాయా? లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. విపక్ష పార్టీల్లోనే కాదు..అధికారపార్టీలోనూ ఆ త్రయం పొత్తు వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది.

ఇక, టీడీపీతో పొత్తు అంశంపై ఏపీ బీజేపీ నేతల భిన్న ప్రకటనలు కేడర్ ను గందరగోళానికి గురిచేస్తున్నాయి. చంద్రబాబుతో కలిసి నడవబోమని ఆ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. అయితే, సునీల్ వ్యాఖ్యలను పార్టీలోని ఓ వర్గం స్వాగతిస్తుంటే…మరో వర్గం మాత్రం తప్పుబడుతోంది. పొత్తులపై ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా చెప్పేశారు. కానీ, ఆ పార్టీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించారు.

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తును జనం కోరుకుంటున్నారంటూ విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, పొత్తుల్ని డిసైడ్ చేయాల్సింది రాష్ట్ర నేతలు కాదంటూ సునీల్, సోములకు చురకలు అంటించారు. 2014లో టీడీపీ-బీజేపీ-జనసేనలు కలిసి రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేశాయి. 2019 ఎన్నికల్లో ఎవరి దారి వారు చూసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం మారిన తాజా రాజకీయ పరిస్థితుల్లో…. రాబోయే ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, పొత్తుల అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఎన్నికల నాటికి గానీ దీనిపై ఓ క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.